Alex Carey Hair Cut : అసలు ఆయన హెయిర్ కట్ చేయించుకోలేదు.. స్మిత్ క్లారిటీ
Alex Carey Hair Cut : ఆస్ట్రేలియా క్రికెటర్ అలెక్స్ కారీ మీద కొన్ని రోజులుగా ఓ వివాదం నడుస్తోంది. సెలూన్లో హెయిర్ కట్ చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని అతడిపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టివ్ స్మిత్ స్పందించాడు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా(ENG Vs AUS) మధ్య యాషెస్ సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. యాషెస్ సిరీస్(Ashes Series)లో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. బెయిర్‌స్టో రెండో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ చేతిలో స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో ఇంగ్లండ్ అభిమానులు లార్డ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై నిరసనకు దిగారు. అంతే కాకుండా అలెక్స్ కారీ స్టంపింగ్ పై UK అంతటా విమర్శలు చేశారు. మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు మైదానంలోకి దిగినప్పుడు కూడా ఇంగ్లండ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ స్థితిలో హెయిర్ కట్ కోసం లండన్ లోని ఓ సెలూన్ షాప్ వెళ్లిన అలెక్స్ కారీ(Alex Carey) డబ్బు చెల్లించకుండా వచ్చాడని వివాదం తలెత్తింది. ఈ విషయమై సెలూన్ యజమాని ఆడమ్ మహ్మద్ వచ్చే సోమవారంలోగా అలెక్స్ కారీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఇంగ్లండ్‌లోని ఓ వార్తాపత్రిక పేర్కొంది. దీంతో ఆస్ట్రేలియన్ అభిమానులు షాక్ అయ్యారు.
దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా జట్టులోని మరో వ్యక్తి సెలూన్‌కి వెళ్లాడు. దానికి సరైన రుసుము కూడా చెల్లించాడు. చెల్లించినందుకు రశీదు కూడా ఉందని తెలిపింది. 'మేము లండన్‌కు వచ్చినప్పటి నుండి అలెక్స్ కారీ తన జుట్టును కత్తిరించుకోలేదని, ప్రచురించిన వార్త వాస్తవం కాదు.' అని ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన థ్రెడ్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో ఆగ్రహంతో ఉన్న ఆస్ట్రేలియా అభిమానులు ఇంగ్లండ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏమని ప్రచారం జరిగిందంటే..
డేవిడ్ వార్నర్, అలెక్స్ కారీ, ఉస్మాన్ ఖవాజా హెయిర్ కట్ చేయించేందుకు UKలోని ఒక సెలూన్‌కు వెళ్లారు. జుట్టు కత్తిరించిన తర్వాత.. తమ కార్డులు తీసి ఇచ్చారు. సెలూన్ యజమాని ఆడమ్.. నగదు మాత్రమే తీసుకుంటామని చెప్పాడు. ఖవాజా, వార్నర్ డబ్బులు చెల్లించారు.
అలెక్స్ కారీ మాత్రం హోటల్‌కి వెళ్లి వెంటనే డబ్బు పంపిస్తానని చెప్పాడు. అయితే హోటల్‌కు వెళ్లిన అలెక్స్ కారీ డబ్బులు చెల్లించలేదని సెలూన్ యజమాని తెలిపారు. ఈ స్థితిలో సోమవారంలోగా డబ్బులు చెల్లించాలని షాపు యజమాని డిమాండ్ చేశాడని వార్తలు వచ్చాయి. అసలు అలెక్స్ హెయిర్ కట్ కూడా చేయించుకోలేదని స్టివ్ స్మిత్ చెబుతున్నాడు. కావాలనే ప్రచారం చేశారని ఆస్ట్రేలియా అభిమానులు అంటున్నారు.