Rohit Sharma on Dhoni: ధోనీ మరో రెండు, మూడేళ్లు ఆడేంత ఫిట్‌గా ఉన్నాడు: రోహిత్
Rohit Sharma on Dhoni: ధోనీ మరో రెండు, మూడేళ్లు ఆడేంత ఫిట్‌గా ఉన్నాడని అన్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అన్న వార్తలు వస్తుండటంపై రోహిత్ ఇలా స్పందించాడు.
Rohit Sharma on Dhoni: ఇండియన్ క్రికెట్ టీమ్ కు ధోనీ రెండున్నరేళ్ల కిందటే గుడ్ బై చెప్పాడు. ఇక ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. గత రెండు, మూడు సీజన్ల నుంచి ఇదే ధోనీకి చివరి సీజన్ అంటున్నారు. ఈసారి ఐపీఎల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కచ్చితంగా ధోనీ తన చివరి సీజన్ ఆడబోతున్నాడని తేల్చేస్తున్నారు.
గత సీజన్ లో ధోనీ మాట్లాడుతూ.. 2023లో ఇండియాలోని ప్రతి స్టేడియంలో ఆడి ఐపీఎల్ కు గుడ్ బై చెప్పే అవకాశం వస్తే అంతకు మించి కావాల్సింది ఏముంటుందని ధోనీ అన్నాడు. దీంతో అభిమానులు దీనికే ఫిక్సయ్యారు. అయితే టీమిండియా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వాదన మాత్రం మరోలా ఉంది. మరిన్ని సీజన్లు ఆడే సత్తా ధోనీకి ఉందని రోహిత్ అనడం విశేషం.
కోచ్ మార్క్ బౌచర్ తో కలిసి బుధవారం (మార్చి 29) రోహిత్ మీడియాతో మాట్లాడాడు. "గత రెండు, మూడు సీజన్ల నుంచి ధోనీకి ఇదే చివరి సీజన్ కాబోతోంది అన్న వార్తలు నేను వింటున్నాను. అతడు మరిన్ని సీజన్లు ఆడేంత ఫిట్ గా ఉన్నాడని నేను భావిస్తున్నాను" అని రోహిత్ చెప్పాడు. 2008లో జరిగిన తొలి సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తోనే కొనసాగుతున్న ధోనీ.. ఇప్పటికీ ఆ టీమ్ లో కీలకంగా ఉన్నాడు.
అయితే యువ క్రికెటర్ల హవా ఎక్కువగా ఉండే టీ20 క్రికెట్ లో 41 ఏళ్ల ధోనీ ఇంకెన్నాళ్లు కొనసాగుతాడన్న విమర్శలూ ఉన్నాయి. ఇప్పటి వరకూ ఐపీఎల్లో 234 మ్యాచ్ లు ఆడిన ధోనీ 4978 రన్స్ చేశాడు. అతని కెప్టెన్సీలో సీఎస్కే నాలుగు టైటిల్స్ కూడా గెలిచింది. ఈసారి సొంత ప్రేక్షకుల ముందు చివరిసారి ఆడి ఐపీఎల్ కు ఓ ఆటగాడిగా గుడ్ బై చెప్పి.. మరో హోదాలో చెన్నై టీమ్ లోనే కొనసాగాలన్నది ధోనీ ప్లాన్.
2020 నుంచి చెన్నై టీమ్ సొంతగడ్డపై ఆడలేదు. 2021లో చెన్నైలో ఓ మ్యాచ్ జరిగినా.. తర్వాత కరోనా కేసులు పెరగడంతో టోర్నీని యూఏఈకి తరలించారు. ఆ తర్వాత గత సీజన్ మొత్తం ముంబై, పుణెల్లోనే జరిగింది. ఈసారి మళ్లీ హోమ్, అవే పద్ధతిలో పది జట్లూ తమ సొంత మైదానంతోపాటు ప్రత్యర్థి మైదానాల్లో ఆడనున్నాయి. దీంతో ధోనీకి దేశంలోని పది నగరాల్లో ఆడే అవకాశం దక్కనుంది.
సంబంధిత కథనం