Lara on SRH: ఉప్పల్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిన సన్ రైజర్స్.. కోచ్ లారా రియాక్షన్ ఇదీ-lara on srh winning only one game at uppal stadium ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lara On Srh: ఉప్పల్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిన సన్ రైజర్స్.. కోచ్ లారా రియాక్షన్ ఇదీ

Lara on SRH: ఉప్పల్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిన సన్ రైజర్స్.. కోచ్ లారా రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu
May 19, 2023 12:36 PM IST

Lara on SRH: ఉప్పల్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడింది సన్ రైజర్స్ హైదరాబాద్. దీనిపై కోచ్ లారా రియాక్టయ్యాడు. మొత్తానికి 2023 సీజన్ లో కూడా హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్‌హెచ్ కు కలిసి రాలేదు.

ఉప్పల్లో ఏడు మ్యాచ్ లలో కేవలం ఒకదాంట్లోనే గెలిచిన సన్ రైజర్స్
ఉప్పల్లో ఏడు మ్యాచ్ లలో కేవలం ఒకదాంట్లోనే గెలిచిన సన్ రైజర్స్ (PTI)

Lara on SRH: ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో అసలే కలిసిరాలేదు. ఈ సీజన్ లో ఉప్పల్లో ఆడిన ఏడు మ్యాచ్ లలో ఆరు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రమే సన్ రైజర్స్ గెలిచారు. ఇక రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతుల్లో ఓడిపోయింది.

ఈ సీజన్ లో మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నా.. అది ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరుగుతుంది. మొత్తానికి గురువారం (మే 18) సొంతగడ్డపై జరిగిన చివరి మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ చేతుల్లో ఓడింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ వరుస ఓటములపై హెడ్ కోచ్ బ్రియాన్ లారా స్పందించాడు.

అయితే ఈ మ్యాచ్ లో తమ టీమ్ ప్రదర్శనతో తానేమీ నిరాశ చెందడం లేదని లారా అన్నాడు. "ఇవాళ మ్యాచ్ ప్రదర్శనతో నేనేమీ పూర్తిగా నిరాశ చెందలేదు. మా వాళ్లు మంచి క్రికెట్ ఆడారు. కానీ విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెస్సి మాపై తమ అత్యుత్తమ క్రికెట్ ఆడారు. ఈ సీజన్ మొత్తం వాళ్లు ఆర్సీబీ తరఫున బాగా ఆడారు.

అతడు ఆరెంజ్ క్యాప్ లీడర్. వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ వాళ్లు. మాది చాలా యంగ్ టీమ్. అనుభవంతోపాటు ఆటతీరు మెరగవుతుంది. ఈ సీజన్ ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ కు చాలా కఠినంగా సాగింది. సొంతగడ్డపై మ్యాచ్ లను సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయాం.

హైదరాబాద్ లో వసతులు, కండిషన్స్ చాలా బాగున్నాయి. ఆ రోజు బాగా ఆడిన టీమే గెలిచింది. ఇలాంటి పిచ్ లు తయారు చేసిన గ్రౌండ్ స్టాఫ్ కు నా అభినందనలు. ఏడు మ్యాచ్ లలో కేవలం ఒకదాంట్లోనే గెలవడం మేము ఊహించనిదే. వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలి" అని లారా అన్నాడు.

ఇక తాను కూడా 22 ఏళ్ల వయసులో గ్రీనిడ్జ్ లాంటి సీనియర్లతో కలిసి ఆడానని, వాళ్లతో 12 నెలలు కలిసి ఆడిన తర్వాత మెరుగైనట్లు చెప్పాడు. అందుకే ఇప్పుడు సన్ రైజర్స్ లో ఉన్న యువ ఆటగాళ్లు కూడా మెరుగవడానికి కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. సన్ రైజర్స్ ప్రస్తుతం 13 మ్యాచ్ లలో కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల టేబుల్లో అట్టడుగున ఉంది.

సంబంధిత కథనం