PBKS vs RR: పంజాబ్ vs రాజస్థాన్.. ఎవరు గెలిస్తే ఏమవుతుంది?-pbks vs rr today on may 19th what happens if rr win ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Pbks Vs Rr Today On May 19th What Happens If Rr Win

PBKS vs RR: పంజాబ్ vs రాజస్థాన్.. ఎవరు గెలిస్తే ఏమవుతుంది?

Hari Prasad S HT Telugu
May 19, 2023 11:21 AM IST

PBKS vs RR: పంజాబ్ vs రాజస్థాన్.. ఎవరు గెలిస్తే ఏమవుతుంది? ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన సమయంలో శుక్రవారం (మే 19) మరో కీలకమైన మ్యాచ్ జరగబోతోంది.

పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య డూ ఆర్ డై మ్యాచ్
పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య డూ ఆర్ డై మ్యాచ్

PBKS vs RR: పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ డూ ఆర్ డై సమరానికి సిద్ధమవుతున్నాయి. ప్లేఆఫ్స్ అవకాశాలు మిణుకు మిణకుమంటున్న సమయంలో ఈ రెండు జట్లు గెలిచి నిలవాలని భావిస్తున్నాయి. నిజానికి ఈ రెండు జట్లూ సాంకేతికంగా రేసులో ఉన్నా.. ప్లేఆఫ్స్ చేరడం అంత సులువు కాదు. ఈ రెండు టీమ్స్ ఇప్పటికే 13 మ్యాచ్ లు ఆడి ఆరింట్లో గెలిచాయి.

ట్రెండింగ్ వార్తలు

రెండు జట్ల దగ్గరా 12 పాయింట్లే ఉన్నా.. నెట్ రన్‌రేట్ పరంగా రాజస్థాన్ రాయల్స్ (0.140).. పంజాబ్ కింగ్స్ (-0.308) కంటే చాలా మెరుగ్గా ఉంది. అందుకే ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కంటే రాజస్థాన్ రాయల్స్ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎవరు గెలిచినా.. ముంబై, ఆర్సీబీ జట్లు గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఓడిన జట్టు ఇంటికెళ్లిపోతుంది.

పంజాబ్ vs రాజస్థాన్.. ఎవరు గెలిస్తే ఏంటి?

గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ మొదట్లో బాగానే ఆడినా.. గత 8 మ్యాచ్ లలో ఆరు ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో గెలిచినా నేరుగా ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుందన్న నమ్మకం లేదు. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తమ చివరి మ్యాచ్ లలో ఓడితోనే రాజస్థాన్ కు అవకాశం ఉంటుంది. అయితే ఆ జట్టు నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటమే కాస్త ఊరట కలిగించే విషయం.

పంజాబ్ కింగ్స్ పై భారీ విజయం సాధిస్తే.. రాయల్స్ ప్లేఆఫ్స్ పై ఆశలు పెట్టుకోవచ్చు. అదే సమయంలో గుజరాత్ టైటన్స్ చేతుల్లో ఆర్సీబీ, సన్ రైజర్స్ చేతుల్లో ముంబై ఓడిపోవాలని ప్రార్థించాలి. అటు కేకేఆర్ కూడా చివరి మ్యాచ్ లో లక్నో చేతుల్లో ఓడితే రాయల్స్ ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంది. పంజాబ్ చేతుల్లో ఓడితే మాత్రం ఇంటికెళ్లిపోతుంది.

మరోవైపు 12 పాయింట్లతోనే ఉన్న పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అయితే వాళ్ల నెట్ రన్‌రేట్ నెగటివ్ గా ఉండటం వాళ్లకు ప్రతికూలాంశం. రాయల్స్ పై భారీ విజయం సాధించడంతోపాటు ఆర్సీబీ, ముంబై, కేకేఆర్ చిత్తుచిత్తుగా ఓడాలని ప్రార్థిస్తూ కూర్చోవాలి. ఒకవేళ రాయల్స్ చేతుల్లో ఓడితే మాత్రం పంజాబ్ కింగ్స్ ఇంటిదారి పడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం