Kane Williamson Ruled Out: గుజరాత్‌ ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్‌కు విలియమ్సన్ దూరం-kane williamson ruled out of ipl 2023 with knee injury ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kane Williamson Ruled Out: గుజరాత్‌ ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్‌కు విలియమ్సన్ దూరం

Kane Williamson Ruled Out: గుజరాత్‌ ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్‌కు విలియమ్సన్ దూరం

Kane Williamson Ruled Out: గుజరాత్ టైటాన్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. గాయం కారణంగా అతడు మొత్తం ఐపీఎల్ సీజన్‌కే అందుబాటులో ఉండట్లేదని గుజరాత్ జట్టు అధికారికంగా ప్రకటించింది.

ఐపీఎల్‌కు కేన్ విలియమ్సన్ దూరం (AP)

Kane Williamson Ruled Out: ఐపీఎల్ 2023 సీజన్‌ను విజయంతో ఆరంభించిన గుజరాత్ టైటాన్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. గాయం కారణంగా అతడు సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ప్రకటించింది. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో విలియమ్సన్ మోకాలికి గాయమైంది. దీంతో అతడి స్థానంలో సాయి సుదర్శన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసుకుని బ్యాటింగ్ ఆడించింది గుజరాత్.

చైన్నై ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన షాట్‌ను ఆపేందుకు ప్రయత్నించిన కేన్ విలియమ్సన్ కింద పడి గాయపడ్డాడు. దీంతో నొప్పితో కుడి మోకాలిని పట్టుకుని నడవలేకపోయాడు. అప్పుడే ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మైదానం నుంచి నిష్క్రమించాడు. అనంతరం ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. అతడి స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడించింది గుజరాత్ జట్టు. తాజాగా విలియమ్సన్ వైద్య పరీక్షల అనంతరం గాయంపై గుజరాత్ అధికారిక ప్రకటన చేసింది.

"టాటా ఐపీఎల్ 2023 సీజన్‌కు కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు గాయపడటంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. విలియమ్సన్ త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం." అని గుజరాత్ టైటాన్స్ పేర్కొంది.

గతేడాది డిసెంబరులో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో గుజరాత్ జట్టు కేన్ విలియమ్సన్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ వరకు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు నేతృత్వం వహించిన విలియమ్సన్‌ను ఈ సారి గుజరాత్ సొంతం చేసుకుంది. మిడిలార్డర్‌లో కీలకమవుతాడని భావించిన అతడు.. గాయం కారణంగా వైదొలగడం గుజరాత్‌కు పెద్ద ఎదురుదెబ్బే అని క్రీడా నిపుణులు అంటున్నారు.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్(63) అర్ధశతకంతో ఆకట్టుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే గుజరాత్ విజయాన్ని అందుకుంది. చెన్నై బౌలర్లలో రాజవర్ధన్ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 92 పరుగులతో రాణించాడు.