Jadeja vs csk: జడేజాకు ఏమైంది? సీఎస్కేకు వ్యతిరేకంగా ఈ పోస్టులేంటి?-jadeja vs csk as all rounder put another cryptic post after reaching final ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jadeja Vs Csk: జడేజాకు ఏమైంది? సీఎస్కేకు వ్యతిరేకంగా ఈ పోస్టులేంటి?

Jadeja vs csk: జడేజాకు ఏమైంది? సీఎస్కేకు వ్యతిరేకంగా ఈ పోస్టులేంటి?

Hari Prasad S HT Telugu
May 24, 2023 01:58 PM IST

Jadeja vs csk: జడేజాకు ఏమైంది? సీఎస్కేకు వ్యతిరేకంగా ఈ పోస్టులేంటి? రికార్డు స్థాయిలో పదోసారి సీఎస్కే టీమ్ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టిన తర్వాత జడ్డూ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.

రవీంద్ర జడేజా, ధోనీ
రవీంద్ర జడేజా, ధోనీ (PTI)

Jadeja vs csk: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ సీజన్ లో చేస్తున్న కొన్ని పోస్టులతోపాటు వివాదాస్పద పోస్టులకు చేస్తున్న లైక్స్ చర్చనీయాంశం అవుతున్న విషయం తెలుసు కదా. ముఖ్యంగా అతడు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులపై గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ మధ్య ఓ మ్యాచ్ లో తాను ఎంత బాగా ఆడుతున్నా.. ధోనీ బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అతడు ఔట్ కావాలని అరవడం జడ్డూని బాధించింది.

అప్పుడే ఓ వ్యక్తి చేసిన వివాదాస్పద పోస్టుకు అతడు లైక్ కొట్టాడు. జడ్డూ మ్యాచ్ ముగిసిన తర్వాత నవ్వుతూ ఈ విషయం చెప్పినా.. లోలోపల అతడు చాలా బాధపడుతున్నాడన్నది ఆ పోస్ట్ సారాంశం. దీనిని జడ్డూ లైక్ చేయడంతో ధోనీ, సీఎస్కే జట్టుతో జడేజాకు ఇంకా పడటం లేదా అన్న అనుమానాలు కలిగాయి. తాజాగా ఆ టీమ్ రికార్డు స్థాయిలో పదోసారి ఫైనల్ చేరిన తర్వాత కూడా జడేజా ఓ పోస్ట్ చేశాడు.

అప్‌స్టాక్స్‌కు తాను మోస్ట్ వాల్యుబుల్ అసెట్ ఆఫ్ ద మ్యాచ్ అని తెలుసు కానీ.. కొందరు ఫ్యాన్స్ కే తెలియదు అంటూ సీఎస్కే అభిమానులకు అతడు కౌంటర్ వేశాడు. ఈ పోస్టులో ఎవరినీ అతడు నేరుగా ప్రస్తావించలేదు కానీ.. జడేజా ఉద్దేశమేంటో అందరికీ తెలిసిపోయింది. తాను సీఎస్కేను ఎన్ని మ్యాచ్ లలో గెలిపిస్తున్నా.. ఆ టీమ్ ఫ్యాన్స్ మాత్రం దానిని గుర్తించడం లేదన్నది జడ్డూ ఆలోచనగా కనిపిస్తోంది.

గతేడాది తనను కెప్టెన్ గా నియమించి, తర్వాత టీమ్ వైఫల్యంతో పక్కన పెట్టి, ధోనీని మళ్లీ కెప్టెన్ చేసినప్పటి నుంచే జడేజా, సీఎస్కే మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతన్ని రీటెయిన్ చేసుకోవడం కూడా సందేహమే అని అనుకున్నారు. కానీ జడేజాను సీఎస్కే టీమ్ రీటెయిన్ చేసుకుంది. ఈ ఏడాది అతడు టీమ్ విజయాల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

తాజాగా తొలి క్వాలిఫయర్ లో మొదట కఠినమైన పిచ్ పిచ్ పై 16 బంతుల్లోనే 22 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్ లో 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతన్ని అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యుబుల్ అసెట్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇదే ఫొటోను అప్‌లోడ్ చేస్తూ జడేజా.. సీఎస్కే అభిమానులపై కౌంటర్ వేశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం