Warner on Axar Patel: అక్షర్‌ను అందుకే బౌలింగ్ చేయించలేదు.. గుజరాత్‌తో మ్యాచ్‌పై వార్నర్ స్పందన-david warner explains his decision to not bowl axar patel against gujarat titans ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Warner On Axar Patel: అక్షర్‌ను అందుకే బౌలింగ్ చేయించలేదు.. గుజరాత్‌తో మ్యాచ్‌పై వార్నర్ స్పందన

Warner on Axar Patel: అక్షర్‌ను అందుకే బౌలింగ్ చేయించలేదు.. గుజరాత్‌తో మ్యాచ్‌పై వార్నర్ స్పందన

Maragani Govardhan HT Telugu
Apr 05, 2023 06:27 AM IST

Warner on Axar Patel: దిల్లీ క్యాపిటల్స్.. మంగళవారం నాడు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడంపై డేవిడ్ వార్నర్ వివరించాడు.

డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్ (AFP)

Warner on Axar Patel: గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌లో అదరగొడుతోంది. ఇప్పటికే చెన్నైతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన ఈ టీమ్.. మంగళవారం నాడు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా మ్యాచ్ గుజరాత్ గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడారు. సొంత వేదికపై జరిగిన మ్యాచ్‌లో ఓడటం గురించి స్పందించారు.

"ఆరంభంలో గుజరాత్ సీమర్లకు పిచ్ బాగా అనుకూలించింది. ఈ విషయంలో నేను సర్ ప్రైజ్ అయ్యానని మీరనుకోవద్దు. అయితే ఇది ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంది. మరోవైపు స్వింగ్ తక్కువగా ఉంది. వారు పరిస్థితులకు అనుగుణంగా ఆడి విజయం సాధించారు. ఇక్కడ మేము మరో 6 గేమ్‌లు ఆడాల్సి ఉంది." అని డేవిడ్ వార్నర్ అన్నాడు.

అక్షర్ పటేల్‌తో బౌలింగ్ చేయించకపోవడంపై వార్నర్ స్పష్టత ఇచ్చాడు.

"మొదటి కొన్ని ఓవర్లలో మేము స్వింగ్‌ను ఆశించాం. బ్యాక్ ఎండ్ వరకు గేమ్‌లోనే ఉన్నాము. కానీ సాయి సుదర్శన్ బాగా ఆడాడు. మిల్లర్ చేయాల్సిన పనిని అతడే చేశాడు. మంచుతో కూడా కాస్త ఇబ్బంది ఎదురైంది. ఈ పిచ్‌పై 180 నుంచి 190 పరుగులు చేయకపోతే సవాలుగా ఉంటుంది. పిచ్ పరిస్థితులు, వికెట్ కారణంగానే అక్షర్ పటేల్‌తో బౌలింగ్ చేయించలేదు. ఇంకా మ్యాచ్‌లు ఉన్నాయి." అని వార్నర్ తెలిపాడు.

దిల్లీపై గుజరాత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్(62, 48 బంతుల్లో) అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకోగా.. డేవిడ్ మిల్లర్ 16 బంతుల్లో 32 పరుగులతో చెలరేగాడు. వీరిద్దరి కారణంగా గుజరాత్ విజయాన్ని సాధించింది. దిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జే 2 వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. వార్నర్(37), అక్షర్ పటేల్(36) మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేదు. గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లు తీశారు.

Whats_app_banner