Asia Cup 2023 : ఆసియా కప్, ప్రపంచకప్‌కు పాకిస్థాన్ దూరం!.. కారణం ఇదే-asia cup 2023 move to srilanka and set to be played without pakistan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asia Cup 2023 : ఆసియా కప్, ప్రపంచకప్‌కు పాకిస్థాన్ దూరం!.. కారణం ఇదే

Asia Cup 2023 : ఆసియా కప్, ప్రపంచకప్‌కు పాకిస్థాన్ దూరం!.. కారణం ఇదే

HT Telugu Desk HT Telugu
Jun 01, 2023 11:42 AM IST

Asia Cup 2023 : ఆసియా కప్ లో పాకిస్థాన్ ఆడటం అనుమానంగానే ఉంది. ఈ ఈవెంట్‌లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఆడనున్నాయి.

రోహిత్, బాబార్
రోహిత్, బాబార్

ఆసియా కప్(Asia Cup 2023) విషయంలో ప్రస్తుతానికి భారత్-పాకిస్థాన్ (IND Vs PAK) మధ్య టగ్ ఆఫ్ వార్ ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ ఏడాది ఆసియా కప్‌కు ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్, హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించింది. భారత్ తో జరిగే మ్యాచులను తటస్థ వేదిక మీద నిర్వహిస్తామని చెప్పి.. ఆసియా కప్ ఆతిథ్య హక్కులను నిలుపుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఈ నిర్ణయానికి బీసీసీఐ(BCCI) అంగీకరించలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ లేకుండానే 2023 ఆసియా కప్‌ జరగనున్నట్టుగా తెలుస్తోంది. నివేదికల ప్రకారం, టోర్నమెంట్‌కు అధికారిక హోస్ట్ అయిన పాకిస్థాన్(Pakistan) మినహా కాంటినెంటల్ టోర్నమెంట్ ఆడటానికి ACC సభ్యులందరూ అంగీకరించినట్లు తెలిసింది. పాకిస్థాన్ కాకుండా వేరే దేశంలో ఆసియా కప్ నిర్వహించేందుకు అంగీకరించినట్లు సమాచారం. కానీ పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్ల పాకిస్థాన్ తన నిర్ణయాన్ని సడలించకపోతే ఈసారి పాక్ జట్టు లేకుండానే ఆసియాకప్ జరగనుంది.

ACC అధ్యక్షుడు కూడా అయిన BCCI సెక్రటరీ జై షా, శ్రీలంకలో ఆసియా కప్ ఆడటానికి ఆసియా కౌన్సిల్‌లోని ఇతర సభ్యులను ఒప్పించారని వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్ దుబాయ్‌(Dubai)లో ఆడితే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కాబట్టి అక్కడి వాతావరణంతో ఆడటం కష్టం. అందువల్ల పాకిస్థాన్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను బీసీసీఐ తిరస్కరించినట్లు పేర్కొంది.

ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) రాబోయే ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలన్నీ శ్రీలంకలో ఆసియా కప్ ఆడేందుకు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)కి స్పష్టమైన సందేశం పంపే అవకాశాలు ఉన్నాయి. అలాగే, శ్రీలంకలో ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ కాకుండా ఇతర దేశాల నుంచి మద్దతు ఎక్కువగా ఉన్నందున, ACC నిర్ణయాన్ని అంగీకరించడం లేదా పూర్తిగా వైదొలగడం మినహా పాకిస్థాన్‌కు ఇప్పుడు వేరే మార్గం లేదు.

ఒకవేళ ఈ ఈవెంట్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాల్గొనకపోతే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఆసియా కప్‌లో ఆడతాయి. అయితే ఇప్పుడు పాకిస్థాన్‌ హైబ్రిడ్ మోడల్‌ను భారత్ తిరస్కరిస్తే.. అక్టోబర్, నవంబర్‌లలో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం ఉంది.