IPL 2023 Auction: ఐపీఎల్‌ వేలంపై ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ప్రభావం ఎంత? ఈసారి రైట్‌ టు మ్యాచ్ కార్డు ఉంటుందా?-ipl 2023 auction how impact player rule going to impact the auction this time ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Auction: ఐపీఎల్‌ వేలంపై ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ప్రభావం ఎంత? ఈసారి రైట్‌ టు మ్యాచ్ కార్డు ఉంటుందా?

IPL 2023 Auction: ఐపీఎల్‌ వేలంపై ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ప్రభావం ఎంత? ఈసారి రైట్‌ టు మ్యాచ్ కార్డు ఉంటుందా?

Hari Prasad S HT Telugu
Dec 22, 2022 03:34 PM IST

IPL 2023 Auction: ఐపీఎల్‌ వేలంపై ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ప్రభావం ఎంత వరకూ ఉండనుంది? ఈసారి రైట్‌ టు మ్యాచ్ కార్డు ఉంటుందా? ఇవీ శుక్రవారం (డిసెంబర్‌ 23) జరగబోయే ఐపీఎల్‌ మినీ వేలం ముందు అభిమానుల్లో ఉన్న సందేహాలు.

ఐపీఎల్ వేలం 2023 కొచ్చిలో జరగనుంది
ఐపీఎల్ వేలం 2023 కొచ్చిలో జరగనుంది (Twitter)

IPL 2023 Auction: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మరోసారి వేలం పాటకు వేళయింది. ఈసారి పది ఫ్రాంఛైజీలు మినీ వేలంలో 405 మంది ప్లేయర్స్‌ నుంచి తమకు కావాల్సిన 87 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేయనున్నాయి. పేరుకు మినీ వేలమే అయినా.. బెన్‌ స్టోక్స్‌, సామ్‌ కరన్, కామెరాన్‌ గ్రీన్‌, పూరన్‌లాంటి విదేశీ స్టార్లు.. మయాంక్‌ అగర్వాల్‌, మనీష్‌ పాండేలాంటి ఇండియన్‌ ప్లేయర్స్‌ ఉండటంతో హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది.

అయితే వచ్చే సీజన్‌ నుంచి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను పరిచయం చేయనుండటంతో ఆ ప్రభావం వేలంపై ఎంత వరకూ ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. ప్లేయర్స్‌ను కొనుగోలు చేసే సమయంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను కూడా ఆయా ఫ్రాంఛైజీలు పరిగణనలోకి తీసుకుంటాయా లేదా అన్నది చూడాలి. ఇక ప్రతి టీమ్‌ తమ దగ్గర మిగిలిన ఉన్న డబ్బు, తమకు ఎలాంటి ప్లేయర్‌ అవసరం అన్న అంశాలను చూసి బిడ్డింగ్‌లో పాల్గొననున్నాయి.

ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌.. అసలు ఎవరు?

ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌ నుంచి కొత్తగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అనే రూల్‌ను తీసుకొస్తున్నారు. దీని ప్రకారం.. ఒక్కో టీమ్‌కు ఓ సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ను మ్యాచ్‌ మధ్యలో పూర్తిగా తుది జట్టులో భాగం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఇంపాక్ట్ ప్లేయర్‌ దేశవాళీ క్రికెటరే అయి ఉండాలన్న నిబంధన ఉంది. ఒకవేళ తుది జట్టులో నలుగురి కంటే తక్కువ మంది విదేశీ ప్లేయర్స్‌తో ఆడిన సందర్భంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా విదేశీ ప్లేయర్‌ను కూడా తీసుకునే వీలుంటుంది.

ఓ ఇన్నింగ్స్‌ ప్రారంభం కాక ముందే.. లేదంటే ఓ ఓవర్‌ పూర్తియిన సమయంలో లేదా వికెట్‌ పడినప్పుడు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను సదరు టీమ్‌ కెప్టెన్‌ ఫీల్డ్‌లోకి తీసుకురావచ్చు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఏ ప్లేయర్ స్థానంలో వస్తాడో ఆ ప్లేయర్‌కు ఇక మ్యాచ్‌లో కొనసాగే అవకాశం ఉండదు. అయితే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ దేశవాళీ క్రికెటరే అయి ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఈ అంశాన్ని వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

వేలంలో రైట్‌ టు మ్యాచ్ కార్డు ఉంటుందా?

ఈసారి ఐపీఎల్ వేలంలో రైట్‌ టు మ్యాచ్ కార్డు లేదు. దీని ప్రకారం గతంలో తాము రిలీజ్‌ చేసిన ఓ ప్లేయర్‌ కోసం వేలంలో మరో టీమ్‌ బిడ్‌ దాఖలు చేసినా.. ఈ రైట్‌ టు మ్యాచ్‌ కార్డు ఉపయోగించి తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉండేది. ఈ నిబంధనను 2018లో తొలిసారి పరిచయం చేసినా.. తర్వాత దీనిపై చర్చించి ఈ రూల్‌ను తొలగించాలని నిర్ణయించారు.

ఈసారి వేలం వేసేది ఎవరు?

గత మెగా వేలంలో ఉన్న హ్యూ ఎడ్మీడసే ఈసారి కూడా ప్లేయర్స్‌ను వేలం వేయనున్నాడు. 2018లో రిచర్డ్‌ మ్యాడ్లీ స్థానంలో ఎడ్మీడస్‌ వచ్చాడు. అయితే మెగా వేలం తొలి రోజు దురదృష్టవశాత్తూ ఎడ్మీడస్‌ కళ్లు తిరిగి పడిపోవడంతో చారు శర్మ చాలా వరకూ వేలం పనులు చేసుకున్నారు. చివర్లో మరోసారి ఎడ్మీడస్‌ కోలుకొని వచ్చాడు. ఈసారి కూడా అతనే బాధ్యతలు తీసుకోనున్నాడు.

వేలంలో సైలెంట్‌ టైబ్రేకర్‌ ఏంటి?

ఈసారి వేలంలో సైలెంట్ టైబ్రేకర్‌ను పరిచయం చేస్తున్నారు. దీని ప్రకారం ఓ ప్లేయర్ కోసం రెండు ఫ్రాంఛైజీలు తీవ్రంగా ప్రయత్నించి తమ దగ్గర ఉన్న మొత్తం డబ్బులు ఖర్చు చేసేస్తే.. రెండు ఫ్రాంఛైజీలు తమ చివరి బిడ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అందులో అత్యధిక బిడ్‌ వేసిన ఫ్రాంఛైజీకి ఆ ప్లేయర్‌ వెళ్తాడు. తమ పరిమితిని దాటిని అదనపు డబ్బును సమర్పించాల్సి ఉంటుంది.

WhatsApp channel

టాపిక్