IPL Auction 2022 Details: ఐపీఎల్ వేలంలో ఈ ఐదుగురు విదేశీ ప్లేయర్స్‌కు ఫుల్ డిమాండ్.. రికార్డులు బ్రేకవుతాయా?
IPL Auction 2022 Details: ఐపీఎల్ వేలానికి టైమ్ దగ్గర పడింది. శుక్రవారం (డిసెంబర్ 23) ఈ మినీ వేలం జరగనుంది. ఈ వేలంలో ఐదుగురు విదేశీ ప్లేయర్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
IPL Auction 2022 Details: ఐపీఎల్ మరోసారి ప్లేయర్స్ వేలంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 16వ ఎడిషన్ ఐపీఎల్ కోసం ఈసారి మినీ వేలం జరగనుంది. ఈ వేలం శుక్రవారం (డిసెంబర్ 23) జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలం గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్న కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ వేలం ఎప్పుడు? ఎక్కడ చూడాలి?
ఐపీఎల్ వేలం శుక్రవారం (డిసెంబర్ 23) కొచ్చిలో జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ వేలం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మెగా వేలం జరగగా.. ఈసారి మినీ వేలంతో సరిపెట్టనున్నారు. ఈ వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ బ్రాడ్‌కాస్ట్ చేయనుంది. ఇక ఆన్‌లైన్‌లో జియో సినిమాలో ఈ లైవ్ చూడొచ్చు.
వేలంలో మొత్తం ఎంత మంది ప్లేయర్స్?
ఈ సారి వేలంలో పాల్గొనేందుకు మొత్తం 991 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నా.. అందులో నుంచి 405 మందిని ఫ్రాంఛైజీలు ఫైనల్ చేశాయి. అయితే వీళ్ల నుంచి గరిష్ఠంగా 87 మంది ప్లేయర్స్‌ను మాత్రమే ఫ్రాంఛైజీలు తీసుకునే అవకాశం ఉంది. వీళ్లలో 30 మంది విదేశీ ప్లేయర్స్ ఉండొచ్చు. ఇక వేలంలో పాల్గొనే వాళ్లలో మొత్తం 273 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. 132 మంది విదేశీ ప్లేయర్స్. 119 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్లు కాగా.. 286 మంది ఇప్పటి వరకూ తమ నేషనల్ టీమ్స్‌కు ఆడలేదు.
ఏ టీమ్ దగ్గర ఎంత మొత్తం?
సన్ రైజర్స్ హైదరాబాద్ (రూ.42.25 కోట్లు), పంజాబ్ కింగ్స్ (రూ.32.20 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (రూ.23.35 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ.20.55 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (రూ.20.45 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.19.45 కోట్లు), గుజరాత్ టైటన్స్ (రూ.19.25 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (రూ.13.2 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ.8.75 కోట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ.7.05 కోట్లు)
ఈ విదేశీ ప్లేయర్స్‌కు ఫుల్ డిమాండ్
ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో ఐదుగురు విదేశీ ప్లేయర్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 87 ప్లేయర్స్‌ను ఫ్రాంఛైజీలు తీసుకునే వీలున్నా.. కూడా ఈసారి విదేశీ ప్లేయర్స్‌కు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. వీళ్లలో ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అందరి కంటే ముందున్నాడు. ఈ ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశం ఉంది.
స్టోక్స్ కోసం ప్రధానంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టిగా ప్రయత్నించనుంది. కెప్టెన్‌గానూ స్టోక్స్ సక్సెస్ కావడం సన్‌రైజర్స్‌ను ఆకర్షిస్తోంది. ఈ టీమ్ దగ్గర అత్యధికంగా రూ42.25 కోట్లు ఉండటం వాళ్లకు కలిసొచ్చేదే. ఈసారి వేలంలో అత్యధిక ధర పలకనున్న ప్లేయర్‌గా స్లోక్స్ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న రూ.16.25 కోట్ల రికార్డు మరుగున పడవచ్చు.
ఇక ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్ కూడా ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు. ఇతడు ఇండియాలో టీ20 ఫార్మాట్‌లో చెలరేగి ఆడాడు. ఈ మెరుపులతో అతనికి ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కింది. ఈసారి వేలంలో గ్రీన్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఉన్నాడు. విదేశీ ఆల్‌రౌండర్ కోసం చూస్తున్న ఫ్రాంఛైజీలు గ్రీన్ కోసం ప్రయత్నించవచ్చు.
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించాడు. ఫైనల్లో మూడు వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లకు ఆడిన సామ్ కరన్.. ఈసారి ఫ్రాంఛైజీలను ఆకర్షిస్తున్నాడు. బ్యాట్‌తో అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించే కరన్ కూడా ఈ వేలంలో భారీ ధర పలకొచ్చు.
మరో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ కూడా ఈసారి వేలంలో ప్రధాన ఆకర్షణగా ఉన్నాడు. ఈ ఏడాదే పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అరంగేట్రం చేసిన బ్రూక్.. 8 ఇన్నింగ్స్‌లో 264 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 171.42గా ఉంది. మిడిలార్డర్‌లో మంచి విదేశీ బ్యాటర్ కోసం చూస్తున్న ఫ్రాంఛైజీలు బ్రూక్ కోసం పోటీ పడవచ్చు.
వెస్టిండీస్‌కు చెందిన నికొలస్ పూరన్ కూడా ఈసారి వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది. గత మెగా ఆక్షన్‌లో సన్‌రైజర్స్ అతన్ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసినా.. తర్వాత రిలీజ్ చేసింది. అయితే ఈ మధ్య అబుదాబిలో జరిగిన టీ10 లీగ్‌తో మళ్లీ గాడిలో పడ్డాడు. 10 ఇన్నింగ్స్‌లో 234 స్ట్రైక్‌రైట్‌తో 345 రన్స్ చేశాడు. దీంతో వేలంలో ఫ్రాంఛైజీలు పూరన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది.
టాపిక్