India vs Sri Lanka 1st ODI: విరాట్ కోహ్లి రికార్డు సెంచరీ.. లంకపై భారత్ భారీ స్కోరు
India vs Sri Lanka 1st ODI: విరాట్ కోహ్లి రికార్డు సెంచరీ చేయడంతో శ్రీలంకపై భారత్ భారీ స్కోరు సాధించింది. వన్డేల్లో 45వ సెంచరీతోపాటు సొంతగడ్డపై 20వ సెంచరీతో సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి సమం చేశాడు.
India vs Sri Lanka 1st ODI: కింగ్ కోహ్లి మరోసారి చెలరేగాడు. వన్డేల్లో వరుసగా రెండో సెంచరీ చేశాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో సెంచరీ చేసిన విరాట్.. ఇప్పుడు శ్రీలంకతో తొలి వన్డేలో సెంచరీ చేశాడు. అతనితోపాటు రోహిత్, శుభ్‌మన్ హాఫ్ సెంచరీలు చేయడంతో ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగుల భారీ స్కోరు చేసింది. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇండియా 400 మార్క్‌ను అందుకోలేకపోయింది.
కేవలం 80 బాల్స్‌లోనే సెంచరీ చేసిన కోహ్లికి వన్డేల్లో ఇది 45వ సెంచరీ కావడం విశేషం. అంతేకాదు సొంతగడ్డపై ఇది 20వ సెంచరీ. ఇప్పటి వరకూ సొంతగడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ సమం చేశాడు. వన్డేల్లో గతేడాది నాలుగేళ్ల సెంచరీ కరువుకు తెరదించుతూ బంగ్లాదేశ్‌పై మూడంకెల స్కోరు చేసిన కోహ్లి.. అదే ఊపును కొత్త ఏడాదిలోనూ కొనసాగించాడు.
ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 143 రన్స్ జోడించిన తర్వాత గిల్ ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ మొదటి నుంచీ చాలా కాన్ఫిడెంట్‌గా ఆడాడు. చివరికి 87 బంతుల్లోనే 113 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
అంతకుముందు రోహిత్ కూడా ధాటిగా ఆడాడు. వన్డేల్లో తన 30వ సెంచరీకి 17పరుగుల దూరంలో ఔటయ్యాడు. రోహిత్ కేవలం 67 బాల్స్‌లోనే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 రన్స్ చేశాడు. ఇక గిల్ కూడా 60 బాల్స్‌లోనే 11 ఫోర్లతో 70 రన్స్ చేశాడు. గిల్ తన ఇన్నింగ్స్‌లో రెండుసార్లు వరుసగా మూడు ఫోర్లు కొట్టడం విశేషం. శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 28), కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 39) కూడా బాగానే ఆడినా.. తమ స్కోర్లను భారీగా మలచలేకపోయారు.