Warner world record: వందో టెస్ట్‌లో వంద.. సచిన్‌ వరల్డ్‌ రికార్డును సమం చేసిన వార్నర్‌-warner world record with century in his 100th test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Warner World Record With Century In His 100th Test

Warner world record: వందో టెస్ట్‌లో వంద.. సచిన్‌ వరల్డ్‌ రికార్డును సమం చేసిన వార్నర్‌

Hari Prasad S HT Telugu
Dec 27, 2022 10:18 AM IST

Warner world record: వందో టెస్ట్‌లో వంద బాదాడు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌. ఈ క్రమంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వరల్డ్‌ రికార్డును సమం చేశాడు.

డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్

Warner world record: డేవిడ్‌ వార్నర్‌ విమర్శకులకు తనదైన రీతిలో సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న వందో టెస్ట్‌లో సెంచరీ బాదాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్ట్‌ రెండో రోజు వార్నర్‌ మూడంకెల స్కోరు అందుకున్నాడు. చాలా రోజులుగా టెస్ట్‌ క్రికెట్‌లో భారీగా పరుగులు చేయలేకపోతున్న అతడు.. మొత్తానికి జనవరి, 2020 తర్వాత ఈ ఫార్మాట్‌లో తొలి సెంచరీ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

గత 27 ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు హాఫ్ సెంచరీలు మాత్రమే చేసిన వార్నర్‌.. మొత్తానికి తన 100వ టెస్ట్‌లో సెంచరీ ద్వారా విమర్శకులకు గట్టి సమాధానమిచ్చాడు. ఇలా ఆస్ట్రేలియా తరఫున 100వ టెస్ట్‌లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా వార్నర్‌ నిలిచాడు. ఇంతకుముందు లెజెండరీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ మాత్రమే ఈ ఘనత సాధించాడు.

ఇక ఈ సెంచరీతో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ వరల్డ్‌ రికార్డును కూడా వార్నర్‌ సమం చేశాడు. వార్నర్‌కు టెస్టుల్లో ఇది 25వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 45వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీలను వార్నర్‌ ఓపెనర్‌గానే చేశాడు. సచిన్‌ కూడా ఓపెనర్‌గా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 45 సెంచరీలు చేశాడు. ఆ వరల్డ్‌ రికార్డునే వార్నర్‌ సమం చేశాడు.

ఇక ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న వాళ్లలో విరాట్‌ కోహ్లి (72 సెంచరీలు) తర్వాత ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌ కూడా వార్నరే. ఓపెనర్‌గా టెస్ట్‌ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన వాళ్లలో ఐదోస్థానంలో వార్నర్‌ నిలిచాడు. గవాస్కర్‌ 33 సెంచరీలతో టాప్‌లో ఉండగా.. కుక్‌ (31), హేడెన్‌ (30), గ్రేమ్‌ స్మిమ్‌ (27) అతని కంటే ముందున్నారు.

ఈ సెంచరీతో టెస్ట్‌ క్రికెట్‌లో 8 వేల పరుగుల మైలురాయిని కూడా వార్నర్‌ అందుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన 8వ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ బాక్సింగ్‌ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 189 పరుగులకే కుప్పకూలగా.. ఆస్ట్రేలియా కూడా 75 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయింది. అయితే వార్నర్‌ మాత్రం తనదైన స్టైల్లో ధాటిగా ఆడుతూ సెంచరీ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం