India vs Australia: ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ చూడనున్న రెండు దేశాల ప్రధానమంత్రులు
India vs Australia: ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ చూడనున్నారు రెండు దేశాల ప్రధానమంత్రులు. నరేంద్ర మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఈ మ్యాచ్ కు ప్రత్యేక అతిథులుగా రానున్నారు.
India vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వచ్చే గురువారం (మార్చి 9) నుంచి చివరిదైన నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలుసు కదా. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ తొలి రోజు ప్రత్యక్షం చూడటానికి ఇండియా, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులు రానుండటం విశేషం.
ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఈ మ్యాచ్ ను స్టాండ్స్ లో కూర్చొని చూడనున్నారు. మార్చి 8 నుంచి 11వ తేదీ వరకూ ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ఇండియా పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధానితో కలిసి మ్యాచ్ చూడాలని నిర్ణయించుకున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మరోసారి ఇండియా గెలుస్తుందా లేక ఆస్ట్రేలియా డ్రా చేయగలుగుతుందా తేలేది ఈ మ్యాచ్ లోనే.
తొలి రెండు టెస్టులు గెలిచి ఇండియా 2-0 ఆధిక్యం సంపాదించగా.. మూడో టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇక చివరిదైన నాలుగో టెస్టులో గెలిస్తే ఈ ట్రోఫీని వరుసగా నాలుగోసారి గెలవడంతోపాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు కూడా ఇండియా అర్హత సాధిస్తుంది. 2021లో నరేంద్ర మోదీ స్టేడియంగా మారిన తర్వాత ఇక్కడ ఆడిన రెండు టెస్టుల్లోనూ ఇండియా గెలిచింది.
తొలి మూడు టెస్టులలాగే ఈ చివరి మ్యాచ్ కు ముందు కూడా పిచ్ పైనే చర్చ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని ఈ స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మూడు టెస్టుల్లోనూ స్పిన్ కు విపరీతంగా అనుకూలించిన పిచ్ లు బ్యాటర్లకు పరీక్ష పెట్టాయి. తొలి రెండు టెస్టుల్లో టెయిలెండర్ల అండతో గట్టెక్కిన ఇండియా.. మూడో టెస్టులో మాత్రం దారుణ వైఫల్యంతో ఓటమి మూటగట్టుకుంది.
స్పిన్ ఉచ్చులో తామే చిక్కుకున్న నేపథ్యంలో మరోసారి నరేంద్ర మోదీ స్టేడియంలోనూ అలాంటి పిచ్ నే తయారు చేస్తారా లేక కాస్త బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ ఉంటుందా అన్నది చూడాలి. కెప్టెన్ రోహిత్ మాత్రం తాము ఇలాంటి స్పిన్ పిచ్ లపైనే ఆడాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం