Ind vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 39 ఏళ్లలో ఇదే తొలిసారి-india creates history by white washing west indies for the first time on their home soil ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Wi: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 39 ఏళ్లలో ఇదే తొలిసారి

Ind vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 39 ఏళ్లలో ఇదే తొలిసారి

Hari Prasad S HT Telugu
Jul 28, 2022 08:11 AM IST

Ind vs WI: శిఖర్‌ ధావన్‌ కెప్టెన్సీలోని టీమిండియా చరిత్ర సృష్టించింది. 39 ఏళ్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును ధావన్‌ సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటో తెలుసా?

<p>ఏ ఇండియన్ టీమ్ కెప్టెన్ కూ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్న ధావన్</p>
ఏ ఇండియన్ టీమ్ కెప్టెన్ కూ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్న ధావన్ (AFP)

పోర్ట్ ఆఫ్‌ స్పెయిన్‌: శిఖర్‌ ధావన్‌ కెప్టెన్సీలోని యంగిండియా ఎవరూ ఊహించని రికార్డును నమోదు చేసింది. వెస్టిండీస్‌ను వాళ్ల సొంతగడ్డపై క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో గెలిచింది. బుధవారం జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లోనూ డక్‌వర్త్‌ లూయిల్‌ మెథడ్‌ ప్రకారం 119 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి ఇప్పటివరకూ ఏ ఇండియన్‌ టీమ్‌కూ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది.

1983 నుంచి వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్తున్న ఇండియన్‌ టీమ్‌.. విండీస్‌ను వాళ్ల సొంతగడ్డపై ఇప్పటి వరకూ క్లీన్‌స్వీప్‌ చేయలేకపోయింది. 39 ఏళ్ల తర్వాత తొలిసారి ధావన్‌ కెప్టెన్సీలోని టీమ్‌ ఆ టీమ్‌ను వైట్‌వాష్‌ చేసింది. ఈ ఏడాది మొదట్లో వెస్టిండీస్‌.. ఇండియా వచ్చినప్పుడు కూడా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆ లెక్కన ఒకే కేలండర్‌ ఇయర్‌లో డబుల్‌ క్లీన్‌స్వీప్‌ ఘనతను కూడా టీమిండియా సొంతం చేసుకుంది.

బుధవారం జరిగిన చివరి వన్డేలో శుభ్‌మన్‌ గిల్‌ 98 రన్స్‌ చేయడం, చహల్‌ 4 వికెట్లు తీయడంతో విండీస్‌ను చిత్తు చేసింది ధావన్‌ సేన. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇండియా 225 రన్స్‌ చేయగా.. తర్వాత వెస్టిండీస్‌ 26 ఓవర్లలో 137 రన్స్‌కే ఆలౌటైంది. ఈ విజయం ద్వారా శిఖర్‌ ధావన్ కెప్టెన్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఓవరాల్‌గా వన్డే క్రికెట్‌లో ఇండియాకు ఇది 13వ క్లీన్‌స్వీప్‌. ఇక జింబాబ్వే (2013, 2015, 2016), శ్రీలంక (2017)ల తర్వాత విదేశీ గడ్డపై ఇండియన్‌ టీమ్‌ సాధించిన మరో క్లీన్‌స్వీప్‌ ఇది. ఒక కేలండర్‌ ఇయర్‌లో ఒక టీమ్‌ను డబుల్‌ వైట్‌వాష్‌ చేసిన మూడో టీమ్‌ ఇండియా. ఇంతకుముందు బంగ్లాదేశ్‌పై జింబాబ్వే, కెన్యాపై బంగ్లాదేశ్‌ ఈ ఘనత సాధించాయి.

అంతకుముందు రెండో వన్డేలో గెలవడం ద్వారా వెస్టిండీస్‌ గడ్డపై వన్డే సిరీస్‌ గెలిచిన ఇండియన్‌ కెప్టెన్లు గంగూలీ, ధోనీ, రైనా, కోహ్లిల సరసన శిఖర్‌ ధావన్‌ నిలిచాడు. ఇప్పుడు వాళ్లెవరికీ సాధ్యం కాని క్లీన్‌స్వీప్‌ రికార్డునూ సాధించాడు. 2002లో వెస్టిండీస్‌పై గడ్డపై తొలిసారి గంగూలీ కెప్టెన్సీలో 2-1తో వన్డే సిరీస్‌ను గెలిచింది టీమిండియా.

ఆ తర్వాత 2009లో ధోనీ కెప్టెన్సీలో, 2011లో రైనా కెప్టెన్సీలో మరోసారి విండీస్‌ను వాళ్ల గడ్డపై 2-1తో ఓడించింది. కోహ్లి కెప్టెన్సీలో రెండుసార్లు వెస్టిండీస్‌లో వన్డే సిరీస్‌లు గెలిచింది. తొలిసారి మూడు వన్డేల సిరీస్‌లో 2-0తో, 2017లో మరోసారి 3-1తో వన్డే సిరీస్‌లు గెలుచుకుంది.

Whats_app_banner

సంబంధిత కథనం