FIFA Women’s World Cup 2023: ఫుట్‍బాల్ మహిళల ప్రపంచకప్ ఫైనల్ రేపే.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
FIFA Women’s World Cup 2023 Final: ఫుట్‍బాల్ మహిళల ప్రపంచకప్ ఫైనల్‍కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్, స్పెయిన్ టైటిల్ కోసం తుదిపోరులో తలపడనున్నాయి.
FIFA Women’s World Cup 2023 Final: ఫిఫా మహిళల ప్రపంచకప్ 2023 తుది అంకానికి వచ్చింది. టైటిల్ కోసం ఫైనల్‍లో ఇంగ్లండ్, స్పెయిన్ మహిళల జట్లు తలపడనున్నాయి. రేపు (ఆగస్టు 20) సిడ్నీ వేదికగా ఈ ఫైనల్ ఫైట్ జరగనుంది. సుమారు నెలపాటు ఈ ప్రపంచకప్‍లో హోరాహోరీ మ్యాచ్‍లు జరగగా.. ఇంగ్లండ్, స్పెయిన్ తుదిపోరుకు వచ్చాయి. ఫుట్‍బాల్ మహిళల ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్‍కు చేరడం ఇంగ్లండ్, స్పెయిన్‍కు ఇదే తొలిసారి. ఏ జట్టు గెలిచినా మొదటిసారి టైటిల్ దక్కించుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఫుట్‍బాల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. సెమీఫైనల్‍లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్, స్వీడెన్‍పై స్పెయిన్ గెలిచి తుదిపోరుకు వచ్చాయి. ఇంగ్లండ్, స్పెయిన్ మధ్య ఫిఫా మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టైమింగ్స్, లైవ్ వివరాలు ఇవే.
ఫిఫా మహిళల ప్రపంచకప్ 2023 ఫైనల్ డేట్, టైమ్
ఇంగ్లండ్, స్పెయిన్ మధ్య ఫిఫా మహిళల ప్రపంచకప్ ఫైనల్ రేపు (ఆగస్టు 20) జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఏ టీవీ ఛానెల్‍లో..
ఫిఫా మహిళల ప్రపంచకప్ 2023 ఫైనల్.. ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్‌లో టెలికాస్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెల్‍లో రేపు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి లైవ్ చూడవచ్చు.
ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్..
ఇంగ్లండ్, స్పెయిన్ ఈ ఫుట్‍బాల్ మహిళల ప్రపంచకప్ ఫైనల్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ యాప్, వెబ్‍సైట్‍లో ఈ మ్యాచ్ లైవ్ వీక్షించవచ్చు.
గతేడాది యూరో టైటిల్‍ను గెలిచిన ఇంగ్లండ్ మహిళల ఫుట్‍బాల్ జట్టుకు.. ఇప్పుడు తొలిసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ దక్కించుకునే ఛాన్స్ వచ్చింది. గ్రూప్ స్టేజీలో ఓటమిని చూడని ఆ జట్టు టేబుల్ టాపర్ గా నాకౌట్ స్టేజ్‍కు వచ్చింది. ఆ తర్వాత కూడా సత్తాచాటింది. సెమీఫైనల్‍లో ఇంగ్లండ్ 3-1తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఇక, మరో సెమీస్‍లో స్పెయిన్ 2-1తో స్వీడెన్‍పై ఉత్కంఠ విజయం సాధించింది. మరి, ఇంగ్లండ్, స్పెయిన్ మహిళా ఫుట్‍బాల్ జట్లలో ఏది తొలిసారి ఫిఫా ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకుంటుందో రేపు (ఆగస్టు 20) తేలనుంది.