England vs Afghanistan: పసికూనపై ఇంగ్లాండ్ ఘనవిజయం.. టీ20 వరల్డ్ కప్‌లో బోణి
England vs Afghanistan: పెర్త్ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 112 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు బౌలింగ్‌లోనూ సత్తా చాటింది.
England vs Afghanistan: టీ20 వరల్డ్ కప్ 2022 సూపర్ 12 సమరం శనివారం ప్రారంభమైంది. ఈ రోజు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించగా.. ఇంగ్లాండ్-ఆఫ్గనిస్థాన్ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి ముందు ఆఫ్గాన్‌కు బ్యాటింగ్ అప్పజెప్పిన ఇంగ్లాండ్.. మెరుగైన ప్రదర్శన చేసింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్ నిర్దేశించిన 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ ఛేదించింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో లియామ్ లివింగ్‌స్టోన్ 29 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆఫ్గాన్ బౌలర్లలో ఫజాల్ హక్ ఫరూఖీ, ముజీబుర్ రెహమాన్, రషీద్ ఖాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, మహమ్మద్ నబీ తలో వికెట్ తీశారు.
112 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ సులభంగా ఛేజ్ చేసింది. ఓపెనర్లు జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ 35 పరుగుల మోస్తరు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ముందుగా ప్రమాదకర బట్లర్‌ను ఫరూఖీ ఔట్ చేశాడు. అనంతరం మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్‌ను ఫరీద్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. మరి కాసేపటికే బెన్ స్టోక్స్‌ను నబీ బౌల్డ్ చేశాడు. అయితే అప్పటికే స్కోరు 65 పరుగులు కావడంతో ఇంగ్లాండ్ పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేకుండా పోయింది. లియామ్ లివింగ్ స్టోన్ నిలకడగా ఆడుతూ.. ఇంగ్లాండ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. మధ్య మధ్యలో ఇంగ్లీష్ బ్యాటర్లు వికెట్లు కోల్పోతున్నప్పటికీ సునాయస విజయాన్ని అందుకుంది ఇంగ్లాండ్.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్థాన్ 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్(32), ఉస్మాన్ ఘనీ(30) మినహా మిగిలిన వారు విఫలం కావడంతో తక్కువ పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ బౌలర్ శామ్ కరణ్ 5 వికెట్లతో విజృంభించాడు. అంతేకాకుండా కేవలం 10 పరుగులే సమర్పించాడు. మార్క్ వుడ్, స్టోక్స్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
పసికూనలా కనిపించిన ఆఫ్గానిస్థాన్ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మెరుగైన ప్రదర్శించింది. లక్ష్యం తక్కువైనా కానీ 5 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. 19వ ఓవర్ వరకు ప్రత్యర్థి జట్టును తీసుకొచ్చింది. మరో 20 పరుగులు కానీ చేసి ఉంటే ఇంగ్లాండ్‌కు మరింత కష్టతరమయ్యేదే.
సంబంధిత కథనం