CSK tweet on Dhoni: ధోనీ రిటైరైనట్లేనా.. సీఎస్కే ఎమోషనల్ ట్వీట్‌తో ఫ్యాన్స్ ఆవేదన
CSK tweet on Dhoni: ధోనీ రిటైరైనట్లేనా? సీఎస్కే ఎమోషనల్ ట్వీట్‌తో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం (జూన్ 13) సాయంత్రం సీఎస్కే టీమ్ చేసిన నాలుగు పదాల ట్వీట్ వైరల్ అవుతోంది.
CSK tweet on Dhoni: ఎమ్మెస్ ధోనీ రిటైరవుతున్నాడా? లేక రిటైరైనట్లేనా? అతడు తన చివరి ఐపీఎల్ సీజన్ ఆడేశాడా? వచ్చే ఏడాది ఇక తిరిగి రాడా? మంగళవారం (జూన్ 13) సీఎస్కే టీమ్ చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ అభిమానులను గందరగోళానికి గురి చేసింది. కేవలం నాలుగు పదాల ట్వీట్ తో పాటు ఆ టీమ్ పోస్ట్ చేసిన వీడియో ఈ ప్రశ్నలను లేవనెత్తింది.
"ఓ కెప్టెన్, మై కెప్టెన్" అనే క్యాప్షన్ తో సీఎస్కే ఈ వీడియో పోస్ట్ చేసంది. ఆ 33 సెకన్ల వీడియోలో ధోనీ మెట్లు ఎక్కుతుండటం చూడొచ్చు. ఆ వీడియోపైనే 2023 ఐపీఎల్లో ధోనీ ఫొటోలను సూపర్ ఇంపోజ్ చేశారు. ఈ ట్వీట్ చూసి రిటైర్మెంట్ పై ధోనీ నిర్ణయం తీసుకున్నట్లేనా అన్న సందేహం అభిమానులు వ్యక్తం చేశారు. నిజానికి అతనికిదే చివరి సీజన్ అని అందరూ భావించారు.
కానీ ధోనీ మాత్రం ఫైనల్ ముగిసిన తర్వాత కూడా తన రిటైర్మెంట్ పై సస్పెన్స్ కొనసాగించాడు. ఇంకా వేలానికి ఏడు నెలల సమయం ఉందని, వచ్చే సీజన్ కు తన శరీరం సహకరిస్తుందో లేదో చూడాలని అతడు అన్నాడు. అయితే తాజాగా ఇప్పుడు సీఎస్కే ట్వీట్ తో ధోనీ ఆ నిర్ణయం తీసేసుకున్నాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మేము దీనికి సిద్ధంగా లేమని ఒకరు.. తలా దయచేసి రిటైర్ కావద్దని మరొకరు.. అతడు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడా అని ఇంకొకరు.. ఇలా సీఎస్కే ట్వీట్ పై అభిమానులు రకరకాలుగా స్పందించారు. ఐపీఎల్ 2023 గెలిచిన తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం అని చెబుతూనే చూద్దాం.. వచ్చే ఏడాది ఆడతానేమో అని ధోనీ అన్నాడు.
ఆ తర్వాత కొద్ది రోజులకే తన మోకాలి గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. 42 ఏళ్ల ధోనీ ఇప్పటికీ ఫిట్ గానే ఉన్నా.. వచ్చే ఏడాది నాటికి అతడు ఐపీఎల్ ఆడేంత ఫిట్ గా ఉంటాడా లేదా అన్నది అనుమానమే. అయితే ప్లేయర్ గా అతడు ఆడినా ఆడకపోయినా.. ఐపీఎల్లో ఏదో ఒక రూపంలో ఎల్లో జెర్సీలో మాత్రం ధోనీ కొనసాగడం ఖాయం అని చెప్పొచ్చు.
సంబంధిత కథనం