Wasim Akram on India: 2011లో గెలిచారేమోగానీ ఇప్పుడు కష్టమే.. ఇండియా వరల్డ్ కప్ అవకాశాలపై వసీం అక్రమ్
Wasim Akram on India: 2011లో గెలిచారేమోగానీ ఇప్పుడు కష్టమే అంటూ ఇండియా వరల్డ్ కప్ అవకాశాలపై వసీం అక్రమ్ స్పందించాడు. స్వదేశంలో ఆడే ఒత్తిడి టీమిండియాపై ఉంటుందని అతడు అన్నాడు.
Wasim Akram on India: ఇండియా చివరిసారి 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు స్వదేశంలో జరిగిన ఆ మెగా టోర్నీని రెండోసారి సొంతం చేసుకుంది. ఇప్పుడు 2023లోనూ వరల్డ్ కప్ ఇండియాలోనే జరగబోతోంది. ఈసారి కూడా ఫేవరెట్స్ లో ఒకటిగా ఇండియా బరిలోకి దిగుతున్నా.. ట్రోఫీ గెలుస్తుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా ఇదే అంటున్నాడు. స్వదేశంలో ఆడుతున్న ఒత్తిడి ఇండియాపై ఉంటుందని అతడు అన్నాడు. 2015, 2019లలో సెమీఫైనల్స్ లో ఓడిన ఇండియన్ టీమ్ కు వరల్డ్ కప్ కు ముందే వసీం ఓ హెచ్చరిక జారీ చేశాడు. స్వదేశంలో ఆడటం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో అంత ఒత్తిడి కూడా ఉంటుందన్నది వసీం వాదన.
"ఇండియా దగ్గర మహ్మద్ షమీ ఉన్నాడు. అతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ బుమ్రా కచ్చితంగా ఫిట్ గా ఉండాలి. అతని ఫిట్ నెస్ పరిస్థితేంటో నాకు తెలియదు. కానీ అతడుంటే మాత్రం కథ వేరుగా ఉంటుంది. మంచి స్పిన్నర్లు, ఆల్ రౌండర్లు కూడా ఉన్నారు. జడేజా, అశ్విన్ లలో ఎవరు ఆడతారో తెలియదు.
ఇండియాలో మంచి ప్లేయర్స్ ఉన్నా కూడా సొంత గ్రౌండ్ లో ఆడటంలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. 2011లో ఇండియా గెలిచింది కానీ ఎప్పుడూ కాస్త అదనపు ఒత్తిడి ఉంటుంది. పాకిస్థాన్ విషయంలోనూ అంతే. ఒకవేళ వాళ్లు ఆతిథ్యం ఇచ్చి ఉంటే వాళ్లపై కూడా ఒత్తిడి ఉండేది" అని అక్రమ్ రేడియో హాన్జీతో అన్నాడు.
ఇక వరల్డ్ కప్ లో తమ వేదికలను మార్చాల్సిందిగా పాకిస్థాన్ మొదట్లో అభ్యర్థించడంపై కూడా అక్రమ్ స్పందించాడు. "నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను. నేను ఓ వేదికలో, ఓ రోజున ఆడాల్సిందిగా కోరితే నేను ఆడాల్సిందే. అది అహ్మదాబాద్ లేదా చెన్నై లేదా కోల్‌కతా, ముంబైలలో ఏదైనా కావచ్చు. ఇది ప్లేయర్స్ పై ఎలాంటి ప్రభావం చూపదు. అందుకే దాని గురించి పెద్దగా ఆలోచించకుండా ఆడండి" అని అక్రమ్ అన్నాడు.
సంబంధిత కథనం