Babar Azam T20 Record: విరాట్ కోహ్లి టీ20 రికార్డ్‌ను సమం చేసిన బాబర్ ఆజం
Babar Azam T20 Record: టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లి రికార్డ్‌ను పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం సమం చేశాడు. ఆ రికార్డ్ ఏదంటే...
Babar Azam T20 Record: ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ నువ్వేనేనా అన్నట్లుగా హోరాహోరీగా సాగుతోంది. ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 3 - 3 తో ఇంగ్లాండ్, పాకిస్థాన్ సమంగా నిలిచాయి. శుక్రవారం జరిగిన ఆరో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం 59 బాల్స్‌లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 87 రన్స్ చేశాడు. అతడికి మిగిలిన వారి నుంచి సరైన సహకారం అందకపోవడంతో పాకిస్థాన్ మోస్తారు స్కోరుకు పరిమితమైంది.
లక్ష్యఛేదనలో ఓపెనర్ సాల్ట్ మెరవడంతో 14 ఓవర్లలో ఇంగ్లాండ్ విజయాన్ని అందుకున్నది. సాల్ట్ 41 బాల్స్‌లో మూడు సిక్సర్లు, పదమూడు ఫోర్లతో 88 రన్స్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయినా హాఫ్ సెంచరీతో రాణించిన బాబర్ ఆజం టీ20 క్రికెట్‌లో రెండు అరుదైన రికార్డులను క్రియేట్ చేశాడు.
టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా మూడు వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లి రికార్డును బాబర్ ఆజం సమం చేశాడు. కోహ్లి 81 ఇన్నింగ్స్‌లో మూడు వేల పరుగులు చేశాడు. సరిగ్గా 81 ఇన్నింగ్స్‌లలోనే బాబర్ ఆజం మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
అంతేకాకుండా టీ20 ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో మూడు వేల పరుగులు పూర్తిచేసుకున్న ఐదో క్రికెటర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ(Rohit sharma), విరాట్ కోహ్లి(Virat kohli), మార్టిన్ గప్టిల్ తో పాటు ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ మాత్రమే గతంలో ఈ మైలురాయిని అందుకున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆరో టీ20 మ్యాచ్‌తో బాబర్ ఆజం వారి సరసన నిలిచాడు. నిర్ణయాత్మక ఏడో టీ20 మ్యాచ్ ఆదివారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగనున్నది.