Asian Games 2023: శుభారంభం చేసిన భారత అథ్లెట్లు.. ఇప్పటి వరకు ఎన్ని పతకాలంటే?
Asian Games 2023: ఆసియా గేమ్స్ 2023లో భారత అథ్లెట్లు శుభారంభం చేశారు. తొలి రోజు ఇప్పటి వరకు ఐదు పతకాలు వచ్చాయి. వివరాలివే..
Asian Games 2023: ఆసియా గేమ్స్ 2023 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. చైనాలోని హాంగ్జౌలో ఈ గేమ్స్ ప్రారంభ వేడుక శనివారం జరగగా.. నేడు (సెప్టెంబర్ 24) క్రీడాపోటీలు షురూ అయ్యాయి. తొలి రోజే భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఇప్పటి వరకు (సెప్టెంబర్ 24న మధ్యాహ్నం) భారత్‍కు ఐదు పతకాలు వచ్చాయి. ఇందులో మూడు రజత (సిల్వర్/వెండి), రెండు కాంస్య (బ్రాంజ్) పతకాలు ఉన్నాయి. మరో మెడల్ కూడా ఖరారైంది. వివరాలివే..
ముందుగా, మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో ఆషి చౌస్కీ, మెహులీ ఘోష్, రమితా జిందాల్‍తో కూడిన భారత షూటర్ల జట్టు రజత పతకం దక్కించుకుంది. దీంతో ఈ 19వ ఎడిషన్ ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ చేసింది. అనంతరం రోయింగ్ లైట్ వైట్ డబుల్ స్కల్స్ ఈవెంట్‍లో భారత అథ్లెట్లు అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ సిల్వర్ మెడల్ సాధించారు.
పురుషుల 8 పెయిర్ రోయింగ్ ఈవెంట్లో భారత రోవర్లు బాలులాల్ యాదవ్, లేఖ్ రామ్ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. రోయింగ్‍లో టీమ్ ఈవెంట్‍లో నీరజ్, నరేశ్ కుల్వానియా, నితీశ్ కుమార్, చరణ్‍జీత్ సింగ్, జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశిష్, ఉత్తమ్ పాండేతో కూడిన భారత జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో తొలి రోజే రోయింగ్‍లో భారత్‍కు మూడు మెడల్స్ వచ్చాయి.
షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల వ్యక్తిగత ఈవెంట్‍లో భారత షూటర్ రమితా జిందాల్ కాంస్య పతకం గెలిచారు. దీంతో ఇప్పటి వరకు భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది.
మరోవైపు, భారత మహిళల క్రికెట్ టీమ్ నేడు బంగ్లాదేశ్‍పై సెమీఫైనల్‍లో విజయం సాధించి.. ఫైనల్‍కు చేరింది. దీంతో పతకాన్ని పక్కా చేసుకుంది. తుదిపోరులో గెలిస్తే భారత్‍కు స్వర్ణం రానుంది. ఒకవేళ తుదిపోరులో ఓడితే భారత మహిళల జట్టుకు సిల్వర్ మెడల్ దక్కుతుంది. ఆసియా గేమ్స్ మహిళల క్రికెట్ ఫైనల్స్ భారత్, శ్రీలంక మధ్య రేపు (సెప్టెంబర్ 25) జరగనుంది.
పురుషుల హాకీ పూల్-ఏ మ్యాచ్‍లో భారత జట్టు 16-0తో ఉజ్బెకిస్థాన్‍ను చిత్తు చేసింది.
కాగా, 2018లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత్ 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలు.. మొత్తంగా 70 పతకాలు గెలిచింది. ఇప్పుడు జరుగుతున్న 2023 ఎడిషన్‍లో భారత్‍కు అంతకంటే ఎక్కవ మెడల్స్ వస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఆసియా గేమ్స్ 2023 టోర్నీ అక్టోబర్ 8వ తేదీ వరకు జరుగుతుంది.