Asia Cup 2022: విరాట్‌ కోహ్లి నెట్స్‌లో అలా ఆడటం చూసి షాక్‌ తిన్నాను: రషీద్‌ ఖాన్‌-asia cup 2022 to commence soon as rashid khan talks about virat kohli ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asia Cup 2022: విరాట్‌ కోహ్లి నెట్స్‌లో అలా ఆడటం చూసి షాక్‌ తిన్నాను: రషీద్‌ ఖాన్‌

Asia Cup 2022: విరాట్‌ కోహ్లి నెట్స్‌లో అలా ఆడటం చూసి షాక్‌ తిన్నాను: రషీద్‌ ఖాన్‌

Hari Prasad S HT Telugu
Aug 25, 2022 01:05 PM IST

Asia Cup 2022: విరాట్‌ కోహ్లి నెట్ ప్రాక్టీస్‌ తనను షాక్‌కు గురి చేసిందని అన్నాడు ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్ ఖాన్‌. ఆసియా కప్‌ ప్రారంభానికి ముందు అతడు ఐపీఎల్‌ సందర్భంగా జరిగిన ఆ ఘటనను గుర్తు చేసుకున్నాడు.

దుబాయ్ లో బుధవారం ప్రాక్టీస్ కు ముందు రషీద్ ఖాన్ తో విరాట్ కోహ్లి
దుబాయ్ లో బుధవారం ప్రాక్టీస్ కు ముందు రషీద్ ఖాన్ తో విరాట్ కోహ్లి

Asia Cup 2022: ఆసియా కప్‌లో అందరి కళ్లూ ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌తోపాటు విరాట్ కోహ్లిపై కూడా ఉన్నాయి. చాలా రోజులుగా ఫామ్‌లో లేని అతడు ఈ కీలకమైన సిరీస్‌లో ఎలా ఆడతాడో అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కోహ్లి గొప్పతనాన్ని చెప్పుకొచ్చాడు ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌. ఈ ఏడాది ఐపీఎల్‌లో భాగంగా ఆర్సీబీ, గుజరాత్‌ టైటన్స్‌ మధ్య మ్యాచ్‌కు ముందు జరిగిన ఓ ఘటనను రషీద్‌ చెప్పాడు.

ఆ మ్యాచ్‌కు ముందు ప్లేయర్స్‌ అందరూ తమ నెట్‌ ప్రాక్టీస్‌ ముగించుకొని వెళ్లినా విరాట్‌ మాత్రం రెండున్నర గంటల పాటు అలా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడని రషీద్‌ తెలిపాడు. "ఐపీఎల్‌లో ఆర్సీబీతో తర్వాతి రోజు మ్యాచ్‌ ఉంది. నెట్స్‌లో విరాట్‌ ఎంతసేపు ఉన్నాడో నేను కౌంట్‌ చేస్తున్నా. నిజంగా చెప్పాలంటే అతడు రెండున్నర గంటల పాటు బ్యాటింగ్‌ చేశాడు. నేను షాక్ తిన్నాను. మా నెట్స్‌ పూర్తయినా కూడా అతడు బ్యాటింగ్‌ చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాతి రోజు మాపై అతడు 73 రన్స్‌ చేశాడు. అతని మైండ్‌ సెట్‌ చాలా పాజిటివ్‌" అని ఓ ఇంటర్వ్యూలో రషీద్‌ ఖాన్‌ చెప్పాడు.

గుజరాత్‌పై ఆ మ్యాచ్‌లో కోహ్లి 54 బాల్స్‌లో 73 రన్స్‌ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతనికదే అత్యధిక స్కోరు. ఈ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ 8 వికెట్లతో గెలిచింది. కానీ ఆ తర్వాత కోహ్లి మళ్లీ పెద్దగా ఆడలేకపోయాడు. అయితే కోహ్లి నుంచి ఎక్కువగా ఆశించడం వల్ల అలా అనిపిస్తోందని, నిజానికి విరాట్‌ టీమ్‌ కోసం తగిన రన్స్‌ చేస్తూనే ఉన్నాడని రషీద్ ఖాన్‌ అభిప్రాయపడ్డాడు.

"అతడు ఆడినప్పుడు ఆ షాట్స్‌ చూస్తే కోహ్లి ఫామ్‌లో లేడు అని చెప్పలేము. నేనైతే అతడు ఫామ్‌లో లేడని మాత్రం చెప్పను. అంచనాలు భారీగా ఉంటాయి. ప్రతి రెండో మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేయాలని ఫ్యాన్స్ భావిస్తారు. విరాట్ టెస్ట్‌ బ్యాటింగ్ చూడండి. 50, 60 లేదా 70 రన్స్‌ చేసి ఔటయ్యాడు. అతని స్థానంలో మరో బ్యాటర్‌ ఉంటే అతడు ఫామ్‌లో ఉన్నాడంటారు. కానీ విరాట్‌పై ఉండే అంచనాల కారణంగా అతడు సెంచరీయే చేయాలని అనుకుంటారు" అని రషీద్‌ అన్నాడు.

ఆసియా కప్‌ కోసం నెల రోజుల తర్వాత తిరిగి టీమ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లి.. నెట్స్‌లో మంచి టచ్‌లో కనిపించాడు. స్పిన్నర్లను నెట్స్‌లో చితకబాదాడు. అయితే ఫ్యాన్స్‌ అంచనాలు తనపై ప్రభావం చూపవని తాను మాట్లాడినప్పుడల్లా విరాట్ చెబుతాడని రషీద్ అన్నాడు. "నేనెప్పుడు విరాట్‌తో మాట్లాడినా.. ఫ్యాన్స్‌ అంచనాలు తనపై ప్రభావం చూపవని అంటాడు. అతడు సిద్ధమయ్యే తీరు మా అందరికీ ఓ ఉదాహరణగా మిగిలిపోతుంది. కెరీర్‌లో ఇలాంటి దశ ఉంటుంది. కానీ కచ్చితంగా మన ఫ్యాన్స్‌ అందరి అంచనాలకు తగినట్లే సెంచరీలు కూడా త్వరలోనే వస్తాయి" అని రషీద్‌ స్పష్టం చేశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం