Ashwin on Bowling Concerns: బౌలింగ్ సమస్యే కాదు.. ఆ ఒక్క పని చేస్తే చాలు: అశ్విన్
Ashwin on Bowling Concerns: ఇండియన్ టీమ్‌కు అసలు బౌలింగ్ సమస్యే కాదని, ఆ ఒక్క పని చేస్తే చాలని అంటున్నాడు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ గెలిచిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
Ashwin on Bowling Concerns: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇండియన్ టీమ్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య బౌలింగే. ఆసియా కప్ నుంచి ఇప్పటి వరకూ డెత్ ఓవర్లలో బౌలర్లు భారీగా రన్స్ లీక్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసియాకప్ ఓటమితోపాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సిరీస్‌లు గెలిచినా.. ఈ సమస్య మాత్రం వెంటాడింది. ఇలాంటి సమయంలోనే చివరి ఓవర్లలో బ్యాటర్లను కట్టడి చేయగలిగే సత్తా ఉన్న బుమ్రా కూడా గాయం కారణంగా దూరం కావడం సమస్యను మరింత జటిలం చేసింది.
అయితే ఇండియన్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం బౌలింగ్ అసలు సమస్యే కాదంటుండటం విశేషం. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. ఇండియాలో బౌండరీలు చాలా దగ్గరగా ఉంటాయని, ఆస్ట్రేలియాలో అలా కాదని, దీనిని బౌలర్లు అర్థం చేసుకుంటే చాలని అశ్విన్ అన్నాడు.
"సొంతగడ్డపై జరిగిన టీ20 మ్యాచ్‌లు, ద్వైపాక్షిక సిరీస్‌ల గురించే మనం ఆలోచిస్తుంటాం. బౌలర్లను గ్రౌండ్‌కు అన్నివైపులా బాదేస్తున్నారని అంటారు. కానీ ఇండియాలో బౌండరీలు 30 గజాల సర్కిల్‌కు చాలా దగ్గరగా ఉంటాయి. అదే ఆస్ట్రేలియాలో అయితే బౌండరీలు చాలా దూరంగా ఉంటాయి. ఇదే బౌలర్లకు కలిసొచ్చే విషయం" అని అశ్విన్ అన్నాడు.
ఆస్ట్రేలియా పరిస్థితులను అర్థం చేసుకొని, కాస్త రిస్క్ తీసుకోవడం టీ20 వరల్డ్‌కప్‌లో కీలకం కాబోతోందని చెప్పాడు. "ఈ కండిషన్స్‌ను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమే. ఏ లెంత్‌లలో బౌలింగ్ చేయాలనేదానితోపాటు 50-50 ఛాన్స్ ఉన్న రిస్క్ తీసుకునే ధైర్యం చేయాలి. ఇది పూర్తిగా కొత్త అనుభవం. అందుకే కొత్తగా ప్రారంభించాలి" అని అశ్విన్ స్పష్టం చేశాడు.
బుమ్రా లేకపోవడం టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా అవకాశాలపై ప్రభావం చూపేదే అయినా.. మిగతా బౌలర్లు ఈ సవాలుకు ఎలా సిద్ధమవుతారన్నది ముఖ్యం కానుంది. బుమ్రా స్థానంలో షమి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో అతని అనుభవం కచ్చితంగా టీమ్‌కు ప్లస్ అవుతుంది. ఇక తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇండియన్ పేస్ బౌలర్లు భువనేశ్వర్, అర్ష్‌దీప్ రాణించడం కూడా ఇండియా ఆందోళనను కాస్త తగ్గించిందని చెప్పాలి.