India vs Western Australia: టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఇండియన్ టీమ్ తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే చెలరేగింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేయడంతో ఈ మ్యాచ్‌లో 13 రన్స్‌తో వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమ్‌ను చిత్తు చేసింది. 159 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టర్న్ ఆస్ట్రేలియా.. ఒక దశలో పవర్ ప్లే ముగిసే సమయానికి 29 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది.
ఇండియన్ పేసర్లు భువనేశ్వర్, అర్ష్‌దీప్ చెరో రెండు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశారు. అయితే సామ్ ఫానింగ్ (59) హాఫ్ సెంచరీతో చేయడంతో చివరికి వెస్టర్ట్ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 రన్స్ చేయగలిగింది. అర్ష్‌దీప్ 3 ఓవర్లు వేయగా.. కేవలం 6 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అటు చహల్ కూడా 15 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్, పంత్ ఓపెనర్లుగా వచ్చారు. అయితే ఈ ఇద్దరూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. రోహిత్ 3, పంత్ 9 రన్స్ చేశారు. ఈ సమయంలో సూర్యకుమార్ తన టాప్ ఫామ్‌ను కొనసాగిస్తూ చెలరేగిపోయాడు. 35 బాల్స్‌లోనే 52 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, 3 ఫోర్లు ఉన్నాయి.
ఇక చివర్లో దినేష్ కార్తీక్ 23 బాల్స్‌లో 19 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా కండిషన్స్‌కు అలవాటు పడటానికి చాలా ముందుగానే అక్కడికి వెళ్లిన ఇండియన్ టీమ్ పెర్త్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. ఇక వరల్డ్‌కప్‌లో ఈ నెల 23న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడటానికి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వామప్ మ్యాచ్‌లు కూడా ఆడాల్సి ఉంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై టీ20 సిరీస్‌లు గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఇండియన్ టీమ్ వరల్డ్‌కప్‌కు వెళ్లింది.
అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాక్‌తో తొలి మ్యాచ్ ఆడిన తర్వాత అక్టోబర్ 27న సిడ్నీలో క్వాలిఫయర్‌తో రెండో మ్యాచ్, అక్టోబర్ 30న సౌతాఫ్రికాతో పెర్త్‌లో మూడో మ్యాచ్, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో అడిలైడ్‌లో నాలుగో మ్యాచ్, నవంబర్ 6న క్వాలిఫయర్‌తో మెల్‌బోర్న్‌లో ఐదో మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం బుమ్రా లేకపోవడంతో 14 మందితోనే ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా.. అతని స్థానంలో ఎవరన్నది త్వరలోనే ప్రకటించనుంది.