Chris Gayle on T20 World Cup Finalists: టీ20 వరల్డ్‌కప్‌కు టైమ్ దగ్గర పడింది. ఈ మెగా టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లు అక్టోబర్ 16 నుంచే ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, నమీబియా తలపడనున్నాయి. ఇప్పటికే 8 టీమ్స్ సూపర్ 12కు క్వాలిఫై కాగా.. తొలి రౌండ్ నుంచి మరో నాలుగు టీమ్స్ అర్హత సాధించనున్నాయి.
ఈసారి ట్రోఫీ ఎవరు గెలుస్తారన్నది అంచనా వేయడం అంత సులువైన పనిలా కనిపించడం లేదు. డిఫెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియా స్ట్రాంగ్‌గా కనిపించడంతోపాటు సొంతగడ్డపై ఆడుతుండటం కూడా కలిసి రానుంది. ఇక ఇండియా, ఇంగ్లండ్, పాకిస్థాన్‌లాంటి టీమ్స్ కూడా ఈ రేసులో ఉన్నాయి. ఇప్పటికే రికీ పాంటింగ్‌లాంటి మాజీ క్రికెటర్లు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరగొచ్చని అంచనా వేశారు.
తాజాగా వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్ క్రిస్ గేల్ కూడా వరల్డ్‌కప్ ఫైనలిస్టులపై తన అంచనా చెప్పాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తలపడే అవకాశం ఉందని గేల్ చెప్పడం విశేషం. దైనిక్ జాగరన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడాడు. అయితే వెస్టిండీస్‌కు అది అంత సులువు కాదని కూడా అన్నాడు.
"ఇప్పుడు వెస్టిండీస్ టీమ్‌లో ఉన్న ప్లేయర్స్ కూడా చాలా టాలెంట్ ఉన్న వాళ్లే. వీళ్లు ఏ టీమ్‌కైనా ప్రమాదకారులే. మ్యాచ్ రోజు వ్యూహానికి తగినట్లుగా ఆడాలని ప్రతి ఒక్కరికీ తెలుసు. టీమ్ బాగా ఆడుతుందని ఆశిస్తున్నా" అని గేల్ చెప్పాడు. గేల్ అంచనా చాలా మంది క్రికెట్ పండితులనే ఆశ్చర్య పరుస్తోంది.
ఎందుకంటే వెస్టిండీస్ కనీసం సూపర్ 12 స్టేజ్‌కు కూడా క్వాలిఫై కాలేదు. ప్రధాన టోర్నీకి అర్హత సాధించడానికి ఆ టీమ్ తొలి రౌండ్ మ్యాచ్‌లలో ఆడాల్సి ఉంది. నికొలస్ పూరన్ కెప్టెన్సీలోని టీమ్‌లో టీ20 స్పెషలిస్టులు పొలార్డ్, రసెల్, బ్రేవో లేకపోవడం బలహీనంగా మార్చింది.
పొలార్డ్, బ్రేవో రిటైరవగా.. రసెల్‌ను ఎంపిక చేయకుండా సెలక్టర్లు ఆశ్చర్యపరిచారు. ఇక చివరి నిమిషంలో విమానం మిస్ చేసుకొని మరో స్టార్ ప్లేయర్ షిమ్రాన్ హెట్‌మయర్ కూడా టోర్నీకి దూరమయ్యాడు. అర్హత టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్, జింబాబ్వేలాంటి టీమ్స్‌తో వెస్టిండీస్ తలపడనుంది. ఈ నాలుగు టీమ్స్ గ్రూప్ బిలో ఉన్నాయి.