Ashwin on Bairstow: రంజీ ట్రోఫీలో కూడా ఎవరో ఇలా చేయరు: బెయిర్‌స్టో ఔట్‌పై అశ్విన్
Ashwin on Bairstow: రంజీ ట్రోఫీలో కూడా ఎవరో ఇలా చేయరు అంటూ బెయిర్‌స్టో ఔట్‌పై అశ్విన్ స్పందించాడు. ఈ వివాదంలో ఆస్ట్రేలియా తప్పేమీ లేదని, ఇంగ్లండ్ అనవసరం రాద్ధాంతం చేస్తుందని అశ్విన్ స్పష్టం చేశాడు.
Ashwin on Bairstow: యాషెస్ సిరీస్ లో తీవ్ర దుమారం రేపుతున్న ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఔట్ పై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. కనీసం రూల్స్ పాటించకుండా ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుందని, ఇందులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేసిన తప్పేమీ లేదని అతడు స్పష్టం చేశాడు.
బెయిర్‌స్టోను కేరీ స్టంపౌట్ చేసిన విధానంపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్ల మధ్యే కాదు.. రెండు దేశాల ప్రధానుల మధ్య కూడా మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో స్పందించాడు. క్రికెట్ లో బేసిక్ రూల్ కూడా బెయిర్‌స్టో పాటించలేదని అశ్విన్ అతన్ని నిందించాడు.
"బెయిర్‌స్టో ఔట్ అంశంలో ఓ చర్చ జరుగుతోంది. అది ఓవర్లో చివరి బంతి కావడంతో అతడు బంతి వదిలేసిన తర్వాత నాన్ స్ట్రైకర్ తో మాట్లాడానికి వచ్చాడు. రీప్లే మరోసార చూడండి. అలెక్స్ కేరీ ఒక్క సెకను కూడా ఆగకుండా బంతిని స్టంప్స్ పైకి విసిరాడు. అతనికి ముందే తెలుసు బెయిర్ స్టో క్రీజును వదులుతాడని. స్టంప్స్ వెనక ఒక్కసారి కూడా చూడకుండానే అతడు క్రీజు వదిలాడు" అని అశ్విన్ అన్నాడు.
"క్రికెట్ లో ఇది చాలా బేసిక్ రూల్. బంతిని ఫాలో అవుతూ క్రీజు వదలాలి. రంజీ ట్రోఫీలో కూడా బ్యాట్స్‌మన్ వికెట్ కీపర్, స్లిప్ ఫీల్డర్ ను చూసిన తర్వాతే క్రీజు వదులుతారు. ఎందుకంటే వాళ్లు స్టంప్స్ పైకి బాల్ విసరగలరు. అది కచ్చితంగా నిబంధనలకు కట్టుబడే ఉంటుంది. మ్యాచ్ రసవత్తరంగా ఉండటంతో ఫ్యాన్స్ అలా స్పందించి ఉంటారు. బెయిర్‌స్టో తరచూ ఏం చేస్తాడో చూసే ఇలా చేశారు" అని అశ్విన్ చెప్పాడు.
"ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఓవర్లో చివరి బంతి అంటున్నారు. అందుకే అతడు క్రీజు వదిలాడని చెబుతున్నారు. ఓవర్ అయిపోయిన తర్వాత అంపైర్లు ఓవర్ అన్న తర్వాతగానీ అది పూర్తి కాదు. అంపైర్ అలా చెప్పిన తర్వాతే ఆ బంతి డెడ్ బాల్ అవుతుంది. అప్పటి వరకూ క్రీజులోనే ఉండటం బ్యాటర్ బాధ్యత. అంపైర్ ఓవర్ అని చెప్పకముందే కేరీ బంతిని విసిరాడు" అని అశ్విన్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం