Ashes 2023 : యాషెస్ సిరీస్ ముందు.. ఇంగ్లండ్ జట్టుకు షాక్
Ashes Series 2023 : ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్ కోసం సన్నద్ధం అవుతుంది. ఇంతలో జట్టుకు ఓ షాక్ తగిలినట్టైంది. కీలక ఆటగాడు సిరీస్ నుంచి ఔట్ అయ్యాడు.
ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్(Ashes Series) కోసం సన్నాహాలను ప్రారంభించగా, జట్టు ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్(Jack Leach) గాయం కారణంగా యాషెస్ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. వెన్ను గాయంతో జాక్ లీచ్ యాషెస్ సిరీస్‌కు అందుబాటులో లేడని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది.
ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో జాక్ లీచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 4 వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్‌లో గాయపడి యాషెస్ సిరీస్‌కు దూరమయ్యాడు. జాక్ లీచ్ స్థానంలో ఇంగ్లండ్(England) ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు.
గతేడాది బెన్‌స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మార్గనిర్దేశంతో అద్భుత ప్రదర్శన చేసి విజయంపై విజయం సాధించింది. విజయాలకు జాక్ లీచ్ సహకారం కూడా చెప్పుకోదగ్గది. గత ఏడాది కాలంలో ఇంగ్లండ్ తరఫున జాక్ లీచ్ మొత్తం 46 వికెట్లు పడగొట్టాడు.
యాషెస్ టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఈసీబీ శనివారం ప్రకటించింది. అయితే ఆ తర్వాత జాక్ లీచ్ గాయపడడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం ఇప్పటికే గాయాలతో సతమతమవుతోంది. గాయం కారణంగా ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు.
ఈసీబీ అధికారిక ప్రకటన ద్వారా గాయం విషయాన్ని వెల్లడించింది. 'ఆదివారం తీసిన స్కాన్‌లో లీచ్ కు ఫ్రాక్చర్ అయినట్టుగా నిర్ధారించబడింది. అందువల్ల అతను యాషెస్ మొత్తం సిరీస్‌కు దూరంగా ఉంటాడు. లీచ్ అందుబాటులో లేనందున అతని స్థానంలో త్వరలో వేరేవారిని ఎంపిక చేస్తాం.' అని ECB ప్రకటించింది.
మొదటి రెండు మ్యాచ్‌లకు ఇంగ్లండ్ జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), ఆలీ పోప్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), జో రూట్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాక్ క్రాలే, మాథ్యూ పాట్స్, అల్లీ రాబిన్సన్, డాన్ లారెన్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, జోష్ టంగ్.