Bangladesh vs England: బంగ్లాదేశ్ సంచలనం.. ఇంగ్లండ్‌పై వైట్‌వాష్
Bangladesh vs England: బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. టీ20 వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేసింది. మూడో టీ20లోనూ గెలిచిన హోమ్ టీమ్.. క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.
Bangladesh vs England: బంగ్లాదేశ్ చారిత్రక విజయం సాధించింది. గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లండ్ ను అదే టీ20ల్లో వైట్ వాష్ చేయడం విశేషం. మూడు టీ20లలోనూ గెలిచిన బంగ్లా టీమ్.. క్రికెట్ ప్రపంచం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం (మార్చి 14) జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలిచింది.
ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆ టీమ్ 20 ఓవర్లలో 6 వికెటలకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ డేవిడ్ మలన్ 53 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. కెప్టెన్ జోస్ బట్లర్ 40 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమవడంతో వరల్డ్ ఛాంపియన్స్ కు ఓటమి తప్పలేదు.
బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీయగా.. తన్వీర్ ఇస్లామ్, షకీబుల్ హసన్, ముస్తఫిజుర్ రెహమాన్ తలా ఒక వికెట్ తీశారు. ముఖ్యంగా ముస్తఫిజుర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అతడు 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. ఇది టీ20ల్లో అతనికి 100వ వికెట్ కావడం విశేషం. ఇంతకుముందు రెండు టీ20లు కూడా గెలిచిన బంగ్లాదేశ్.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేయగలిగింది.
చివరి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఓపెనర్ లిటన్ దాస్ 57 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఇక షాంటో కూడా 47 రన్స్ చేయడంతో బంగ్లాదేశ్ ఫైటింగ్ స్కోరు సాధించగలిగింది.
వన్డే సిరీస్ ను 2-1తో గెలిచిన ఇంగ్లండ్ పై బంగ్లాదేశ్ ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. టీ20 సిరీస్ లో వరల్డ్ ఛాంపియన్ ను వైట్ వాష్ చేయడం అంటే మాటలు కాదు. కానీ స్వదేశంలో క్రమంగా అజేయులుగా మారుతున్న బంగ్లాదేశ్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
సంబంధిత కథనం