Vamana jayanthi: వామన జయంతి ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు ప్రాముఖ్యత ఏంటి?-why is vamana jayanti celebrated what is the significance of today ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vamana Jayanthi: వామన జయంతి ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు ప్రాముఖ్యత ఏంటి?

Vamana jayanthi: వామన జయంతి ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు ప్రాముఖ్యత ఏంటి?

HT Telugu Desk HT Telugu
Sep 15, 2024 07:00 AM IST

Vamana jayanthi: విష్ణుమూర్తి వామనుడి అవతారం ఎలా ఎత్తాడు. వామన జయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత ఏంటి అనే దాని గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

వామన జయంతి ఎందుకు జరుపుకుంటారు?
వామన జయంతి ఎందుకు జరుపుకుంటారు?

Vamana jayanthi: ఈ భాద్రపద శుద్ధ ద్వాదశినాడే వామన జయంతి. ఈ ఏడాది వామన జయంతి సెప్టెంబర్ 15వ తేదీన జరుపుకోనున్నారు. శ్రవణం నక్షత్రంతో కూడి వస్తే విశేష యోగం. విష్ణువు మూడు పాదాలు కలిగినవాడుగా రుగ్వేదంలో చెబుతారు. సూర్యుని ఉదయ, మధ్యాహ్న, అస్తమయాలే ఈ మూడు పాదాలని విజ్ఞుల భావన.

విష్ణు పాదాల్లో రెండు మాత్రమే మానవులకు కనిపిస్తాయని, మూడోది చీకటిమయమైన అధోలోకంలో ఉండటంవల్ల నరులకు అదృశ్యమని భావిస్తారు. సూర్యుడు దక్షిణం నుంచి జనులకు కనిపించే కాలం రెండు పాదాలైతే, తరవాత సూర్యుడు కిందికి దిగిపోయి దీర్ఘరాత్రిని కల్పించినప్పుడు అదృశ్యమైన మూడోపాదం ఏర్పడుతుందని పండితులంటారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. వామనుని మూడు పాదాలు విశ్వరూప, తైజస రూప, ప్రాజ్ఞ రూప పాదాలని తాత్వికుల అభిప్రాయం.

వేదాల్లో - వామనుని ఉరుగాయుడని, ఉరుక్రముడని వర్ణించారు. ధూళిధూసరమైన ఆయన పాదంలో భూమ్యాది సమస్త లోకాలూ అంతర్హితమయ్యాయని వర్ణించారు. వేదాంత దేశికులవారైతే, ఆ పరమాత్మ త్రివిక్రమ స్వరూపాన్ని వర్ణిస్తూ "ఆకాశానికి ఎత్తిన పాదం ధ్వజమై, మందాకినీ సలిలం ధ్వజపటమై బలిచక్రవర్తి ఔదార్యాన్ని ఊర్ధ్వ లోకాల్లో ప్రకటించడానికి ఎత్తిన పతాకం వలె ఉందని" వర్ణించారు. శ్రీమహావిష్ణువు విభవావతారాల్లో త్రివిక్రమ స్వరూపం అత్యంత అద్భుతం. భాద్రపద శుక్లమందు శ్రవణా నక్షత్రయుక్తమైన ద్వాదశినాడు వామన జయంతిని జరుపుకొంటారు.

రాక్షసరాజు బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు. స్వర్గంపై దాడి చేసి ఇంద్రుని జయించి అమరావతిని ఆక్రమించుకున్నాడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ముల్లోకాలకు చక్రవర్తియై ధర్మపాలన చేస్తున్నాడు. రాక్షసులచే పరాజితులైన దేవతల తల్లి ఆదితి కుమారుల దైన్యాన్ని చూడలేక కశ్యపునితో మొరపెట్టుకుంది. కశ్యపుడు ఆమెకు పయోభిక్షణమనే వ్రతం ఉపదేశించి ఆచరింపజేశాడు. వ్రత ఫలంగా శ్రీ శ్రీ మహావిష్ణువు అదితి గర్భాన వామనుడై జన్మించాడు.

బలి నూరో అశ్వమేధయాగం చేస్తున్నప్పుడు వామనుడు ఆ యాగానికి వెళ్ళాడు. మూడడుగుల నేల యాచించాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో - వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువని నీ రాజ్యాన్ని హరించి వేయడానికే వచ్చాడని, కొన్ని సందర్భాల్లో అసత్యం చెప్పినా దోషం కాదని పలికి వారింప యత్నించాడు. కాని సత్యసంధుడైన బలి అంగీకరించలేదు. వామనుడడిగిన మూడడుగుల నేలను దానమిచ్చాడు. దానధార నేల మీద పడటమే తడవుగా వామనుడింతింతై బ్రహ్మాండార్థ సంవర్ధి అయినాడు.

ఒక అడుగుతో భూమిని, రెండో అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావని అడిగాడు. బలి తన నెత్తిమీద పెట్టమంటాడు. విష్ణువు బలి త్యాగ గుణానికి, వచన బద్ధతకు ప్రసన్నుడయ్యాడు. బలిని సుతల లోకాలకు అణగదొక్కి బలికి ఎట్టి భంగపాటు కలగకుండా తానే అతని వాకిట కాపలా ఉన్నాడు. సావర్ణి మనువు కాలంలో ఈ బలి, దేవేంద్రుడవుతాడని వరమిచ్చాడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఈ విధంగా ఈ రోజున వామనమూర్తిగా విష్ణువు అవతరించిన తిథి.

శ్లో॥ దేవేశ్వరాయ దేవాయ దేవసంభూతికారిణే | ప్రభవే సర్వదేవానాం వామనాయ నమోనమః ॥ (అని వామనదేవుని నమస్కరించి)

శ్లో॥ నమస్తే పద్మనాభాయ నమస్తే జలశాయినే । తుభ్యమర్థ్యం ప్రయచ్ఛామి బాలవామనరూపిణీ ॥ నమకార్ధ ధనుర్బాణ పాణయే వామనాయచ ॥ యజ్ఞభుక్ ఫలదాత్ర చ వామనాయ నమోనమః ॥ అనే శ్లోకాలతో అర్ఘ్యప్రదానం చేయాలి. అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner