Arunachala giri pradakshina: అరుణాచల గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? ఏరోజు చేస్తే ఎలాంటి ప్రతిఫలం దక్కుతుంది
Arunachala giri pradakshina: పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేందుకు ఎక్కువ మంది భక్తులు ఆసక్తి చూపిస్తారు. అయితే ఏ రోజు ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో తెలుసుకుందాం.
Arunachala giri pradakshina: పంచభూత శివలింగాలలో ఒకటి అరుణాచలంలోని అగ్నిలింగం. ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన పుణ్యక్షేత్రాలలో తిరువణ్ణామలై ఒకటి. దీనినే అరుణాచలం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు అరుణాచల గిరిప్రదక్షిణ చేస్తే ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
జులై 21 ఆషాడ పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి రోజు ఎంతో మంది భక్తులు గిరిప్రదక్షిణ చేసేందుకు తరలి వస్తారు. పరమశివుడు అగ్ని లింగ రూపంలో వెలసిన అరుణాచల క్షేత్రం ఎన్నో మహిమలకు ప్రసిద్ధి చెందినది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితుల చెబుతారు. శివ నామస్మరణ చేస్తూ పున్నమి వెలుగులలో గిరి ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి. కొండమీద వెలసిన దేవుడుగా కాకుండా కొండే దేవుడిగా వెలిసిన క్షేత్రమే అరుణాచల క్షేత్రం. ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరిప్రదక్షిణ చేసే ప్రతి అడుగుకు జన్మజన్మ పాపాలు నశిస్తాయని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం అంటే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యంగా నమ్ముతారు.
గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు
అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే మీరు చేసే కార్యం నెరవేరుతుంది. పుణ్యఫలం లభిస్తుంది. గిరిప్రదక్షిణలు చేసేటప్పుడు చెప్పులు లేకుండా నడవాలి. గర్భవతి ఎలా నడుస్తుందో ఆ విధంగా పరమేశ్వరుడిని తలుచుకుంటూ ఆయన నామాన్ని జపిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి.
ఉదయం తొమ్మిదిలోపు గిరిప్రదక్షిణ చేయడం మంచిదిగా చెబుతారు. గిరిప్రదక్షిణ చేయాలనుకుంటున్న వాళ్ళు తమ వెంట ఎక్కువ బరువు ఉన్న వస్తువులు తీసుకెళ్ళకుండా ఉండటమే మంచిది. ఎడమవైపు మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. కుడివైపు సిద్ధులు, దేవతలు అదృశ్య రూపంలో ప్రదక్షిణలు చేస్తుంటారని చెబుతారు. ‘ఓం అరుణాచల శి’వ అని స్మరణ చేస్తూ గిరిప్రదక్షిణలు చేయాలి. దారి మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించాలి. ఇక్కడ ధ్యానం చేయడంవల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
అలాగే గిరిప్రదక్షిణ సమయంలో అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. వివాహం కాని వారు దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకి తాడు కట్టడం వల్ల వివాహం కుదురుతుంది. అలాగే సంతానలేమితో బాధపడుతున్న వారు కూడా ఇక్కడ మొక్కుకొని ముడుపు కట్టడం వల్ల సంతాన భాగ్యం లభిస్తుంది.
ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి?
గిరిప్రదక్షిణ చేసేందుకు వారంలో అన్ని రోజులు మంచివే. అయితే ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
సోమవారం ప్రదక్షిణలు చేస్తే జనన మరణ బాధల నుంచి బయటపడతారు. మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. బుధవారం ప్రదక్షిణలు చేయడం వల్ల మహా పండితులు అవుతారు. గురువారం ప్రదక్షిణలు చేయడం వల్ల కారణజన్ములు అవుతారని చెబుతారు.
అలాగే శుక్రవారం చేస్తే శివుడి ఆశీస్సులతో సకల సంపదలు దక్కుతాయి. శనివారం ప్రదక్షిణలు చేస్తే మానసిక, శారీరక సమస్యలు ఉన్నవాళ్లు బాధలు తొలగిపోతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.