Kedareswara vratham: దీపావళి నాడు చేసుకునే కేదారేశ్వర స్వామి వ్రత విశిష్టత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు?
Kedareswara vratham: కొందరు కేదారేశ్వర స్వామి వ్రతం కార్తీక పౌర్ణమి రోజు జరుపుకుంటారు. కానీ కొన్ని కుటుంబాల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం దీపావళి రోజున చేసుకుంటారు. ఈ వ్రత విశిష్టత ఏంటి? ఎందుకు చేసుకుంటారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
దీపావళి సమయంలో తెలంగాణ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన వ్రతం కేదారేశ్వర వ్రతం. కొందరు దీపావళి రోజు జరుపుకుంటే మరికొందరు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చేసుకుంటారు. భార్యాభర్తలు కలిసి ఈ వ్రతం ఆచరించడం వల్ల వారి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని, జీవితాంతం కలిసే ఉంటారని పండితులు చెబుతున్నారు.
ఆది దంపతులుగా భావించే పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ నోము నోచుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని అన్న వస్త్రాలకు లోటు అనేది ఉండదని అంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల పార్వతీ దేవి పరమేశ్వరుడి శరీరంలో అర్థభాగం అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. వ్రతం ఆచరించిన వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమిస్తారు.
కేదారేశ్వర వ్రతంలో 21 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులో పూజకు ఉపయోగించే వస్తువులు దగ్గర నుంచి దేవుడికి సమర్పించే నైవేద్యం వరకు అన్ని 21 ఉండే విధంగా చూసుకుంటారు. అలాగే ఈ వ్రతాన్ని వరుసగా ఇరవై ఒక్క సంవత్సరాలు ఆచరించాలి. ఇలా చేస్తే అనుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరతాయని పండితులు సూచిస్తున్నారు. పూజలో 21 పేట్ల పట్టు లేక నూలు దారాన్ని తోరంగా చేసుకుని ధరించాలి. గోధుమ పిండితో చేసిన 21 అరిసెలు, పాలు, పెరుగు, నెయ్యి, పాయసం సమర్పించాలి. అలాగే పూజలో తప్పనిసరిగా తేనె సమర్పించడం మర్చిపోకూడదు. వీటితో పాటు 21 రకాల ఫలాలు, కూరలు నైవేద్యంగా సమర్పిస్తారు.
21 ఎందుకు సమర్పించాలి అనే దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. గ్రహ దోషాలు తొలగించుకునేందుకు అలాగే గ్రహాల స్థానాన్ని బలపరిచేందుకు ఉపయోగిస్తారు. ఇందులో సమర్పించే పాలు, పెరుగు శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే తేనె గురు గ్రహం, నెయ్యి శనీశ్వరుడు, కూరలు చంద్రుడు, ఫలాలు బుధుడితో ముడిపడి ఉంటుందని అంటారు. అందుకే కేదారేశ్వరుడిని పూజించే సమయంలో ఇవన్నీ సమర్పించడం వల్ల నవగ్రహ పూజ చేసిన ఫలితం కూడా దక్కుతుంది. ఈ వ్రతాన్ని ఇరవై ఒక్క సంవత్సరాల పాటు చేసి చివరి సంవత్సరం ఉద్యాపనం చేస్తారు.
దీపావళి రోజు కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకున్నా, వ్రత కథ విన్నా శుభ ఫలితాలు దక్కుతాయి. ఈ వ్రతం ఆచరించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ ఆనవాయితీ ప్రకారం ఈ వ్రతం ఆచరిస్తారు.
వ్రతం ఎలా చేసుకోవాలి?
పూజ కోసం ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. కలశ స్థాపన చేసుకుని తర్వాత పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం లేదా విగ్రహం ప్రతిష్టించుకోవాలి. అష్టోత్తర శతనామావళి, షోడశ ఉపచారాలు పాటించాలి. పూజ చేసుకున్న తర్వాత కుటుంబమంతా కలిసి దేవుడికి పండ్లు, పూలు, పత్రి, అక్షితలు, తమలపాకులు వంటివి సమర్పించాలి. పూజలో భాగంగా స్వామి వారికి పెట్టిన నైవేద్యం మాత్రమే స్వీకరిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.