కేదారేశ్వర వ్రతం: భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఈ వ్రతం చేయాల్సిందే-kedareshwara vratam a path to marital bliss on kartika pournami ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Kedareshwara Vratam: A Path To Marital Bliss On Kartika Pournami

కేదారేశ్వర వ్రతం: భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఈ వ్రతం చేయాల్సిందే

HT Telugu Desk HT Telugu
Nov 23, 2023 09:17 AM IST

కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతాన్ని చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి వారి మధ్య ప్రేమ పెరుగుతుంది.

kedareswara Vratham: కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత
kedareswara Vratham: కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత (Pixabay)

భార్యాభర్తలు ఇద్దరూ ఎలాంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి సుఖంగా జీవించాలంటే కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన వ్రతం ఒకటుంది. అదే కేదారేశ్వర వ్రతం. భార్యాభర్తలకు దాంపత్య సుఖం దక్కడంతో పాటూ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలంటే కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలి. భర్తకు వీలు కానప్పుడు భార్య ఒక్కతే చేసుకోవచ్చు, కానీ భార్య లేకుండా మాత్రం భర్త ఈ వ్రతాన్ని చేయకూడదు. పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తారు

చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్న రోజును కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతాన్ని చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ వ్రతం లో ఈశ్వరుని కేదారేశ్వరుడిగా కొలుస్తారు. ఈ వ్రతం కోసం మర్రిచెట్టు ఊడలు, మర్రి ఆకులు, మర్రి పండ్లు అవసరం పడతాయి. మర్రిచెట్టు ఊడలనే ఇంటికి తోరణాలుగా పెడతారు. మర్రి ఆకులనే విస్తర్లుగా కుడతారు. ఆ మర్రి ఆకుల విస్తర్లోనే నైవేద్యాన్ని సమర్పిస్తారు. మర్రి పండ్లను కేదారేశ్వరునికి నివేదిస్తారు.

కేదారేశ్వర వ్రతంలో 21 అనే అంకెకు విశిష్ట విలువ ఉంది. మనిషి జన్మించినప్పుడు 21 దోషాలు ఉంటాయని చెబుతారు. కేదారున్ని పూజించడం వల్ల ఆ 21 దోషాలు నశించేలా చేసుకోవచ్చు. ఆ వ్రతంలో 21 పేటల పట్టు దారాన్నిగాని, నూలు దారాన్నిగాని తేలికి తోరంగా కట్టుకోవాలి.

21 నేతి అరిసెలు, 21 రకాల నైవేద్యాలు తయారు చేయాలి. అలాగే పాలు, పెరుగు, నెయ్యి, పాయసం, తేనె ఖచ్చితంగా ఉండాలి. 21 నైవేద్యాలలో ఇవి కూడా కలిపే లెక్క పెట్టుకోవాలి. అరిసెలను గోధుమలతో మాత్రమే చేయాలి. గోధుమలు సూర్యునికి ఇష్టమైన ధాన్యం. సూర్యుడే మనకు ఆయుష్షుని ఇస్తాడు. సూర్యుడు అగ్నిస్వరూపంలో శివుని మూడో కన్నులో దాగి ఉంటాడు. కేదారేశ్వరున్ని పూజించడం వల్ల పరోక్షంగా సూర్యుణ్ణి కూడా ఆరాధించినట్టే. అందుకే అరిసెలను గోధుమలతో మాత్రమే చేయాలని చెబుతారు.

21 ఏళ్లు నిర్వహిస్తే

ఈ వ్రతాన్ని వరుసగా 21 సంవత్సరాల పాటు నిర్వహించుకుని... ఇరవై ఒక్క సంవత్సరంలో ముగింపు చెప్పాలి. తల్లిదండ్రులు కొన్నేళ్లు మాత్రమే చేయగలిగితే ఆ ఇంటి వారసులు మిగతా సంవత్సరాలలో ఈ వ్రతాన్ని చేసి పూర్తి చేయవచ్చు. అందుకే ఈ వ్రతం వంశపారం పర్యంగా వస్తుంది.

కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతం పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి. వారికి అష్టైశ్వర్యాలకు, అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉంటుంది. వ్రతం పూర్తయ్యే వరకు భార్యాభర్తలు ఉపవాసం చేయాలి. వ్రతం పూర్తయ్యాక అక్షింతలు తలమీద చల్లుకోవడం మర్చిపోవద్దు. సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన ప్రసాదాన్నే రాత్రికి భోజనంగా తినాలి.

WhatsApp channel

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.