Mahalaya paksham: మహాలయ పక్షాలు అంటే ఏంటి ? ఈ కాలంలో ఏమి ఆచరించాలి? దీని వెనుక ఉన్న కథ ఏంటి?
Mahalaya paksham: పితృ దేవతలను ఆరాధించేందుకు ఉన్న సమయం మహాలయ పక్షాలు. ఈ సమయంలో ఏం ఆచరించాలి? అసలు ఈ మహాలయ పక్షాలు వెనుక ఉన్న కథ ఏంటి అనే దాని గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
Mahalaya paksham: భాద్రపద మాసంలో కృష్ణ పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షాల కాలంగా చెప్పబడిందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ పదిహేను రోజులు పితృ దేవతలకు సంబంధించినటువంటి, పితృ కార్యాలకు సంబంధించి అతి పవిత్రమైన రోజులుగా చెప్తారు.
మహాలయ పక్షం అంటే ఏంటి?
ప్రతి మానవుడు దేవతారాధన ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పితృ దేవతలకు చేసే ఆరాధను ఇవ్వాలని చిలకమర్తి తెలిపారు. పితృ దేవత అనగా మన కుటుంబంలో గతించినటువంటి వారని అర్థం. గతించిన పితృదేవతలకు మనం విడిచేటువంటి తర్పణాలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు, పితృ కార్యాలు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని ఈ రకంగా కార్యాలు ఆచరించడం వల్ల ఇంట్లో దేనికి లోటు ఉండదని చిలకమర్తి తెలిపారు.
ప్రతి మానవుడు గతించిన పితృ దేవతల కోసం ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథుల యందు తర్పణాలు వదలాలి. ఈరోజుల్లో తర్పణాలు వదలేకపోతే అటువంటి వాళ్ళు మహాలయ పక్షాలలో మహాలయ అమావాస్య రోజు వారి పితృ దేవతలకు తర్పణం వదిలితే సంవత్సరం మొత్తం పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితం కలుగుతుందని మహాలయ పక్షాల వైశిష్ట్యం తెలియజేస్తుందని చిలకమర్తి తెలిపారు.
ప్రతి ఒక్కరూ గతించిన తల్లిదండ్రులకు వారి తిథి ప్రకారం సంవత్సరికాలు, ఆర్థికాలు జరిపించాలి. ఏ కారణం చేత అయిన అలా కుదరని పక్షంలో కొన్ని సందర్భాలలో అనుకున్న తిథి యందు ఆ సంవత్సరం ఆ కార్యక్రమం జరగలేదని అనుమానం కలిగించో అటువంటి దోషాలను తొలగించుకోవడానికి అద్భుతమైన అవకాశం ఉన్న రోజులు మహాలయ పక్షం రోజులని చిలకమర్తి తెలిపారు.
ఇలా మహాలయ పక్షాలలో తిథి ప్రకారం గతించిన పితృ దేవతలకు ఈ పదిహేను తిథులలో వారు గతించిన తిథి ప్రకారం ఆరోజు వారికి పితృ కర్మలు ఆచరించడం వల్ల దోష నివృత్తి జరిగి పితృ దేవతల అనుగ్రహం కలుగుతుందని శుభ ఫలితాలు పొందుతారని చిలకమర్తి తెలిపారు. మహాలయ పక్షాలలో శ్రద్ధ కర్మలు ఆచరించడం, పిండ ప్రదానాలు చేయడం, అన్నదానం, వస్త్ర దానం వంటి దానాలు ఆచరించడం, పితృ దేవతలకు తర్పణాలు వదలడం చాలా మంచిదని చిలకమర్తి తెలిపారు.
మహాలయ పక్షాలకు సంబంధించి కథ
మహాభారత యుద్ధంలో కర్ణుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి పయనం అయ్యే దారిలో కర్ణుడికి ఆకలి, విపరీతమైన దాహం వేసింది. అక్కడ ఒక నది కనపడగా అందులోని నీరు తాగుదామని అనుకుని నదిని స్పృశించిన వెంటనే నది మొత్తం సువర్ణం అయిపోయింది. మరికొంత దూరం ప్రయాణించిన తర్వాత అతనికి ఒక మామిడి చెట్టు కనిపించేను. ఆ చెట్టు ఫలం ముట్టుకున్న వెంటనే అది కూడా బంగారం అయిపోయింది.
ఇది చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయిన సూర్య భగవానుడిని ప్రార్థించాడు. సూర్యుడు ప్రత్యక్షమైన వెంటనే తనకు కలిగిన విషయం చెప్పగానే నీవు పూర్వ జన్మలో దానాలు చేశావు. ముఖ్యంగా సువర్ణ దానం, డబ్బు, రత్న దానం అధికంగా చేశావు. పితృ దేవతలను సంతృప్తి పరిచే ఏ కార్యం నువ్వు చేయలేదు. అన్నదానం ఆచరించలేదు. అందువల్లే నీవు ఏవి పట్టుకున్న సువర్ణం అయిపోతున్నాయని తెలియజేశాడు.
ఇది తెలుసుకున్న కర్ణుడు నాకు పితృ దేవతలు ఉన్నారని, పితృ కార్యాల గురించి అవగాహన లేదు. నాకు తెలియకపోవడం వల్ల జరిగినది దోషం కాదు. దీని నుంచి బయటపడేందుకు సహాయం కోరాడు. అప్పుడు సూర్యుడు యముడి సహాయంతో పితృ దేవతలను సంతృప్తి పరిచేందుకు పదిహేను రోజులు భూమి మీదకు పంపినట్టుగా అలా కర్ణుడు భాద్రపద మాస కృష్ణ పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులు మహాలయ పక్షాలుగా, పితృ పక్షాలుగా చెప్పబడింది. ఈ పదిహేను రోజులు కర్ణుడు భూమి మీద ఉండి పితృ దేవతల కర్మలు ఆచరించి అన్నదానం, వస్త్ర దానం, గోదానం, పిండ ప్రదానం ఆచరించి మహాలయ అమావాస్య రోజు భూలోకం నుంచి స్వర్గానికి బయల్దేరినట్టు మహాభారతంలో ఉందని చిలకమర్తి తెలిపారు. మహాలయ పక్షాలను ఆచరించి పితృ దేవతల అనుగ్రహం పొందాలని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.