Pitru paksham 2024: పితృ పక్షాలు ఎప్పటి నుంచి? ఈ సమయంలో ఎటువంటి కార్యాలు చేయాలి?
Pitru paksham 2024: పితృ పక్షాన్ని మహాలయ పక్షం అంటారు. ఈ కాలంలో పితృ దేవతలకు స్మరించుకుంటూ వారికి తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలని శాస్త్రవచనం చెబుతోంది. ఈ మహాలయ పక్షంలో ఏం చేయాలో ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Pitru paksham 2024: భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు, బహుళ పక్షం పితృ దేవతాపూజకు విశిష్టమైనది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది.
పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అనంటారు. అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాన్నీ చేయరు. ఈ రోజు నుండి ఈ పక్షం ముగిసేంతవరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలని శాస్త్రవచనం. ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతి చెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.
పితృపక్షంలో ఏం చేయాలి?
తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షం నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఈ పదిహేను రోజులూ నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మాతాపితృ వర్జితులైనవారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యం ఈ పక్షం. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి. ఆ ఒక్కరోజు కూడా అన్నశ్రాద్ధం చేయలేనివారు హిరణ్యశ్రాద్ధం చేయాలి. ఏమీ చేయలేని నిష్ఠ దరిద్రుడు అరణ్యంలోకి వెళ్ళి ముళ్ళకంచెను హత్తుకొని పితృదేవతలనుద్దేశించి కన్నీరైనా కార్చవలెనని ధర్మశాస్త్రం చెప్తోంది.
ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమనీ దక్షిణాయనము పితృకాలము గనుక అశుభకాలమనీ మన పూర్వుల విశ్వాసము. అంతేగాక ఆషాఢములోన వచ్చే కర్కాటక సంక్రమణము నుంచే ప్రారంభమయ్యే దక్షిణాయనము వానలు బురదలతో, చిమ్మచీకటితో భయంకరంగా ఉంటుంది అందునను భాద్రపదమాసమును అంతటను జలమయముగా కనిపిస్తూ ఇదే ఒక మహా వినాశమనుకోవడంలో (మహాలయ ప్రాప్తించిన దనుకోవడంలో) ఆశ్చర్యము అంతకంటే లేదు. కనుక ఈ పక్షమున అందరకూ శ్రాద్ధతర్పణములు చేయాలనీ, శ్రాద్ధాలతో వారిని సంతృప్తిపరిస్తే తమకు ప్రళయము గడుస్తుందని భావించి ఉండవచ్చని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్లో॥ ఆషాఢీ మనధిం కృత్వా పంచమం పక్షమాశ్రితాః |
కాంక్షంతి పితరః క్లిష్టాః అన్న మప్యన్వహం జలమ్ ॥
ఆషాఢ మాసం రెండవ పక్షము మొదలు ఐదవ పక్షము వరకు పితరులు చాలా కష్టపడుతూ, అన్నోదకాలు కాంక్షిస్తుంటారని, కనుక మహాలయ పక్షమున ప్రతి దినమును శ్రాద్ధము జరుపవలెననీ ఆచారంగా పెట్టి ఉండోచ్చు.
పితరులను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గస్తులైన మాతాపితరుల కోసం ప్రతివారూ ఈ పక్షాలలో విధింపబడ్డ పితృకర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు.
శ్లో॥ కన్యాగతే సవితరి యా స్యహాని చ షోడశ ॥ క్రతుభి స్తాని తుల్చాని దేవా నారాయణో హరిః॥
అని హేమాద్రి వచనం. సూర్యుడు కన్యారాశిగతుడైనప్పుడు పదహారు దినములు భాద్రపద పూర్ణిమ మొదలు ఆశ్వయుజ పాడ్యమి వరకు మొత్తం యజ్ఞ దినములు వంటివి. కనుక అతి పవిత్రములయినవి. దీనికి అధిదేవత నారాయణుడు అని దీని భావము. ఈ మహాలయపక్షము ప్రతిరోజూ గాని, ఒక్కనాడు గాని శ్రాద్ధము చేయవచ్చును. అలా చేసినవారి పితరులు సంవత్సరము వరకు సంతృప్తులవుతారని స్కాంద పురాణము నాగర ఖండమున చెప్పబడింది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్లో॥ ఆషాఢ్యాః పంచమే పక్షే కన్యాసంస్థే దివాకరే ||
యో వై శ్రాద్ధం నరః కుర్యా దేకస్మి న్నపి వాసరే ॥
తస్య సంవత్సరం యావత్ సంతృప్తః పితరో ధృవమ్ ॥
అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్