Ekadashi Puja : శ్రావణ పుత్రద ఏకాదశి వెనుక ఓ తండ్రి కన్నీటి కథ.. చదివిన, విన్న వారికీ యజ్ఞ ఫలం!
Shravana Putrada Ekadashi 2024: సంతానం కావాలనుకునేవారు శ్రావణ మాసం శుక్లపక్షంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం ప్రభావంతో సంతానప్రాప్తితో పాటు పరలోకంలో సుఖ సంతోషాలు దక్కుతాయి. ఈరోజు వచ్చిన పుత్రద ఏకాదశి చాలా పవిత్రమైనది.
Shravana Putrada Ekadashi : శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో ఈరోజు వచ్చిన ఈ పుత్రద ఏకాదశి చాలా పవిత్రమైనది. ఈరోజు ఉపవాస దీక్షను ఆచరించిన వారికి సంతానప్రాప్తి కలగడంతో పాటు పిల్లల ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడేవారికి సమస్యలు తొలుగుతాయి.
ఈ పవిత్రమైన శ్రావణ పుత్రద ఏకాదశి రోజు వెనుక ఓ తండ్రి కన్నీటి కథ ఉంది. ఈ కథని అర్జునుడికి మహావిష్ణువు చెప్పారు. ద్వాపరయుగం ప్రారంభంలో మాహిష్మతి అనే నగరం ఉండేది. మహాజిత్ అనే రాజు ఆ నగరాన్ని పాలించేవాడు. కానీ, అతనికి కొడుకులు లేరు. దాంతో అతను నిత్యం అసంతృప్తితో ఉండేవాడు. కుమారుడు లేని మనిషికి ఈ లోకంలోనే కాదు పరలోకంలోనూ సుఖం ఉండదు.
ఏ పాపం చేయలేదు
కొడుకును పొందడానికి రాజు అనేక విధాలుగా ప్రయత్నించాడు. కానీ అతనికి నిరాశ తప్పలేదు. మహాజిత్ రాజు వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తున్న కొద్దీ అతనిలో ఆందోళన కూడా పెరగసాగింది. ఒకరోజు సభలో రాజు ప్రసంగిస్తూ ‘నేను నా జీవితంలో ఏ పాపం చేయలేదు, అన్యాయంగా ప్రజల నుంచి సంపదను వసూలు చేయలేదు, ప్రజలను ఎప్పుడూ బాధపెట్టలేదు, దేవుళ్లను, బ్రాహ్మణులను అగౌరవపరచలేదు. అయినప్పటికీ ఎందుకు నాకు ఈ శిక్ష? నాకేమీ అర్థం కావట్లేదు. దీనికి కారణమేమిటో ఈ జన్మలో తెలుసుకుని విముక్తి పొందగలనా?’’ అని సభికులను ఉద్దేశించి చెప్పి రాజు కన్నీరుకార్చాడు.
రాజు బాధను విన్న మంత్రి సమీపంలోని అడవికి వెళ్లి లోమాష్ మహర్షికి విషయం మొత్తం చెప్పి పరిష్కారం చూపమని అభ్యర్థించాడు. దాంతో మహర్షి కళ్లు మూసుకుని రాజు పూర్వజన్మ గురించి దివ్య దృష్టితో చూస్తూ.. ఇలా చెప్పసాగాడు.
‘మీ రాజు తన పూర్వజన్మలో చాలా దురుసుగా ఉండేవాడు. చెడ్డ పనులు కూడా చేశాడు. ఒకసారి జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున ఒక ప్రదేశంలో నీళ్లు తాగుతున్న ఆవుని అక్కడి నుంచి తరిమికొట్టి తన దాహార్థిని రాజు తీర్చుకున్నాడు. ఆ పాపం ఈ జన్మలో కుమారుడు లేని లోటుతో అనుభవిస్తున్నాడు’’ అని ముగించాడు.
ఉపవాస ఫలం ఇస్తే
రాజు గత జన్మ పాపం విన్న మంత్రి.. మళ్లీ ‘ఓ మహర్షి, పుణ్యం వల్ల పాపాలు నశిస్తాయని పురాణాల్లో చెప్పారు కదా. ఈ జన్మలో మా రాజు ఎన్నో పుణ్యాలు చేశారు. కాబట్టి దయచేసి నివారణ మార్గం ఉంటే చెప్పండి’ అని కోరాడు.
మహిర్షి స్పందిస్తూ ‘‘శ్రావణ మాసంలోని శుక్లపక్షం పుత్రద ఏకాదశి రోజున మీరంతా ఉపవాసం ఉండి రాత్రి పూట జాగరణ చేసి ఆ ఉపవాస ఫలాన్ని మీ రాజుకు ఇస్తే సంతానం కలుగుతుంది’’ అని చెప్తాడు.
లోమాష్ మహర్షి ఆదేశానుసారం పుత్రద ఏకాదశి నాడు మంత్రితో పాటు రాజ్యంలోని ప్రజలు ఉపవాసం ఉండి దాని ఫలాన్ని ద్వాదశి నాడు రాజుకు ఇచ్చారు. ఆ ప్రభావంతో రాణి గర్భం దాల్చి తొమ్మిది నెలల తర్వాత కుమారుడికి జన్మనిచ్చింది. అందుకే ఈ ఏకాదశికి పుత్రద అనే పేరు వచ్చింది. ఈ కథ విన్నవారికీ యజ్ఞ ఫలం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి.