శ్రావణ మాస పండుగల విశిష్టత.. శివకేశవుల ఆరాధనకు ప్రత్యేక మాసంశ్రావణ మాస వైశిష్టము
శ్రావణ మాస విశిష్టత, ఈనెలలో పండగలు, చేయాల్సిన పూజలు, వంటి వివరాలన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు.
శ్రావణ మాసంలో శివారాధనకూ అత్యంత ప్రాధాన్యత
జ్యోతిష్యశాస్త్ర ప్రకారము చంద్రుడు శ్రవణా నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత ఈ మాసమునకు శ్రావణమాసమని పేరు వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రావణ మాసం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఆయన వివరించారు.
- శ్రీమన్నారాయణుని యొక్క జన్మ నక్షత్రము శ్రవణా నక్షత్రం. శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించినదీ ఇదే మాసం.
- పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలము బయటకు రాగా దేవతలు శివుడిని ప్రార్థిస్తారు. తన మాంగల్యబలంపై నమ్మకముతో గౌరీదేవి కూడా శివుడిని ఇదే కోరుతుంది. ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమేనని, వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివున్ని ఆ గరళాన్ని స్వీకరించమని కోరుతుంది. శివుడు లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన చేస్తారు. శివుడిని పంచామృతాలతో అభిషేకం చేస్తారు.
- అమ్మవారి మాంగల్య బలం చేత శివుడు ఈ పని చేసాడు కాబట్టీ శ్రావణ మంగళవారాలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. జాతకములో కుజదోషము, కాలసర్ప దోషము, రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే దోష నివృత్తి అవుతుందని విశ్వాసం.
- శ్రావణమాసంలో బుధవారాలు మహావిష్ణువును పూజించడం విశేషం. ఈరోజున విష్ణు సహస్ర నామము వంటివి పారాయణ చేసిన వారికి స్వామి వారి కృప లభిస్తుంది.
- జీవితములో దుఃఖములు కష్టముల నుంచి బయటకు రావడానికి వరలక్ష్మీ వ్రతాన్ని మించిన వ్రతము లేదు అని చిలకమర్తి తెలిపారు. లోకములో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్రపౌత్రాదులను పొందేటటువంటి వీలున్న ఏదైన ఒక వ్రతమును సూచించమని పార్వతీ దేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతమును సూచించినట్టు స్కాంద పురాణము వివరిస్తుంది.
- శ్రావణ మాసములో సోమవారాలు శివారాధన, మంగళవారాలు శక్తి ఆరాధన, బుధవారాలు విష్ణు భగవానుని ఆరాధన, శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన సత్ఫలితాలు పొందవచ్చని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.