Saphala ekadashi 2024: రేపే సఫల ఏకాదశి.. ఇలా చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది
Saphala ekadashi 2024: విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన సఫల ఏకాదశి రోజు లక్ష్మీదేవిని పూజించి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందుతారు.
Saphala ekadashi 2024: కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి ఏకాదశి సఫల ఏకాదశి. నెలకు రెండు చొప్పున ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. హిందూ మతంలో పౌష్ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజుని సఫల ఏకాదశి జరుపుకుంటారు. ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది.
సఫల ఏకాదశి రోజు కఠిక ఉపవాసం ఉండి జాగారం చేసి విష్ణువుని పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మరణించిన తర్వాత విష్ణు లోకప్రాప్తి పొందుతారని భక్తులు విశ్వాసం. ఈ పూజ చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ ఏడాది సఫల ఏకాదశి 2024, జనవరి 7న వచ్చింది. ఆరోజు శ్రీహరి విష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. సంపద ఆనందం, అదృష్టం పొందుతారు. అలాగే సఫల ఏకాదశి వ్రత కథ తప్పకుండా చదువుకోవాలి. ఉపవాసం ఉంటే మరుసటి రోజు తెల్లవారుజామున పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులకి ఆహారం పెట్టిన తర్వాత మీరు ఉపవాసం విరమించాలి.
అరటి మొక్కను పూజించాలి
హిందూ శాస్త్రంలో అరటి మొక్కకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సఫల ఏకాదశి రోజున అరటి మొక్కను పూజించడం వల్ల మేలు జరుగుతుంది. విష్ణువు నివాసం అరటి చెట్టుగా భావిస్తారు. అందుకే సఫల ఏకాదశి రోజు పసుపు నీటిని అరటి మొక్కకు సమర్పించి ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోతాయి. ప్రేమ చిగురిస్తుంది.
పసుపు పువ్వులు సమర్పించాలి
మహా విష్ణువుకి సఫల ఏకాదశి రోజు పసుపు రంగు పువ్వులు సమర్పించాలి. పూజకి పసుపు పువ్వులు ఎంచుకుంటే విష్ణువు సంతోషిస్తాడు. దీనితో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఈ పరిహారం పాటించడం వల్ల మంచి ఆరోగ్యం వరంగా పొందుతారని నమ్మకం. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
తొమ్మిది ముఖాల దీపం
విష్ణువు, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. లక్ష్మీదేవి ముందు తొమ్మిది ముఖాలు కలిగిన దీపాన్ని వెలిగించాలి.కాలవ వృక్షతో చేసిన తొమ్మిది ముఖాలు ఉన్న దీపం వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
తులసి మొక్కకి పూజ
తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. అందుకే సఫల ఏకాదశి రోజు తులసి మొక్కని తప్పనిసరిగా పూజించాలి. ఇలా చేస్తే మీ ఇంట సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం.
శంఖాన్ని అభిషేకించాలి
విష్ణువుకి ఇష్టమైన వాటిలో దక్షణావర్తి శంఖం ఒకటి. అందుకే ఈ శంఖాన్ని పాలతో అభిషేకం చేయాలి. లక్ష్మీ స్త్రోత్రం పఠించి పూజ చేస్తే అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఏడాది అంతా మీ మీద ఉంటుంది. సంపద పెరుగుతుంది.