Conch importance: శంఖము విశిష్టత ఏమిటి? దక్షిణామూర్తి శంఖం ఎందుకు ప్రత్యేకం?
Conch importance: పూజల్లో పవిత్రంగా భావించే శంఖం విశిష్టత, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి. అలాగే శంఖాల్లో దక్షిణామూర్తి శంఖం ప్రధాన్యత వివరంగా తెలుసుకోండి.
మన సనాతన ధర్మంలో శంఖమును మహా విష్ణు స్వరూపంగా, లక్ష్మీ ప్రదంగా వివరించారు. శ్రీమన్నారాయణుని అనేక అవతారాలలో శంఖ చక్రాలకు విశేషమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. శంఖములో పోస్తేనే తీర్థమన్నారు మనవారు. శాస్త్రప్రకారం శంఖము లక్ష్మీస్వరూపము.
అసలు శంఖం అంటే ఏమిటి?
దేవునికి అభిషేకము, పూజ చేయు అధికారము లక్ష్మీకే ఉంది. అందుచే లక్ష్మీదేవి ముఖాంతరముగా మనము పూజచేయాలని పెద్దలు చెబుతారు. సముద్రములో జీవించు ఒక ప్రాణి ఆత్మరక్షణ కోసము శరీరానికి నాలుగువైపుల రక్షణ కవచము నిర్మించుకొంటుంది. కొంతకాలం తర్వాత అది కవచం వదిలి కొత్త కవచము కట్టుకొనుటలో లీనమవుతుంది. ఆ జీవుల్ని మెలస్కాగా వ్యవహరిస్తారు. ఆ కవచమే మనకు చిరపరిచయమైన శంఖము.
ప్రాచీన భారతీయ సంస్కృతిలో శంఖానికి విశిష్ట స్థానం ఉంది. ఈ నాటికి శంఖానికి మన ధార్మిక జీవితములో సంబంధము ఉంది. ప్రజలు శంఖాన్ని పూజిస్తారు. అర్చన సమయాలలో శంఖనాదము చేస్తారు. బెంగాల్‌లో వివాహ సందర్భంగా శంఖధ్వని తప్పనిసరి, శంఖరాజము అన్నిటికంటె పెద్దదిగా ఉంటుంది. దానిలోపలి భాగము ముత్యము వలె ఉంటుంది. అందులో చెవి పెట్టి వింటే సముద్ర గర్జనా శబ్దము వినబడుతుంది. వైజ్ఞానికంగా చూసినా, శంఖము పైన తెలిపిన విధముగా సున్నపు అంశముతో తయారు కాబడినది. మానవుని దేహారోగ్యానికి (ఎముకలు పెరుగుటకు) సున్నము అంశము అత్యంత ఆవశ్యకము. వాతపిత్తదోషాలు కూడా తొలిగి పోతాయి. రోగాలు పోతాయని పరమపురుష సంహిత చెబుతుంది.
దక్షిణావర్త శంఖము శ్రీ విష్ణువుకు, లక్ష్మీకి ఎంతో ప్రీతికరం అయింది. ఈ శంఖము ఉన్న ఇంటిలో అఖండ సంపదలతో లక్ష్మి నివసిస్తుంది. శంఖము వెనుకవైపు ఉబ్బుగా ఉన్న వైపు బెజ్జము చేసి దానినుండి గాలి ఊదితే దివ్యమైన శబ్దం వస్తుంది. చాలామంది పూజలో ఈ శంఖాన్ని పెడతారు. పుణ్య దినమున ఇంట్లో పూజచేసి దేవతార్చనలో పెట్టాలి. శ్రీరామనవమి, విజయదశమి, గురుపుష్యమి, రవిపుష్యమి నక్షత్రములు పుణ్యతిథులు ఈ పర్వదినాల్లో తప్పకుండా పూజ చేయాలని చిలకమర్తి తెలియచేశారు.
సంపదలను ఆకర్షించే దక్షిణావర్త శంఖము :
సాత్విక పూజలలో ఉపయోగించు శంఖము వివిధ పరిమాణాల్లో, ఆకారాల్లో ఉపయోగిస్తారు. బ్రాహ్మణులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇదివరకు దీనిని క్షత్రియులు, వైశ్యులు కూడా పూజలలో ఉపయోగించేవారు. ఈ శంఖములు సముద్రములో తేలియాడుతూ దొరుకుతాయి. తెల్లటి శంఖములు మంచి ఆకారములో ఉంటాయని ఎక్కువ పవిత్రమైనదిగా భావిస్తారు. శంఖము కుడివైపును తెరచి ఉన్నది దక్షిణావృత శంఖము అంటారు. గాలి ఊదితే చక్కని ధ్వని వస్తుంది. రామాయణ, మహాభారతములో దీని ప్రాస్యము చెప్పబడింది. నిత్యపూజలు, పండుగలప్పుడు ఈ శంఖములను ఊదితే ఆ ధ్వనిని శుభప్రదమైనది అని తెలుస్తుంది. ఈ దక్షిణావర్త శంఖాలు కన్యాకుమారిలో దొరుకుతాయి. అంతా తెల్లరంగు గల శంఖము దొరకడం కొంచెము కష్టము అని తెలుస్తుంది. హీరా శంఖం అనునది చిన్నగా ఉండి సరస్సులలో దొరుకుతుంది. ఇది మేలివజ్రములాగా చాలా విలువగలది. దొరకడం చాలా కష్టము. ఇంటిలో ఒక శంఖము ఉండాలి. రెండు ఉండకూడదు అని పెద్దలు తెలుపుతారు. కొందరు 4,5,6,7,9 శంఖాలు ఉండవచ్చును అని అంటారు.
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
పంచాంగకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త.
టాపిక్