Karthika masam 2024: కార్తీకమాసంలో తులసిని ఇలా పూజించండి- 10 వేల రెట్లు పుణ్యఫలం దక్కుతుంది
Karthika masam 2024: కార్తీకమాసంలో పవిత్ర స్నానం, తులసి పూజ, దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో తులసిని ఆరాధించడం వల్ల పది వేల రెట్లు పుణ్యఫలం దక్కుతుంది. తులసిని ఎలా పూజించాలి? పూజా నియమాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
నవంబర్ 2వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది. హిందూ ధర్మ శాస్త్రంలో ఈ మాసానికి అత్యంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కాలం పరమేశ్వరుడిని, విష్ణుమూర్తిని పూజిస్తారు.
కార్తీక మాసంలో తలస్నానం చేయడం వల్ల మీకు అనంతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కాలంలో స్నానానికి, దానానికి, ఉపవాసాలకు, పూజలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించేటప్పుడు తులసి సమర్పించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మొక్కగా తులసిని భావించి పూజిస్తారు.
ముఖ్యంగా కార్తీక మాసంలో తులసి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ పవిత్ర మాసంలో గంగా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం ద్వారా వ్యక్తి అనంతమైన ఫలితాలను పొందుతాడు. ఈ మాసంలో చేసే మతపరమైన కార్యక్రమాల పుణ్యం అనేక రెట్లు పెరుగుతుంది. కార్తీక మాసం విష్ణువు, శివుడిని పూజించడానికి ప్రత్యేకమైన సమయంగా పరిగణిస్తారు.
సనాతన ధర్మంలో తులసి మొక్క ఎల్లప్పుడూ విశ్వాసానికి కేంద్రంగా ఉంది. కార్తీకమాసంలో శ్రీ హరి పూజలో తులసిని నైవేద్యంగా సమర్పించిన ఫలం 10 వేల గోదానంతో సమానం. కార్తీక మాసం అంతా తులసి ముందు దీపం వెలిగించాలి. ఒకవేళ కొన్ని కారణాల వల్ల దీపం వెలిగించకపోతే కార్తీకపౌర్ణమి రోజున 31 దీపాలు వెలిగించి మీ ఇంటికి, గృహానికి శుభం కలగాలని ప్రార్థించాలి.
కార్తీకమాసంలో సప్తదేవాలయాల్లో నియమ వ్రత సేవా మహోత్సవం కింద దేశ, విదేశాల నుంచి భక్తులు ఉదయం నుంచి తులసీ పూజ, పూజలు, తులసీ నమాష్టకం సేవతో పాటు పారాయణం చేస్తున్నారు. సాయంత్రం పూట తులసి ముందు దీపదానం చేయడం ద్వారా పుణ్యఫలాలు పొందుతున్నారు.
తులసి పూజా విధానం
కార్తీకమాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. తులసి మొక్కు నీటిని అందించండి. వీలైతే పచ్చి ఆవు పాలను నీటిలో కలపండి. తులసి జలం సమర్పించేటప్పుడు మహాప్రసాదం జనని, సర్వ సౌభాగ్యవర్ధిని, ఆది వ్యాధి హర నిత్యం, తులసీ త్వం నమోస్తుతే అనే మంత్రాన్ని జపించాలి. కార్తీకమాసంలో ఉదయం, సాయంత్రం తులసి చెట్టులో దీపం వెలిగించాలి. తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్ముతారు.
తులసి పూజ నియమాలు
మీరు కార్తీకమాసంలో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా తులసిని పూజించాలనే నియమం ఉంది. ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. కార్తీక మాసంలో తులసి ఆకులను తీయకూడదు. పాత లేదా పడిపోయిన తులసి ఆకులను నైవేద్యానికి ఉపయోగించాలి.
కార్తీక స్నానం ప్రాముఖ్యత
ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానమాచరించే సంప్రదాయం ఉంది. ఇది సాధ్యం కాకపోతే గంగా జలం నీటిలో కలిపి స్నానం చేయవచ్చు. దీనిని కార్తీక స్నానం అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల మనిషికి పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. ఈ మాసంలో దీపాలను దానం చేయడం, తులసిని పూజించడం కూడా చాలా పవిత్రమైనది, ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.