Gifts: ఈ బహుమతులు ఎవరు ఇచ్చినా పొరపాటున కూడా తీసుకోకండి- చిక్కుల్లో పడతారు
Gifts: గిఫ్ట్ ఇవ్వడం ఇప్పుడొక ట్రెండ్ గా మారిపోయింది. సందర్భానికి తగినట్టుగా బహుమతులు ఇస్తారు. అయితే కొన్ని బహుమతులు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. వాటిని తీసుకోవడం వల్ల చిక్కుల్లో పడతారు.
పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగలు సందర్భం ఏదైనా సరే బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. బహుమతులు ఇవ్వడం అనేది ప్రతిష్టాత్మకమైన సంప్రదాయంగా చూస్తున్నారు. సందర్భానికి తగినట్టుగా గిఫ్ట్ లు ఇస్తున్నారు.
అన్ని బహుమతులు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. కొన్ని ప్రతికూల శక్తిని లేదా దురదృష్టాన్ని తీసుకొస్తాయి. చాలా మంది ఇలాంటి సెంటిమెంట్ ను పట్టించుకోరు. అవన్నీ మూఢ నమ్మకాలని కొట్టి పారేస్తారు. మరికొందరేమో కొన్ని బహుమతులు తీసుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎలాంటి బహుమతులు స్వీకరించకూడదో తెలుసుకుందాం.
పదునైన వస్తువులు
పదునైన వస్తువులు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. ఇది స్నేహ బంధాన్ని తెంపెస్తుందని నమ్ముతారు. ఇలాంటివి ఇచ్చే వారికి, తీసుకునే వారికి మధ్య బంధాలను బలహీనపరుస్తుంది. మీకు ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి బహుమతులు ఇస్తే స్వీకరించే ముందు వారికి ఒక నాణెం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల దురదృష్టం మీ దరికి రాకుండా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్యలు రావు.
అద్దాలు
అనేక ఆధ్యాత్మిక అభ్యాసాలలో అద్దాలు శక్తిని ప్రతిబింబిస్తాయి. అద్దాన్ని బహుమతిగా స్వీకరించడం వల్ల మీ ఇంటికి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తుందని కొందరు నమ్ముతారు. ప్రత్యేకించి దురదృష్టం అనుభవిస్తున్న వ్యక్తి నుంచి వస్తే అది మరింత ప్రమాదకరం. అందుకే పొరపాటున కూడా అద్దం బహుమతిగా ఇవ్వకూడదు. అలాగే తీసుకోకూడదు.
ఖర్చీఫ్
కొన్ని సంస్కృతులలో రుమాలు ఇవ్వడం లేదా స్వీకరించడం దుఃఖాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. విచారంగా ఉన్నప్పుడు మనం అనుకోకుండా పక్క వారికి చేతి రుమాలు ఇస్తారు. కానీ ఇవి మీ దగ్గర అసలు ఉంచుకోకూడదు. ఇది ఇతరులతో కలహాలను సృష్టిస్తుంది. ఖర్చీఫ్ ఇవ్వడం వల్ల స్నేహం కూడా చెడిపోతుందని అంటారు. అందుకే మీకు ఎవరైనా ఖర్చీఫ్ ఇస్తుంటే మర్యాదపూర్వకంగా తిరస్కరించడం మంచిది. ఇది మీ బంధాన్ని విడదీయకుండా ఉంటుంది.
ఖాళీ పర్సులు
తమ ప్రియమైన వారికి చాలా మంది ప్రత్యేకంగా చేయించి పర్సు ఇస్తారు. వారి ప్రేమకు గుర్తుగా దీన్ని ఉంచుకోమని చెప్తారు. కానీ ఎప్పుడూ ఖాళీ వాలెట్ తీసుకోకూడదు. ఇది జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది. జీవితంలోని పురోగతిని అడ్డుకుంటుంది. మీరు ఎవరికైనా వాలెట్ ఇవ్వాలని అనుకుంటే అందుకో కనీసం కొంత మొత్తంలో డబ్బు పెట్టి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల శ్రేయస్సు, సంపద ప్రవాహాన్ని సూచిస్తుంది.
చాలా మందికి ఇవి మూఢ నమ్మకాలుగా అనిపిస్తాయి. కానీ ఇది ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తుందని చెప్తారు. ఇవి లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఇటువంటి బహుమతులు ఇచ్చే ముందు, స్వీకరించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటిని తిరస్కరించడమే మంచిది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్