Margasira Masam 2022 । మార్గశిర మాసం గురువారాలలో లక్ష్మీ దేవీ వ్రతం కథ, పూజా విధానం తెలుసుకోండి!
Margasira Masam 2022: సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీపూజలు చేయడం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతీ గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Margasira Masam 2022: మార్గశిర మాసం మహా విష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసం. ‘మాసానాం మార్గశీర్షోహం’ అంటే మాసాలలో మార్గశిర మాసం తానే అని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగములో చెపిన్నట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మార్గాశిర మాసంలో గురువారాలకు ప్రత్యేకత ఉంది. మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారాలుగా మన పురాణాలు తెలిపాయి. విశేషించి ఏ స్త్రీ అయినా మార్గశిర లక్ష్మీ వారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రంగా ఉంచి, దీపాలను వెలిగించి, లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో అలక్ష్మీ ఉండదు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనగా ఆరోగ్యము, కుటుంబమునుందు సౌఖ్యము, సౌభాగ్యప్రాప్తి, సుఖము, ఆనందము, ధనము అని అర్థము.
మార్గశిర లక్ష్మీవారముల గురించి మన పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో నారదుడు.. పరాశర మహర్షితో కలిసి భూలోకమునకు వీచ్చేసెను. ఈ భూలోకమున వారు సంచరించు సమయమున ఒక ఊరిలో జాతి, కుల, మత భేదములు లేకుండా అందరూ లక్ష్మీ దేవి పూజ వ్రతమును చేస్తుండగా చూసెను. అలా చూసినటువంటి నారదులు, ఈ వ్రతమేమి? వీరందరూ ఈ వ్రతం ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అని పరాశర మహర్షిని అడిగెను. అప్పుడు పరాశర మహర్షి నారదుడికి స్వయంగా ఇది మార్గశిర లక్ష్మీ వ్రతమని మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారాలు లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి సకల కోరికలు తీరి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పరాశర మహర్షి నారదునికి చెప్పెను.
మార్గశిర లక్ష్మీ వ్రత కథ -Margashirsha Goddess Lakshmi Story
మార్గశిర లక్ష్మీ వ్రత కథ ప్రకారం ఒకసారి లక్ష్మీదేవి మహావిష్ణువును ఈ రోజు మార్గశిర లక్ష్మీవారమని నేను నా భక్తులను అనుగ్రహించుటకు భూలోకమునకు వెళ్ళి వచ్చెదనని తెలిపి భూలోకమునకు పయనమయ్యెను. అప్పుడు మహావిష్ణువు ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో లక్ష్మీదేవికి కనిపించెను. అప్పుడు లక్ష్మీదేవి ఆ స్త్రీని నీవు ఎందుకు ఈ రోజు ఇంటిలో ఏ దీపము వెలిగించకుండా, మార్గశి లక్ష్మీదేవి పూజ చేయకుండా ఉన్నావని అడిగెను. అప్పుడు మార్గశిర లక్ష్మీపూజ ఏమిటి, దాని విశేషమేమిటి? అని లక్ష్మీదేవినే స్వయముగా ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపములో విష్ణువు అడిగెను. అప్పుడు లక్ష్మీదేవి మార్గశిర మాస లక్ష్మీ వ్రతాల గురించి ఈ విధముగా చెప్పినది..
మార్గశిర లక్ష్మీ వారం రోజున ఎవరైతే ఉదయమునే లేచి ఇల్లంతా శుభ్రపరచుకుని ఇంటి గుమ్మమునందు, తులసికోట వద్ద మందిరము నందు ఆవునేతిలో దీపాలను పెట్టి ఇంటి తూర్పు లేదా ఈశాన్య భాగమునందు ముగ్గు వేసి, పీట వేసి, వస్త్రమును పరచి లక్ష్మీదేవిని స్థాపనచేసి మార్గశిరమాస లక్ష్మీ వ్రతాన్ని, పూజలను చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది. ఈ పూజ చేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించి, ముందుగా పాలతో నైవేద్యమును సమర్పించి, తరువాత నూనెను వాడకుండా నేతితో చేసినటువంటి ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా మార్గశిర మాస లక్ష్మీదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి పూజ చేసినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి.. అని పురాణాలలో ఉందని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి వివరించారు.
మార్గశిర గురువారాల్లో అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు :
Margashirsha 2022 Thursdays: మార్గశిర మాసంలో ప్రతీ గురువారం లక్ష్మీదేవిని భక్తితో కొలవాలి, ప్రతీ గురువారం ఒక్కో నైవేద్యాన్ని సమర్పించాలి. ఏ గురువారం రోజున ఎలాంటి నైవేద్యం సమర్పించాలో ఇక్కడ తెలుసుకోండి.
- మొదటి గురువారం పులగము
- రెండవ గురువారం అట్లు, పిమ్మనం
- మూడవ గురువారం అప్పాలు, పరమాన్నం
- నాల్గవ గురువారం చిత్రాన్నం, గారెలు
- ఐదవ గురువారం పూర్ణం, బూరెలు
ఇలా ఐదు గురువారాలు, ఐదు రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్