Margasira Masam 2022 : మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది మార్గశిర మాసం.. ఎందుకంటే..
Significance of Margasira Masam : తెలుగు మాసాల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అలాగే మార్గశిర మాసం కూడా చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ మాసాన్ని.. అన్ని మాసాల్లోనే అగ్రగణ్యమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ మాసామే ఎందుకు అంత విలక్షణమైనదో.. అసలు మార్గ శిర మాసం ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Significance of Margasira Masam : మాసానాం మార్గశీర్షాహం. మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే.. విభూతి యోగములో తెలిపాడని.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. సూర్యభగవానుడు.. దేవగురువు అయిన బృహస్పతికి సంబంధించినటువంటి ధనూరాశిలో సంచరించే పుణ్యకాలాన్నే మార్గశిరము అంటారు. మార్గశిర మాసమందే ధనుర్మాసము, గోదాదేవి కల్యాణం వంటివి ఏర్పడటం మార్గశిర మాసం విశైషమైనదిగా చెప్తారు. మార్గశిర మాసములోనే గీతాజయంతి వంటివి జరుపుకుంటాము.
మార్గశిర మాసముతో ధనుర్మాసము ప్రారంభమవుతుంది. ధనుర్మాస ప్రాశస్త్యము బ్రహ్మాండ పురాణము, భాగవతము, వైఖానసము వంటి మొదలైన గ్రంథాలలో ప్రత్యేకంగా వివరించారు. సూర్యుడు ధనూరాశిలో ఉండగా.. విష్ణువును మేల్కొల్పే ధనుర్మాస వ్రతమును చేయాలని ఈ గ్రంథాలు చెబుతున్నాయి. మార్గశిర మాసము ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. మార్గశిర మాసములో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలలో మార్గశిర శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి అలాగే మార్గశిర ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి.
మార్గశిర గురువారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. మార్గశిర మాసము విష్ణుమూర్తి ఆరాధనకు, లక్ష్మీదేవిపూజలకు, దత్తాత్రేయుని పూజించుటకు విశేషమైనదిగా చెప్తారు. మార్గశిర మాసములో చేసేటటువంటి లక్ష్మీపూజలు వల్ల దరిద్రం తొలగిపోయి.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు, పరాశరుడు తెలిపినట్లుగా పురాణ కథలు ఉన్నాయి.
మార్గశిర మాసంలో ఉదయాన్నే ఏమి చేయాంటే..
మార్గశిర మాసములో సూర్యోదయ సమయంలో ఏ వ్యక్తి అయితే మహా విష్ణువును పూజిస్తాడో.. మహావిష్ణువు వద్ద ఆవునేతితో దీపాన్ని వెలిగించి.. విష్ణు సహస్ర నామం, భగవద్గీత పారాయణ చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తుంది.
సంబంధిత కథనం
టాపిక్