Ugadi Rasi Phalalu 2024: మకర రాశి ఉగాది రాశి ఫలాలు.. అన్ని విధాలా అనుకూల ఫలితాలు-makara rashi 2024 ugadi rasi phalalu krodhi nama samvatsara new telugu year horoscope of capricorn ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Rasi Phalalu 2024: మకర రాశి ఉగాది రాశి ఫలాలు.. అన్ని విధాలా అనుకూల ఫలితాలు

Ugadi Rasi Phalalu 2024: మకర రాశి ఉగాది రాశి ఫలాలు.. అన్ని విధాలా అనుకూల ఫలితాలు

HT Telugu Desk HT Telugu
Mar 30, 2024 12:05 PM IST

Makara Rashi 2024 Ugadi Rasi Phalalu: మకర రాశి ఉగాది 2024 రాశి ఫలాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ఆరోగ్యం, ఆర్థికం, కెరీర్, ప్రేమ తదితర అంశాల్లో ఈ క్రోధి నామ సంవత్సరం మకర రాశి జాతకులకు ఎలా ఉండబోతోందో వివరించారు. అలాగే మాసవారీ ఫలితాలను కూడా ఇక్కడ చూడవచ్చు.

Makara Rashi 2024 Ugadi Rasi Phalalu: మకర రాశి ఉగాది 2024 రాశి ఫలాలు
Makara Rashi 2024 Ugadi Rasi Phalalu: మకర రాశి ఉగాది 2024 రాశి ఫలాలు

మకర రాశి జాతకులకు శ్రీ క్రోధి నామ సంవత్సర 2024-25 రాశి ఫలాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశి జాతకులు అవుతారు.

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 14 పాళ్లు, వ్యయం 14 పాళ్లు, రాజ్యపూజ్యం 3 పాళ్లు, అవమానం 1 పాలు ఉన్నట్టు చిలకమర్తి వివరించారు.

మకర రాశి సంవత్సర రాశి ఫలాలు 2024-25

శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. బృహస్పతి 6వ స్థానంలో, శని 2వ స్థానంలో, రాహువు 3వ స్థానంలో సంచరిస్తున్నారు. కేతువు భాగ్య స్థానములో సంచరించుటచేత ఏలినాటి శని ఆఖరి భాగం అయినప్పటికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పంచమంలో గురుడు అనుకూలించడం, తృతీయంలో రాహువు అనుకూల ప్రభావం వలన మకర రాశి వారికి అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు కలుగుచున్నవి.

ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడును. గత కొంతకాలంగా ఉద్యోగంలో ఉన్న అనేక సమస్యలు తొలగి ప్రమోషన్లు వంటివి అనుకూలించును. వ్యాపారస్తులకు గత కొంతకాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వ్యాపారం అనుకూలించును. ధనపరమైన సమస్యల నుండి బయటపడెదరు.

మకర రాశి జాతకులు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అనారోగ్య సమస్యలు వేధించును. కోర్టు వ్యవహారములు ఈ సంవత్సరం అనుకూలించును. రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సినీ, మీడియా రంగాల వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత అనుకూల ఫలితాలు కలుగును.

విదేశీ ప్రయాణాల కోసం మీరు చేయు ప్రయత్నాలు అనుకూలించును. స్త్రీలు అరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది.

మకర రాశి వారి ప్రేమ జీవితం 2024-25

మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం ప్రేమ విషయంలో అనుకూలంగా ఉన్నది. జీవితభాగస్వామితో అనందముగా గడిపెదరు. ప్రేమ వ్యవహారాలు సత్ఫలితాలను కలిగించును.

మకర రాశి ఆర్థిక విషయాలు 2024-25

మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నవి. ఏలినాటి శని ప్రభావం వలన అప్పుల బాధలు అధికముగా ఉన్నప్పటికి బృహస్పతి పంచమంలో అనుకూలంగా వ్యవహరించడం వలన ఆర్థికపరంగా కొంత పురోగతి లభించును. దైవారాధన వలన ఆర్థికపరంగా మరింత శుభఫలితాలు పొందగలరు.

మకర రాశి కెరీర్ 2024-25

మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం కెరీర్ పరంగా అనుకూలించును. నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తించును. ఉద్యోగస్తులకు ధనలాభం, ప్రమోషన్లు వంటివి కలుగును.

మకర రాశి ఆరోగ్యం 2024-25

మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా పురోగతి కలుగును. పంచమంలో గురు గ్రహ అనుకూలత వలన గత కొంతకాలంగా ఏవైతే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నవో ఆ సమస్యల నుండి బయటపడెదరు. సౌఖ్యం, ఆనందము పొందెదరు.

శుభ ఫలితాల కోసం చేయాల్సిన పరిహారాలు

మకరరాశి జాతకులు 2024-25 క్రోధి నామ సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, శనివారం వేంకటేశ్వరస్వామిని పూజించడం, దర్శించడం మంచిది. శని స్తోత్రాలను పఠించండి. అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలని సూచించారు.

ధరించాల్సిన నవరత్నం: మకర రాశి వారు ధరించవలసిన నవరత్నం ఇంద్రనీలం.

ప్రార్థించాల్సిన దైవం: మకర రాశి జాతకులు పూజించవలసిన దైవం వేంకటేశ్వర స్వామి.

స్వర్ణ రథంపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారు
స్వర్ణ రథంపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారు

మకర రాశి వారికి 2024 ఉగాది నెలవారీ రాశి ఫలాలు

ఏప్రిల్‌: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. గురు బలంచే చివరకు కార్య సాఫల్యత సిద్ధించును. మనోధైర్యము కోల్పోవుటచే కార్యానుకూలత లేకపోవుట. ధన వ్యయము. స్థానచలన మార్పులు. బంధుమిత్ర విరోధము. ప్రయాణములు.

మే: ఈ మాసం మకరరాశి జాతకులకు అనుకూలంగా లేదు. స్త్రీ సౌఖ్యము. కార్యజయము. బద్ధకము. ధన ప్రాప్తి. శిరోపీడ, నూతన స్నేహ పరిచయాలు. నూతన వస్త్రధారణ. శత్రు పీడ. వ్యాపార మందు ఆటంకములు తొలగి వ్యాపారం సజావుగా జరుగును.

జూన్‌: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. చెడు సహవాసములు కలుగుట. మనస్సు కష్టము. సువర్ణ వస్తుప్రాప్తి. ఆరోగ్య భంగము. ఔషధసేవ. దైవక్షేత్ర దర్శనము. సంతాన సౌఖ్యము. శత్రుజయము. ఇష్టకార్యసిద్ధి. సోదరమూలక పట్టింపులు.

జూలై: ఈ మాసం మీకు సామాన్యంగా ఉంది. సుఖమునకు ఇబ్బందులు. ప్రయాణముల యందు విఘ్నములు. కార్యహాని. వ్యాపారులకు వ్యాపారం అంతంత మాత్రమే. అశించిన మేర ఫలితములు ఉండవు.

ఆగస్టు: ఈ మాసం మకర రాశి వారికి అనుకూలంగా లేదు. ధనవ్యయము అగుట. బుద్ధి స్థిరత్వము లేకపోవుట. స్నేహితులతో చిన్నపాటి ఇబ్బందులు. కార్యభంగము. నిందలు మోయాల్సి వస్తుంది. కుటుంబము వారిపై ఆగ్రహించుట. అకాల భోజనములు ఉండుట. స్త్రీ మూలక వ్యవహారములలో చురుగ్గా పాల్గొంటారు.

సెఫ్టెంబర్‌: ఈ మాసం మీకు అనుకూలం సమయం. శరీర సౌఖ్యము. వస్త్రలాభము. సంతోషము. ధాన్యాది వాహన లాభములు. స్త్రీ సౌఖ్యము. శరీర తాపము. మనోఫలసిద్ధి. మృష్టాన్నభోజనము. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం వలన విజయములు.

అక్టోబర్‌: ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. భార్యతో చిన్నపాటి ఇబ్బందులు. కుటుంబ సౌఖ్యము. బంధుమిత్ర సమాగమం. ప్రభుత్వపరమైన లబ్ది. ద్రవ్యలాభ సూచనలు. చుట్టుప్రక్కలవారిపై ద్వేషము కలుగుట. వ్యాపారులు వ్యాపార కార్యకలాపాలు విస్తరించుట.

నవంబర్‌: ఈ మాసం మకర రాశి జాతకులకు మధ్యస్థం. ఇతరులచే మాటపడుట. దేహ కష్టములు. శరీరమందు నిస్సత్తువ. మంచి మాట్లాడినా చెడు ఫలితములు. సంఘములో పేరు ప్రఖ్యాతులు. మిత్రులు కలయిక, దూర ప్రయాణములు చేయుట. దైవ కార్యక్రమాల్లో పాల్గొనుట.

డిసెంబర్‌: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మనోవిచారము కలుగుట. ఎదుటివారు మిమ్ములను నిందించుట. ధనవ్యయము. లాభములు మందగించుట. దైవారాధన కార్యక్రమాలు చేయుట. భాగస్వామ్య వ్యాపారులు మెళకువగా వ్యవహరించవలెను

జనవరి: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. నూతన వస్తు ప్రాప్తి. ద్రవ్యప్రాప్తి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు. బంధుమిత్ర సమాగమము. ప్రభుత్వ ఉద్యోగుల సందర్శన. అకారణ నిందలు పడవలసివచ్చును. అకాలభోజనములు. తీర్ణయాత్రల వలన మనశ్శాంతి.

ఫిబ్రవరి: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. కుటుంబమునందు అనందము. ద్రవ్యలాభము. శుభకార్యక్రమాలు నిర్వహించుట. పిత్త ప్రకోపముచే అనారోగ్యం. సంఘములో పలుకుబడి పెరుగు సూచనలు కలవు. శుభవార్తలు వింటారు. సత్సంగము చేయుట.

మార్చి: ఈ మాసం మకర రాశి వారికి అంతగా అనుకూలంగా లేదు. ప్రయాణములయందు జాగ్రత్త. వాహన వేగం తగ్గించి ప్రయాణములు చేయుట మంచిది. కోర్టు వ్యవహారములు జాగ్రత్తగా గమనించుట మంచిది. దగ్గర బంధువులకు అనారోగ్యం. స్థానచలనము. అధికారులచే మాటపడుట.

- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ