Raksha bandhan 2024: సోదరుడు క్షేమంగా ఉండేందుకు రక్షా బంధన్ రోజు సోదరి పాటించాల్సిన పరిహారాలు ఇవే-every sister must follow these remedies on raksha bandhan for beging her brother well being ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Raksha Bandhan 2024: సోదరుడు క్షేమంగా ఉండేందుకు రక్షా బంధన్ రోజు సోదరి పాటించాల్సిన పరిహారాలు ఇవే

Raksha bandhan 2024: సోదరుడు క్షేమంగా ఉండేందుకు రక్షా బంధన్ రోజు సోదరి పాటించాల్సిన పరిహారాలు ఇవే

Gunti Soundarya HT Telugu
Aug 17, 2024 11:45 AM IST

Raksha bandhan 2024: రక్షా బంధన్ రోజు తన సోదరుడి చేతికి రక్షా సూత్రం కట్టడమే కాదు వారి జీవితం బాగుండాలని కోరుకుంటూ కొన్ని పరిహారాలు పాటించాలి. సంపద, సంతోషం, శ్రేయస్సు కోసం సోదరి పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం. వీటిని అనుసరించడం వల్ల సోదరుడి జీవితం ఆనందంగా ఉంటుంది.

రక్షా బంధన్ వేడుక
రక్షా బంధన్ వేడుక (pixabay)

Raksha bandhan 2024: అన్నా చెల్లెళ్ల మధ్య అపూర్వమైన ప్రేమకు గుర్తుగా ఏటా రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఆరోజు ఎంత దూరంలో ఉన్నా కూడా సోదరుడు తన సోదరితో రాఖీ కట్టించుకోవడం కోసం తాపత్రాయపడతాడు. తమ ప్రియమైన సోదరుడు చేతి మణికట్టుకు రక్షా సూత్రాన్ని కట్టి తమకు జీవితాంతం రక్షణ కల్పించమని కోరుకుంటారు. 

ఈ ఏడాది ఆగస్టు 19 సోమవారం రక్షాబంధన్ వచ్చింది. ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్ర నీడ కూడా ఉంది. ఉదయం 5. 53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒకటి 11.32 వరకు కొనసాగుతోంది. అందువల్ల మధ్యాహ్నం 1.33 నుంచి రాఖీ కట్టేందుకు అనువైన సమయం. అయితే రాఖీ కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. సోదరుడి క్షేమం కోరుతూ సోదరి కొన్ని పరిహారాలు పాటించడం చాలా మంచిది. ఇలా చేస్తే సోదరుడి జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఈ పనులు చేయడం వల్ల సోదరుడికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. 

వినాయకుడికి రాఖీ

అన్నదమ్ముల మధ్య ఏదైనా సమస్య ఉన్నట్లయితే రాఖీ పండుగ రోజు సోదరి ముందుగా వినాయకుడికి రాఖీ కట్టాలి. ఆ తర్వాత తన సోదరులకు కడితే మంచిది. ఇలా చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య ప్రేమ పెరుగుతుంది. వారిద్దరి బంధం బలపడుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. అలాగే వినాయకుడిని పూజించాలి. అన్నా చెల్లెలు ఇద్దరూ కలిసి వినాయకుడిని పూజించడం వల్ల తమ వృత్తిలో ఎదుర్కొనే ఆటంకాలను అధిగమించగలుగుతారు. 

సంపద కోసం

ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు తన అన్న/ తమ్ముడికి అక్షింతలు, తమలపాకులు, వెండి నాణెం, గులాబీ రంగు వస్త్రంలో కట్టి ఇవ్వాలి. వీటిని సోదరుడు భద్రంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ సోదరుడి ఇంట్లో ఎప్పటికీ ఆర్థిక కొరత అనేది ఉండదు. 

సంతోషం కోసం

రాఖీ పండుగ రోజు మీకు తోచిన విధంగా పేదవారికి ఆహారాన్ని పంచాలి. అలాగే ఆవులకు పచ్చ గడ్డి వేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటాయి. 

చంద్రుడి ఆరాధన

పౌర్ణమి రోజు రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. అందువల్ల ఆరోజు చంద్రోదయం సమయంలో చంద్రదేవుడిని పూజించాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి.

రాఖీని శుద్ధి చేయాలి

మీరు మీ సోదరుడికి రాఖీ కట్టడానికి ముందుగానే రాఖీని గంగాజలంతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత మీ ఇష్ట దేవత పాదాల వద్ద సమర్పించి పూజ చేయాలి. అనంతరం మీ సోదరుడి  చేతికి కట్టాలి. ఇలా చేయడం వల్ల సోదరుడి జీవితంలో సంతోషం నెలకొంటుంది. 

చెడు దృష్టి తొలగిపోయేందుకు

సోదరుడి జీవితం బాగుండాలని కోరుకుంటూ చెడు దృష్టి తొలగిపోయేందుకు ఈ పని చేయడం చాలా ఉత్తమం. కొన్ని స్పటికలు తీసుకుని వాటిని మీ సోదరుడు తల చుట్టూ 7 సార్లు తిప్పి దిష్టి తీసి వాటిని రోడ్డు మీద విసిరేయాలి. ఇలా చేయడం వల్ల వారికి ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. 

పరమేశ్వరుడిని పూజించాలి

ఏడాది రక్షాబంధన్ పండుగ శ్రావణ సోమవారం నాడు వచ్చింది. అందువల్ల ఈరోజు పరమేశ్వరుడిని పూజించాలి. సోదరి తన అన్న జీవితం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శివుడని పూజించడం శ్రేయస్కరం.