Sri rama navami 2024: శ్రీరామనవమికి పానకం ఎందుకు పోస్తారో తెలుసా? ఇది పంచడం వెనుక కారణం ఏమిటంటే..
Sri rama navami 2024: శ్రీరామనవమి అంటే వడపప్పు, పానకం లేకుండా పూర్తి కాదు ఆరోజు వీధుల్లో ఎక్కడ చూసిన పానకం పంచిపెడుతూనే ఉంటారు. ఈ ప్రసాదం పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా?
Sri rama navami 2024: శ్రీరామనవమి అంటే తాటాకు పందిళ్ళు, రాములోరి కళ్యాణం ఉంటుంది. మరికొన్ని గ్రామాల్లో అయితే తిరునాళ్ళ కూడా చేసుకుంటారు. ఆరోజు కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం చేస్తారు. ఆజానుబాహుడు ముగ్ధమనోహరమైన మొహం కలిగిన శ్రీరాముల వారికి, కుందనపు బొమ్మలా ఉండే సీతమ్మ తల్లికి వివాహం చేసి తరిస్తారు. అక్షింతలు వేసి అందరూ ఆశీర్వదిస్తారు. ఆరోజు జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఎవరూ మిస్ చేసుకోరు.
శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది ఆరోజు పెట్టె పానకం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వడపప్పు, పానకం తెగ తాగేస్తారు. శ్రీరామనవమి పండుగ ఎంత ఫేమస్ అయ్యిందో ఆరోజు పెట్టె ప్రసాదం కూడా అంతే ఫేమస్ అయ్యింది. అయితే శ్రీరామనవమి నాడే వడపప్పు, పానకం ఎందుకు పంచుతారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం?
శ్రీరామనవమి చైత్రమాసంలో వస్తుంది. చల్లని శీతాకాలంలో వేడి అనేది తెలియకుండా ఉంటాం. చైత్ర మాసం నుంచి వసంత రుతువు వస్తుంది. అప్పటి వరకు శీతాకాలం వల్ల చల్లదనాన్ని అనుభవించిన శరీరాలు ఒకసారిగా వచ్చే ఎండలు, వేడి వాతావరణాన్ని తట్టుకోలేవు.
మరీ ముఖ్యంగా మన దేశంలో అయితే ఎండలు అంటే ఇంకాస్త ఎక్కువగానే వేడి పుట్టిస్తాయి. వెచ్చని గాలులు శరీరాన్ని వేడి పుట్టిస్తాయి. వాటి నుంచి తట్టుకునేందుకు శరీరాన్ని సిద్ధం చేసేందుకు ఈ పానకం, వడపప్పు పెడతారు. ఎండ వేడి నుంచి సేద తీరేందుకు ఈ వడపప్పు, పానకం అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయి.
ఎంతో రుచికరంగా ఉండే ఈ వడపప్పు, పానకం శ్రీరామనవమి నైవేద్యంగా ప్రతి ఒక్క ఇంట్లో చేసుకుంటారు. గుడిలో దేవుడికి నైవేద్యంగా సమర్పించి భక్తులందరికీ పంచి పెడతారు. శ్రీరాముడి కల్యాణం ఉంటే లోక కళ్యాణం కిందే భావిస్తారు. మరి అంతటి జగత్కార్యం జరిగిన సమయంలో ప్రతి ఒక్కరూ నోరు తీపి చేసుకోవాలని ఉద్దేశంతో కూడా ఇది పంచి పెడతారు. అది మాత్రమే కాదు పూర్వం పెళ్లిళ్లలో పానకం బిందెలు పంచే ఆచారం ఉంటుంది. అలా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం కనుక పానకాన్ని అందరికీ పంచిపెడతారు.
వడపప్పు, పానకం ఎందుకంటే..
బెల్లంతో తయారు చేసే ఈ పానకం శరీరానికి చాలా చలువ చేస్తుంది. ఇందులో కాస్త మిరియాల పొడి, శొంఠి, యాలకులు వేసి తయారు చేస్తారు. చాలా సింపుల్ గా క్షణాల్లో రెడీ చేయగలిగే ప్రసాదం ఇది. బెల్లం నీటిలో కలుపుకుని తీసుకుంటే శరీరం వేడి తగ్గిస్తుంది. ఇందులో వేసే మిరియాలు, శొంఠి పొడి వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది.
ఇంక వడపప్పు అంటే పెసరపప్పు. ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి వడదెబ్బ తగులుతుంది. ఈ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు పెసరపప్పు నానబెట్టుకుని అందులో కాస్త నిమ్మరసం కలుపుకుని ప్రసాదంగా తీసుకుంటారు. ఇవి రెండూ కలిపి తీసుకుంటే శరీరం వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకోగలుగుతుంది. ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలుగుతారు. అటు దేవుడి మీద భక్తితోనే కాకుండా ఇటు ఆరోగ్యం కోసం కూడా వడపప్పు, పానకం ప్రసాదంగా స్వీకరిస్తారు.