Lord shiva: తమలపాకులతో శివపూజ ఇలా చేయండి.. ఈ అద్భుతమైన ఫలితాలు పొందుతారు
Lord shiva: సోమవారం శివుడికి తమలపాకులు సమర్పించి పూజ చేయడం వల్ల కొన్ని అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సోమవారం శివయ్య అనుగ్రహం పొందటం కోసం ఇలా చేశారంటే మీకు పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
Lord shiva: సోమవారం శివుడికి అంకితం చేసిన రోజు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు. కొద్దిగా నీటితో శివలింగానికి అభిషేకం చేసినా చాలు పరవశించిపోతాడు. భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తాడు.
శివలింగానికి ఎక్కువగా బిల్వ పత్రాలు సమర్పిస్తారు. ఇవి శివుడికి ఎంతో ప్రీతికరమైనవని నమ్ముతారు. అయితే ఇది మాత్రమే కాకుండా శివలింగానికి తమలపాకు సమర్పించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఇది జీవితాలపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని పండితులు సూచిస్తున్నారు. శివలింగానికి తమలపాకు సమర్పిస్తే జీవితంపై ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.
అభిషేకం ప్రియం
ముందుగా శివలింగానికి పూజ చేస్తే ముందు స్వచ్చమైన నీటితో అభిషేకం చేయాలి. తర్వాత ఆవుపాలు, పెరుగు, పంచదార, తేనె, గంగాజలంతో అభిషేకం చేయాలి. అనంతరం తమలపాకులు, ఉమ్మెత్త పూలు, బిల్వ పత్రాలు, సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి. ఆనందం, శాంతి, శ్రేయస్సు తెస్తుంది.
మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి రుద్రాభిషేకం సమయంలో తమలపాకును పరమేశ్వరుడికి సమర్పిస్తే భక్తుల బాధలు తొలగిపోతాయి. శివుని ఆశీర్వాదాలతో జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
డబ్బుకు సంబంధించిన సమస్యలు అధిగమించేందుకు
డబ్బుకు సంబంధించి సమస్యలు ఏమైనా ఉన్నా, ఇంట్లో డబ్బు నిలవకపోతున్నా, రుణ సమస్యలు బాధిస్తున్నా ఈ పరిహారం పాటించడం ఉత్తమం. రుద్రాభిషేకం చేసే సమయంలో స్వామి వారికి మీ మనసులో కోరికను తలుచుకుంటూ తమలపాకు సమర్పించాలి. ఇది జీవితంలో శాంతి, ఆనందాన్ని తీసుకొస్తుంది. ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది.
పనిలో ఆటంకాలు పోయేందుకు
ఏదైనా చిన్న పని తలపెట్టినా కూడా అడుగడుగునా కొందరికి ఆటంకాలు ఎదురవుతాయి. పని మధ్యలోనే ఆగిపోతుంది. అటువంటి సమయంలో మీరు శివయ్యను ఆరాధించి శివలింగానికి తమలపాకులు సమర్పించాలి. ఇది మీ పనులు సజావుగా సాగేలా చేస్తుంది. విజయం చేకూరుతుంది. తమలపాకులతో పరమేశ్వరుడికి పూజ చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని చెబుతారు.
పాజిటివ్ ఎనర్జీ కోసం
నిరాశ, నిస్పృహ, ఆందోళన, ప్రతికూలతతో బాధపడుతుంటే జీవితంలో సానుకూల ప్రభావాలు కలిగేలా చేసేందుకు ఈ పరిహారం సహాయపడుతుంది. మీరు నిండైన హృదయంతో శివుడిని పూజించి, శివలింగానికి తమలపాకు సమర్పించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీవితంలో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. సోమవారం శివలింగానికి తమలపాకు సమర్పిస్తే మరింత మంచిది.
సోమవారం ఇలా చేయండి
ఇవి మాత్రమే కాదు సోమవారం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకోవడం వల్ల కష్టాల నుంచి బయట పడతారు. శివుడికి బిల్వ పత్రాలతో అర్చన లేదా అభిషేకం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభించడంతో పాటు జన్మజన్మల పాపాలు నశిస్తాయి.
సోమవారం నాడు తలస్నానం చేసి నుదుటిన విభూది ధరించడం వల్ల శివుడి కరుణా కటాక్షాలు పొందుతారు. సోమవారం మూడు వేళలా శివాభిషేకం చేస్తే ముప్పై కోట్ల మంది దేవతలు ఆ వ్యక్తి ఇంట చేరి అభిషేకాన్ని తిలకిస్తారని చెబుతారు. సోమవారం శివ పూజ చేసే వాళ్ళు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మాంసాహారం, మద్యపానం, ఉల్లిపాయలు వంటి వాటిని పూర్తిగా నిషేధించాలి. మంచి మనసుతో దేవుడిని వేడుకోవాలి. అప్పుడే కోరిన కోరికలు నెరవేరతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.