Oleander flower: గన్నేరు పూల చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా?-can oleander flower plant to be grow at home which direction is best for plants ganneru flowers ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Oleander Flower: గన్నేరు పూల చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా?

Oleander flower: గన్నేరు పూల చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా?

Gunti Soundarya HT Telugu
Jan 30, 2024 07:05 PM IST

Oleander flower: రకరకాల రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే గన్నేరు పూల చెట్లు రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కనిపిస్తాయి. మరి ఆ పూల చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.

గన్నేరు పూలు
గన్నేరు పూలు (pixabay)

Oleander flower: ఏ ఇంటి ముందు చూసినా పసుపు రంగు గన్నేరు పూల చెట్టు కనిపిస్తుంది. చెట్టు నిండుగా పూలు పూసి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. రంగు రంగుల గన్నేరు పూల చెట్లు ఎక్కడంటే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ పూజకి తప్పనిసరిగా పూలు సమర్పిస్తారు. వాటిలో పారిజాతం, గన్నేరు పూలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు పూల చెట్లు ఎటువంటి ప్రదేశంలోనైనా పెరుగుతాయి.

వాస్తు శాస్త్రంలో కూడా గన్నేరు పూలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో గన్నేరు పూల చెట్టు ఉండటం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు. విషపూరితమైనది అయినప్పటికీ వాస్తు ప్రకారం గన్నేరు చెట్టు దాని పువ్వులు చాలా పవిత్రమైనవి. తంత్ర విద్యలలో గన్నేరు పూలు ఎక్కువగా వినియోగిస్తారు.

తెలుపు, గులాబీ, పసుపు, లేత గులాబీ రంగుల్లో గన్నేరు పూలు మనకి దొరుకుతాయి. రోడ్లు పక్కన ఎక్కువగా గులాబీ రంగు గన్నేరు పూలు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య అధికంగా గొడవలు పడుతూ, ఇద్దరి మధ్య చికాకు వాతావరణం ఎక్కువగా ఉంటే ఇంట్లో గన్నేరు పూల చెట్టు ఒకటి నాటుకోవచ్చు. ఇలా చేయడం వల్ల గొడవలు తగ్గే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దేవుళ్ళకి ఇష్టమైన పువ్వు

ఏ పూజ కూడా పూలు లేకుండా పూర్తి కాదు. దేవతలకి ఇష్టమైన పూలు ఉపయోగించి పూజ చేస్తారు. వేదాల ప్రకారం గన్నేరు పూలు అంటే మహా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవిని గన్నేరు పూలతో పూజించడం వల్ల జీవితంలోకి ధనం, ఆనందం, శ్రేయస్సు వస్తాయి. మీ మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలంటే ఇంట్లో గన్నేరు పూల చెట్టు పెట్టుకోండి.

లక్ష్మీదేవికి తెలుపు రంగు గన్నేరు పూలతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే మహా విష్ణువుకి పసుపు గన్నేరు అంటే మహా ప్రీతి. ఈ పూలతో శ్రీహరిని పూజించడం వల్ల సకల సంపదలు పెరుగుతాయి. అది మాత్రమే కాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంట్లో సంతోషం, శ్రేయస్సు నిండి ఉంటాయి.

ఏ దిశలో గన్నేరు చెట్టు నాటాలి?

మొక్కలు నాటే విషయంలో కూడా వాస్తు ప్రకారం చేయడం వల్ల అది మంచి ఫలితాలు ఇస్తుంది. పసుపు రంగు గన్నేరు పూల మొక్కని ఇంటి ప్రధాన ద్వారం ముందు తూర్పు దిక్కున పెట్టుకుంటే మంచిది. ఇక తెల్లటి రంగు గన్నేరు పువ్వుల మొక్కని తూర్పు లేదా ఈశాన్య దిక్కున నాటుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏర్పడే సమస్యలు తగ్గుముఖం పడతాయి.

గన్నేరు పూలని జ్యోతిష్య శాస్త్రంలో మంగళ దోష నివారణకు ఉపయోగిస్తారు. అందుకే ఈ పువ్వులు అత్యంత పవిత్రమైనవిగా చెప్తారు. అది మాత్రమే కాదు హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మలోనూ తప్పనిసరిగా గన్నేరు పూలు పెడతారు. గన్నేరు చెట్టు విషపూరితం అయినప్పటికీ ఇందులోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గించుకునేందుకు గన్నేరు ఆకులు నీటిలో ఉడికించి ఆ నీటిని నొప్పి ఉన్న చోట రాసుకోవచ్చు. ఇది విషపూరితం కాబట్టి చిన్న పిల్లలని ఈ చెట్టు గింజలు తినకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

Whats_app_banner