Bedroom vastu: పడక గదిలో ఈ వస్తువులు ఉంచొద్దు.. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి
Bedroom vastu: భార్యాభర్తలు సంతోషంగా ఉంటే ఆ కాపురం కలకాలం నిలబడుతుంది. అదే ఇద్దరి మధ్య గొడవలు అయితే మాత్రం జీవితం నరకంగా మారుతుంది. పడక గదిలో ఈ వస్తువులు ఉంటే దాంపత్య జీవితం సమస్యల్లో పడుతుంది.
Bedroom vastu: భార్యాభర్తల మధ్య బంధం బీటలు వారుతుందా? ఎప్పుడు ఇరువురి మధ్య గొడవలతో మనశ్శాంతి లేకుండా ఉంటుందా? అయితే మీ బెడ్ రూమ్ వాస్తు సరిగా ఉందో లేదో చూసుకోండి.
వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. చాలా సార్లు మనకి తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు దాంపత్య జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి. పడక గది వాస్తు సరిగా లేకపోతే భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా పెరుగుతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి భార్యాభర్తల మధ్య బంధం బలోపేతం కావాలంటే ఈ ఐదు వస్తువులు మీ బెడ్ రూమ్ లో అసలు ఉంచకూడదు. ఇవి ఉంటే మాత్రం దాంపత్య జీవితం సమస్యల్లో పడుతుంది.
ఎండిపోయిన మొక్కలు
ఇంట్లో ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న కుండీల్లో అందమైన మొక్కలు పెట్టుకుంటూ ఉంటున్నారు. చూసేందుకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కానీ ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉంచడం మంచిది కాదు. ఎండిన ముళ్ళ మొక్కలు పడక గదిలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. వీటి వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
చనిపోయిన వారి ఫోటోలు
తమకి ఇష్టమైన వారి ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు ఇంట్లో అందరూ పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం పడక గదిలో చనిపోయిన వారి ఫోటోలు అసలు పెట్టకూడదు. చనిపోయిన వ్యక్తి ఫోటోలు బెడ్ రూమ్ లో పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తాయి. నెగిటివిటీ పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి.
పని చేయని గడియారం
అందంగా ఉందని కొంతమంది పని చేయకపోయిన కూడా గడియారం ఇంట్లో ఉంచుకుంటారు. అది వాస్తు ప్రకారం మాత్రమే కాదు సాధారణంగా కూడా అశుభంగా పరిగణిస్తారు. నిద్రలేచిన తర్వాత పని చేయని గడియారాన్ని చూడటం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పని తలపెట్టినా కూడా కలిసి రాదు. ఇంట్లో ఏ మూలలో కూడా పని చేయని గడియారం ఉంచుకోకూడదు.
ఫోటో ఫ్రేమ్స్
ఇంటిని మరింత అందంగా మార్చడం కోసం ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుంటారు. ప్రకృతి చిత్రాలు పెట్టుకుంటే మంచిది. కానీ యుద్ధ సన్నివేశాలు ప్రతిబింబించేవి ఘర్షణ వాతావరణం ఉన్న చిత్రపటాలు ఉండకూడదు. అలాగే విరిగిన, చిరిగిన చిత్రాలు ఇంట్లో పెట్టుకోకూడదు. దీని వల్ల కుటుంబంలో విభేదాలు వస్తాయి. కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పడక గదిలో యుద్ధ చిత్రాన్ని ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి. అదే విధంగా విచారకమైన ముఖాలు ఉన్నవి కూడా బెడ్ రూమ్ లో పెట్టకూడదు. చాలా మంది తాజ్ మహల్ ఇంట్లో పెట్టుకుంటారు. ప్రేమకి ప్రతిరూపం అని భావిస్తారు. కానీ తాజ్ మహల్ ముంతాజ్ చనిపోయిన తర్వాత ఆమెకి గుర్తుగా నిర్మించినది కాబట్టి అది ఉంచకూడదు. దీంతో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
పడక గది దిశ ముఖ్యమే
పడక గది ఉండాల్సిన దిశ కూడా చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య సంతోషకరమైన వాతావరణం, ప్రేమానురాగాలు ఉండాలంటే పడక గది ఉత్తర లేదా వాయువ్య దిశలో నిర్మించుకోవాలి. ఈ దిశలో బెడ్ రూమ్ ఉంటే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది.