NPS scheme: నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్.. దీర్ఘకాలిక పొదుపునకు ఆకర్షణలెన్నో
National Pension System | నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్.. పెన్షన్, పెట్టుబడులు రెండూ కలబోసిన పథకం.కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్‌పీఎస్ విధానంలో ఎవరైనా చేరొచ్చు.మూడో ఆకర్షణ ఏంటంటే దీనికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
national pension system: నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ దీర్ఘకాలిక పొదుపు సాధనం. పెన్షన్ కోసం ఉపయోగపడుతుంది. మార్కెట్ అనుసంధానిత పొదుపు సాధనంలో మంచి ఎంపిక.
పొదుపూ, పెన్షన్, పన్ను మినహాయింపూ, ఈక్విటీల్లో పెట్టుబడులు ఇవన్నీ కలబోసిన పథకం.
దీర్ఘ కాలిక పెట్టుబడి గానూ, ఉత్తమమైన పదవీ విరమణ పథకం గానూ ఎన్‌పీఎస్ ప్రాచుర్యం పొందింది. స్థూలంగా చెప్పాలంటే ఇదొక మ్యూచువల్ ఫండ్ లాంటిదే. అయితే విధివిధానాలు వేరుగా ఉంటాయి.
బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, స్టాక్ మార్కెట్లు.. ఇలా మూడింటిలో పెట్టుబడులకు ఎన్పీఎస్ అనుమతిస్తుంది.
భారత ప్రభుత్వ పరిధిలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంటరీ అథారిటీ (పీఎఫ్ఆర్డీయే) నెలకొల్పిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తోంది.
ఈ అథారిటీ భారత పార్లమెంటు చేసిన చట్టం ద్వారా ఏర్పడింది. అందువల్ల పెట్టుబడుల నిర్వహణపై అపోహలు అవసరం లేదు.
NPSలో చేరేందుకు అర్హులు ఎవరు?
18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల వారు ఎవరైనా చేరవచ్చు.
ప్రవాస భారతీయులు ఈ పథకంలో చేరవచ్చు. అయితే పీఐఓ కార్డు హోల్డర్లు ఇందుకు అనర్హులు.
NPS వల్ల ప్రయోజనాలు
50 వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగతంగా ఎన్‌పీఎస్ లో చేరితే ఇన్‌కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సీసీడీ (1బీ) ద్వారా ఈ పన్ను రాయితీ లభిస్తుంది. ఉద్యోగ సంస్థ కంట్రిబ్యూషన్ అయితే 80 సీసీడీ (2) సెక్షన్ ద్వారా పన్ను రాయితీ లభిస్తుంది.
80 సీ పరిధిలో మినహాయింపులు లక్షన్నర రూపాయలు పోనూ ఈ సెక్షన్ల ద్వారా రూ. 50 వేల మినహాయింపు పొందవచ్చు.
పథకం నిర్వహణకు ఖాతాదారు చెల్లించాల్సిన రుసుము నామమాత్రం. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, యులిప్స్ అయితే ఈ రుసుము ఎక్కువగా ఉంటుంది.
ఎన్‌పీఎస్ ద్వారా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుబడి పెడుతున్నందున మార్కెట్ బాగుంటే మన ఖాతా లాభాలు పండించవచ్చు.
ఎన్‌పీఎస్‌లో ఉండే స్కీములను మార్చుకోవచ్చు.
బాగా అనుభవం ఉన్న పెన్షన్ ఫండ్ మేనేజర్లు వీటిని నిర్వహించడం వల్ల నష్టభయం తక్కువనే చెప్పొచ్చు.
మొత్తం స్టాక్ మార్కెట్లు కాకుండా, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్ల రూపంలో కూడా పెట్టుబడులు ఉన్నందున నష్ట భయం తక్కువ.
లాకిన్ పీరియడ్ ఎక్కువ సమయం ఉండడం వల్ల మనం సులువుగా విత్ డ్రా చేసుకునేందుకు ఉండదు. దీర్ఘకాల పెట్టుబడులు అధిక రాబడులు ఇచ్చేందుకు అవకాశం ఉన్నందున లాకిన్ పీరియడ్ బాగా ఉపయోగపడుతుంది.
NPSలో ఎలా చేరాలి?
ఎన్‌పీఎస్ ట్రస్టు నిర్వహించే ఈఎన్‌పీఎస్ వెబ్ సైట్లో మన వివరాలు పొందుపరచడం ద్వారా మనం నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో చేరొచ్చు.
పాన్ కార్డు, నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్న బ్యాంకు ఖాతా తప్పనిసరి. పాన్ కార్డు, క్యాన్సిల్ చేసిన చెక్ స్కాన్ చేసి (సైజ్ 4 కేబీ నుంచి 2 ఎంబీ మధ్య ఉండాలి) జేపీజీ ఫార్మాట్‌లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
అలాగే ఫోటోగ్రాఫ్, మీ సంతకం స్కాన్ చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో భాగంగా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈకేవైసీ పూర్తవుతుంది.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత ప్రాన్ (పీఆర్ఏఎన్) నెంబర్ కేటాయిస్తారు. ఈ నెంబర్ కేటాయించినట్టు మెయిల్ వచ్చిన తరువాత ఎన్‌పీఎస్ వెబ్ సైట్లోకి వెళ్లి ఈ సైన్ ద్వారా అథెంటికేషన్ పూర్తిచేయాలి. లేదా ప్రింట్ తీసి కొరియర్ ద్వారా కూడా పంపొచ్చు.
ఎన్పీఎస్‌లో పెట్టుబడి సాధనాలను ఎలా ఎంచుకోవాలి?
ఎన్‌పీఎస్ ఈక్విటీలు(అసెట్ క్లాస్ ఈ), కార్పొరెట్ డెట్(అసెట్ క్లాస్ సీ), ప్రభుత్వ బాండ్లు(అసెట్ క్లాస్ జీ), ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (అసెట్ క్లాస్ ఏ)లలో పెట్టుబడులు పెడుతుంది. మన రిస్క్ సామర్థ్యాన్ని బట్టి మనం అసెట్ క్లాస్ ఎంచుకోవచ్చు.
పైగా ఇందులో రెండు ఎంపికలు ఉంటాయి. యాక్టివ్ ఛాయిస్, ఆటో ఛాయిస్ అనే రెండు ఎంపికలలో మనకు నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు.
స్టాక్ మార్కెట్లు, ఇతరత్రా పెట్టుబడులపై మనకు అవగాహన లేనప్పుడు ఆటో ఛాయిస్ ఎంపిక చేసుకుని ఈక్విటీ అసెట్ క్లాస్ ఎంచుకుంటే మీ స్టాక్స్ గరిష్టంగా ఈక్విటీలకు వెళతాయి. అయితే వయసు పెరిగినకొద్దీ ఈక్విటీల్లో పెట్టుబడులు తగ్గుతాయి. బాండ్లు, ఇతర కార్పొరెట్ డెట్లలో పెరుగుతాయి.
NPS డబ్బులు ఎప్పుడు వెనక్కి తీసుకోవచ్చు?
ఎన్‌పీఎస్ పెన్షన్ ఫండ్ అయినందున రిటైర్మెంట్ వయస్సు రావాలి. అంటే 60 ఏళ్లకు మనం నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే ఇందులో కేవలం 60 శాతం మాత్రమే వెనక్కి తీసుకోవచ్చు.
మిగిలినవి మనం నెలనెలా పెన్షన్ రూపంలో పొందేందుకు వీలుగా యాన్యుటీ కొనుగోలు చేయాలి. అయితే 60 ఏళ్ల నాటికి మీ నిధి మొత్తం రూ. 5లక్షలు దాటని పక్షంలో మొత్తం నిధులను వెనక్కి తీసుకోవచ్చు.
60 ఏళ్లు నిండకముందు కూడా ప్రీమెచ్యూర్ విత్ డ్రాయల్స్ కు అనుమతి ఉన్నా.. దీనికి పలు షరతులు అమలులో ఉన్నాయి. ఒకవేళ ఖాతాదారు చనిపోతే మొత్తం ఫండ్ వారసులకు లేదా నామినీకి ఇస్తారు.
సంబంధిత కథనం
టాపిక్