Uttarakhand tunnel: క్షేమంగా బయటకు వచ్చిన ఉత్తర కాశి సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు-workers trapped in uttarakhand tunnel evacuated after 17 days ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uttarakhand Tunnel: క్షేమంగా బయటకు వచ్చిన ఉత్తర కాశి సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు

Uttarakhand tunnel: క్షేమంగా బయటకు వచ్చిన ఉత్తర కాశి సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు

HT Telugu Desk HT Telugu
Nov 28, 2023 08:54 PM IST

Uttarakhand tunnel: ఉత్తర కాశి సొరంగం కుప్పకూలి అందులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సురక్షితంగా, ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. గత 17 రోజులుగా వారు ప్రాణాలు అరచేత పట్టుకుని ఆ సొరంగంలోనే గడిపారు.

సొరంగ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన మొట్టమొదటి కార్మికుడిని పరామర్శిస్తున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి
సొరంగ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన మొట్టమొదటి కార్మికుడిని పరామర్శిస్తున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి (PTI)

Uttarakhand tunnel: ఉత్తరాఖండ్ లో నిర్మాణంలో ఉన్న ఒక టన్నెల్ కూలిపోయి అందులో 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. గత 17 రోజులుగా వారు ఆ చీకటి సొరంగంలోనే చిక్కుకుపోయి ఉన్నారు. వారిని కాపాడేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ నాటి నుంచి కృషి చేస్తూనే ఉంది. ఎట్టకేలకు వారి కృషి, దేశ ప్రజల ప్రార్థనలు ఫలించి, ఆ 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం క్షేమంగా బయటకు వచ్చారు.

పైప్ ద్వారా ఆహారం..

పర్వతం కింది భాగంలో టన్నెల్ నిర్మాణం చేస్తుండగా, ఆ భాగం కుప్పకూలి, కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు అధికారులు నాటి నుంచి కృషి చేస్తూనే ఉన్నారు. అదృష్టవశాత్తూ వారు చిక్కుకుని ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన అధికారులు అక్కడికి చిన్న పైప్ ను పంపించి, దాని ద్వారా ప్రతీ రోజు ఆహారం, తాగు నీరు పంపించారు. ఆ తరువాత వివిధ మార్గాల ద్వారా ఆ కార్మికులను చేరుకోవడానికి ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

ర్యాట్ హోల్ మైనింగ్..

చివరకు ఇలాంటి సహాయ చర్యల్లో అనుభవం, నైపుణ్యం ఉన్న అంతర్జాతీయ నిపుణుల సహాయం తీసుకున్నారు. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా ఆ కార్మికులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సాయంత్రం నుంచి నిపుణుల పర్యవేక్షణలో ర్యాట్ హోల్ మైనింగ్ ప్రారంభించారు. చివరకు మంగళవారం సాయంత్రానికి కార్మికులు చిక్కుకుపోయి ఉన్న ప్రాంతం వరకు మైనింగ్ చేయగలిగారు. అనంతరం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడం ప్రారంభించారు. మొట్టమొదటి కార్మికుడిని మంగళవారం సాయంత్రం బయటకు తీసుకువచ్చారు. అతడిని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పరామర్శించారు. కార్మికులంతా స్వల్ప సమస్యలు మినహా ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం.

అధికారుల కృషి

గత 17 రోజులుగా ఆ కార్మికులను కాపాడడానికి ఉత్తరాఖండ్ అధికారులు, ఆర్మీ బీఆర్ఐ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అహర్నిశలు కృషి చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ మంగళవారం ప్రమాదం జరిగిన సిల్కియారా-బర్కోట్ సొరంగం వద్దకు చేరుకున్నారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి కార్మికులు సురక్షితంగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు చేశారు. సహాయ చర్యల విషయమై ప్రధాని మోదీ కూడా సీఎం ధామితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం తీసుకోవాలని సూచించారు.