Video : ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‍లో ఇంటర్వ్యూ కోసం వచ్చిన వేలాది మంది.. తొక్కిసలాట పరిస్థితి!
Air India Airport Jobs : ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం వేల మంది కదిలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో తొక్కిసలాట పరిస్థితి నెలకొంది.
ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఇటీవలే జాబ్స్ కోసం నోటిఫికేషన్ వేసింది. అయితే నిరుద్యోగులు ఎక్కువగా ఉండటంతో ఇంటర్వ్యూ కోసం వేల మంది తరలి వచ్చారు. Mirror Now ప్రకారం 25,000 మంది వ్యక్తులు ఇంటర్వ్యూ కోసం వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మంగళవారం ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు పిలిచింది. ఈ ప్రకటనతో ముంబైలోని కలీనాలో నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు రావడంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది.
నిరుద్యోగులు ఎక్కువగా రావడంతో పోలీసులకు కష్టతరమైంది. దీంతో ఆ ప్రదేశంలో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. ఇంటర్వ్యూలు నిర్వహించలేని పరిస్థితి వచ్చింది. అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను ఇచ్చి వెళ్లాలని కంపెనీ చెప్పింది. ఇంటర్వ్యూలు తర్వాత నిర్వహిస్తామని, ప్రాంగణాన్ని ఖాళీ చేయమని పేర్కొంది. నిరుద్యోగులు ఎక్కువగా రావడంతో నిర్వాహకులు వారి విధానాన్ని మార్చుకోవలసి వచ్చింది.
ఈ సంఘటన ఉద్యోగాలకు తీవ్రమైన పోటీని ఉందని చూపిస్తుంది. నిరుద్యోగం ఎంతగా ఉందో అద్దంపట్టేలా కనిపిస్తుంది. పెద్ద-స్థాయి రిక్రూట్‌మెంట్ ఈవెంట్‌ల నిర్వహణ గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇబ్బందులు ఉన్నా.. సమర్పించిన అన్ని రెజ్యూమ్‌లు సమీక్షిస్తామని, తదుపరి ప్రక్రియల కోసం అర్హులైన అభ్యర్థులను సంప్రదిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు.
ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలకు అధికారిక ప్రకటనను విడుదల చేయాల్సి ఉంది.
ఇటీవలే గుజరాత్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బరూచ్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో కేవలం 10 ఖాళీల కోసం వందలాది మంది వ్యక్తులు తరలివచ్చారు. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత తాజాగా ముంబయిలో నిరుద్యోగులు ఇంటర్వ్యూ కోసం భారీగా తరలివచ్చారు. రద్దీ కారణంగా తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఎటువంటి ప్రమాదం జరగలేదు.